మమతక్క ఇలాకా నుంచే...బెంగాల్ కి మోడీ వరం
కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఫోకస్ ఇపుడు పశ్చిమ బెంగాల్ మీద ఉంది. ఈ ఏడాది మేలో అక్కడ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.
By: Satya P | 2 Jan 2026 1:00 AM ISTకేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఫోకస్ ఇపుడు పశ్చిమ బెంగాల్ మీద ఉంది. ఈ ఏడాది మేలో అక్కడ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 294 అసెంబ్లీ సీట్లకు జరిగే ఈ ఎన్నికల్లో పూర్తి మెజారిటీని సాధించి తొలిసారిగా కాషాయ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ గట్టిగా భావిస్తోంది. ఇప్పటికే మోడీ అమిత్ షా బెంగాల్ పర్యటనలు మొదలెట్టారు. మమతా దీదీ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దాంతో మమతా కూడా ఏమీ తీసిపోలేదు, ఈ ఇద్దరినీ పట్టుకుని దుర్యోధన దుశ్శాసనులు అంటూ హాట్ కామెంట్స్ చేసి సంచలనం రేపారు.
వందే భారత్ అంటూ :
ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ జనాలకు ఒక వరాన్ని కేంద్రం ప్రకటించింది. మిడిల్ క్లాస్ ప్రజలను టార్గెట్ చేసుకుని కేంద్రం దేశంలో మొదటిసారిగా తీసుకుని వస్తున్న వందేభారత్ స్లీపర్ రైలుని బెంగాల్ నుంచే నడిపేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ రైలుని దేశంలో ప్రవేశపెడుతున్నామని కేంద్ర మంత్రి చెప్పారు.
ప్రధాని చేతుల మీదుగా :
వందేభారత్ స్లీపర్ రైలు కోల్‌కతా గౌహతి మధ్య నడుస్తుంది. దీనికి త్వరలో ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించనున్నారు ఇక దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలుగా నడిపే ఈ ఖ్య్హాతిని బెంగాల్ కి అంకితం చేశారు. రాబోయే 15 నుండి 20 రోజులలోపు ఈ రైలు పట్టాలెక్కుతుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి తయారు చేసిన వందే భారత్ స్లీపర్ రైలు చివరి హై స్పీడ్ ట్రయల్‌ను భారతీయ రైల్వే శాఖ తాజాగా పూర్తి చేసింది. వందేభారత్ స్లీపర్ రైలు వెయ్యి నుండి వెయ్యి ఐదు వందల కిలోమీటర్ల వరకూ సుదూర ప్రయాణాలకు అనుగుణంగా 16 కోచ్‌లతో డిజైన్ చేశారు.
ఫెసిలిటీస్ అదుర్స్ :
ఇక వందే భారత్ స్లీపర్ రైలులో సౌకర్యవంతమైన స్లీపర్ బెర్త్‌లు ఉంటాయి. అలాగే ఆటోమేటిక్ తలుపులు ఆధునిక మరుగుదొడ్లతో సహా అత్యాధునిక ప్రయాణీకుల సౌకర్యాలు ఉంటాయి. ఈ వందే భారత్ స్లీపర్ రైలులో థర్డ్ ఏసీకి ఆహారంతో కలిపి సుమారు రెండు వేల 300 రూపాయలు, సెకండ్ ఏసీకి మూడు వేల రూపాయలు ఫస్ట్ ఏసీకి మూడు వేల 600 రూపాయల వరకు ఛార్జీని నిర్ణయించారు ఈ రైలుని మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. అంతే కాదు వారిని దృష్టిలో ఉంచుకునే ఈ రైలు ఛార్జీలను నిర్ణయించినట్లుగా కేంద్ర మంత్రి తెలిపారు.
మరిన్ని రైళ్ళు :
ఇక ఇదే ఏడాది మరిన్ని వందే భారత్ స్లీపర్ రైళ్ళు దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రవేశపెట్టేందుకు కేంద్ర రైల్వే శాఖ నిర్ణయించింది. దాంతో విమాన ధరల కంటే తక్కువగా ఈ రైలు చార్జీలు ఉంటాయి కాబట్టి ఫీజిబిలిటీ బాగానే ఉంటుందని భారతీయ రైల్వే సాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక తొలి రైలు బెంగాల్ కి ఇవ్వడం ద్వారా రేపటి ఎన్నికలను టార్గెట్ చేసుకుంటున్నారు అని అంటున్నారు. చూడాలి మరి వందే భారత్ కానుకతో బీజేపీకి బెంగాల్ జనాలు ఎలాంటి ఫలితం అందిస్తారో.
