Begin typing your search above and press return to search.

ఎక్స్ లో విన్నపం.. వందే భారత్ కు అప్పటికప్పుడు హాల్ట్

ఇలాంటి వేళ సికింద్రాబాద్ నుంచి విశాఖ పట్నానికి వచ్చే వందే భారత్ ట్రైన్ లో పెద్ద ఎత్తున ప్రయాణికులు ప్రయాణించారు.

By:  Garuda Media   |   30 Oct 2025 3:25 PM IST
ఎక్స్ లో విన్నపం.. వందే భారత్ కు అప్పటికప్పుడు హాల్ట్
X

కొన్ని నిర్ణయాల్ని అప్పటికప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది. పరిస్థితులకు అనుగుణంగా చేపట్టాల్సిన చర్యల విషయంలో తాను ముందు ఉంటానన్న విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే మరోసారి నిరూపించింది. సోషల్ మీడియాలో చేసిన విన్నపాన్ని పరిగణలోకి తీసుకోవటం.. వెను వెంటనే తగిన నిర్ణయాన్ని తీసుకొని.. వందే భారత్ రైలుకు ప్రత్యేక హాల్ట్ ను కల్పించిన అంశం ఆసక్తికరంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్ని అవస్థలకు గురి చేస్తున్న మొంథా తుపాను నేపథ్యంలో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

తుపాను నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రైళ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి వేళ సికింద్రాబాద్ నుంచి విశాఖ పట్నానికి వచ్చే వందే భారత్ ట్రైన్ లో పెద్ద ఎత్తున ప్రయాణికులు ప్రయాణించారు. వీరిలో చాలామంది దువ్వాడ పరిసర ప్రాంతాలకు చెందిన వారు. మామూలు రోజుల్లో అయితే విశాఖపట్నం నుంచి తమ ప్రాంతాలకు పబ్లిక్.. ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించి తమ గమ్యస్థానాలకు చేరుకుంటూ ఉంటారు.

అయితే.. తుపాను నేపథ్యంలో భారీ వర్షాల కారణంగా విశాఖ రైల్వే స్టేషన్ లో దిగి.. దువ్వాడ.. దాని పరిసర ప్రాంతాలకు వెళ్లటం ఇబ్బందిగా మారుతున్న కారణంగా.. ఇదే విషయాన్ని పేర్కొంటూ దువ్వాడ రైల్వే స్టేషన్ లో వందేభారత్ రైలుకు ప్రత్యేక స్టాప్ ను కల్పించాలని కోరుతూ ఎక్స్ ద్వారా రైల్వే ఉన్నతాధికారులకు విన్నవించారు. అదే సమయంలో ఇదే అంశాన్ని రైల్వే వినియోగదారుల సంఘం ప్రతినిది ఈశ్వర్ కూడా రైల్వే ఉన్నతాధికారుల ద్రష్టికి తీసుకెళ్లారు.

తుపాన్ ప్రభావాన్ని గుర్తించిన రైల్వే అధికారులు.. ప్రయాణికుల విన్నపాన్ని మన్నించారు. వెంటనే స్పందించి వందే భారత్ ట్రైన్ కు దువ్వాడలో హాల్ట్ కల్పించారు. ఎక్స్ లో కోరినంతనే ఉన్నతాధికారులు స్పందించటంతో పాటు.. అందుకుతగ్గట్లు హాల్ట్ కల్పించిన వైనంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. అయితే.. ఈ విషయాన్ని రైల్వే ఉన్నతాధికారులు ఎవరికి చెప్పకపోవటం.. ప్రచారం చేసుకోకుండా ఉన్న నేపథ్యంలో ఈ అంశం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. ఏమైనా.. పరిస్థితులకు అనుగుణంగా రైల్వే అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని పలువురు అభినందిస్తున్నారు.