అప్పుడేమో ‘వందే భారత్’.. ఇప్పుడేమో ‘బ్రేక్‌లు భారత్’
జార్ఖండ్‌లోని హటియా నుంచి యూపీలోని ఝాన్సీకి ఖాళీగా తరలిస్తున్న వందే భారత్ కోచ్‌లు బ్రేకింగ్ సిస్టమ్ లోపంతో బ్రేకులు పనిచేయకుండానే 463 కిలోమీటర్లు ప్రయాణించినట్లు సమాచారం. బ్రేకులు పనిచేయడం లేదని లోకో పైలట్లు అధికారులను హెచ్చరించినా రైలును ఎందుకు ఆపలేదనే ప్రశ్నలు తలెత్తాయి. ఘటనపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు. ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
By: A.N.Kumar | 17 Nov 2026 1:00 AM ISTభారతీయ రైల్వేలో టెక్నాలజీ విప్లవం అని గొప్పలు చెప్పుకునే ‘వందే భారత్’ ఎక్స్‌ప్రెస్ ఇప్పుడు సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది కానీ.. బ్రేకులు ఫెయిలైనా సరే ఏకంగా 463 కిలోమీటర్లు నాన్-స్టాప్‌గా పరుగెత్తడం చూస్తుంటే రైల్వే భద్రతా శాఖపై నవ్వుకోవాలో.. ఏడ్వాలో అర్థంకాక ప్రయాణికులు తలలు పట్టుకుంటున్నారు.
జార్ఖండ్‌లోని హటియా నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి ఈ వందే భారత్ కోచ్‌లను ఖాళీగా తరలిస్తున్నారు. ఇంజిన్‌కు కోచ్‌ల బ్రేకింగ్ సిస్టమ్‌ను కలపడంలో మన టెక్నీషియన్లు చేసిన చిన్న పొరపాటు వల్ల బ్రేకులు పూర్తిగా చేతులెత్తేశాయి. సరే ఇంజిన్ మారడంతో సమస్య వస్తుందని అనుకుందాం.. కానీ అసలు నాటకం ఇక్కడే మొదలైంది.
ప్రయాణం మొదలైన కొద్దిసేపటికే లోకో పైలట్ బ్రేకులు పనిచేయడం లేదని గుర్తించి రాంచీ స్టేషన్ అధికారులకు ఫోన్ చేసి మొరపెట్టుకున్నాడు. ఆ తర్వాత మూరి స్టేషన్‌లో డ్యూటీ ఎక్కిన మరో పైలట్ కూడా “అయ్యా బ్రేక్ పైప్‌లో ప్రెజర్ పడట్లేదు బ్రేకులు పడట్లేవు” అని గగ్గోలు పెట్టాడు. మరి ఈ హెచ్చరికలు విన్న మన రైల్వే పెద్దలు ఏం చేశారు? “అరవకండి టెన్షన్ పడకండి.. బ్రేకులు లేకపోతేనేం.. స్పీడ్ ఉంటుందిగా అలాగే పోనివ్వండి” అన్నట్లుగా చూస్తూ ఊరుకున్నారు.
చివరకు ఉత్తరప్రదేశ్‌లోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ స్టేషన్‌కు చేరాక అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటివరకు ఆ బ్రేక్‌లెస్ బుల్లెట్ అటూ ఇటూ ఎలాంటి అడ్డులేకుండా 463 కిలోమీటర్లు చక్కర్లు కొట్టిందన్నమాట.. అదే ఆ రైలులో గనుక సామాన్య ప్రయాణికులు ఉంటే.. వాళ్ల పరిస్థితి ఏ దేవుడి దయవల్ల దక్కేదో ఊహించుకుంటేనే వెన్నులో వణుకు పుడుతోంది.
ఇప్పుడు అధికారులు ఎప్పటిలాగే ఉన్నత స్థాయి విచారణ అంటూ హడావుడి చేస్తున్నారు. బ్రేకులు ఫెయిలయ్యాయని డ్రైవర్లు మొత్తుకున్నా రైలును ఎందుకు ఆపలేదు? ఎవరి ఆదేశాలతో అది ముందుకు కదిలింది? లాంటి ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.
వేగం ముఖ్యమే.. వందే భారత్‌లు రావాల్సిందే.. కానీ ప్రయాణికుల ప్రాణాలకంటే వేగం ఎక్కువ కాదనే కనీస జ్ఞానం అధికారులకు ఎప్పుడు వస్తుందో? నేడు ఖాళీ రైలు కాబట్టి అదృష్టవశాత్తు బతికిపోయాం.. రేపు ప్రయాణికులతో నిండిన రైలుకు ఇలాంటి అనుభవమే ఎదురైతే ఎవరు బాధ్యత వహిస్తారు? రైల్వేలో ‘స్పీడ్’ పెరిగింది కానీ అధికారుల మైండ్స్‌లో సేఫ్టీ బ్రేక్ మాత్రం ఇప్పటికీ పని చేయడం లేదనేది ఈ ఘటనతో మరోసారి రుజువైంది.
