'వందేభారత్' స్లీపర్ వచ్చింది.. 'ఎన్నికల'కు ముడి పెట్టింది!
కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కారు కొలువుదీరిన తర్వాత.. భారత రైల్వేలలోనూ అనేక గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
By: Garuda Media | 17 Jan 2026 7:49 PM ISTకేంద్రంలో నరేంద్ర మోడీ సర్కారు కొలువుదీరిన తర్వాత.. భారత రైల్వేలలోనూ అనేక గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే వందే భారత్, నమో భారత్.. అంటూ.. ప్రత్యేక పేర్లతో రైళ్లను తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో వచ్చిన వందేభారత్ రైళ్లు ప్రజలకు మెరుగైన సౌకర్యాలను కల్పిస్తున్నాయనడంలో సందేహం లేదు. అయితే.. ఇప్పటి వరకు వచ్చిన వందేభారత్ రైళ్లే కేవలం సిట్టింగుకే పరిమితం.
ఈ నేపథ్యంలో కొత్తగా వందేభారత్ స్లీపర్ రైళ్లు తీసుకువచ్చేందుకు మూడేళ్ల కిందటే మోడీ సర్కారు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా.. తాజాగా తొలి వందేభారత్.. స్లీపర్ ఎక్స్‌ప్రెస్.. అందుబాటులోకి వచ్చింది. దీనిని పశ్చిమ బెంగాల్-అసోంల మధ్య ప్రవేశ పెట్టారు. బెంగాల్‌లోని హౌరా నుంచి అసోంలోని గౌహతి వరకు ఈ రైలు ప్రయాణించనుంది. మొత్తంగా ఏసీతోపాటు.. అన్నీ స్లీపర్ కోచ్‌లే ఉండడం ఈ రైలు ప్రత్యేకత. అంతేకాదు.. దీనిలో ఆర్ ఏసీ, వెయిటింగ్ లిస్టు వంటివాటిని అనుమతించరు.
తాజాగా శనివారం పశ్చిమ బెంగాల్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా వందే భారత్ స్లీపర్ ఎక్స్ ప్రెస్‌ను ప్రారంభించారు. అనంతరం.. బోగీలలోకి ఎక్కి.. వాటిని నిశితంగా పరిశీలిం చారు. రక్షణ వ్యవస్థ సహా.. సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి బోగీలోనూ ప్రత్యేక ఏర్పాట్లు ఉండ డం.. రంగురంగులుగా సీటింగ్‌ను రూపొందించడంతో పాటు వైఫై.. సహా ఇతర మెరుగైన సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఈ రైలు గంటకు 180 కిలో. మీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నారు. కనీస చార్జీ 960 రూపాయలు.
ఎన్నికల నేపథ్యంలో..
తాజాగా ప్రారంభించిన వందేభారత్ స్లీపర్‌కు.. ఎన్నికలకు సంబంధం ఉందా? అంటే.. ఖచ్చితంగా ఉందన్న ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఇటు పశ్చిమ బెంగాల్‌లోను.. అటు అసోంలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే కీలకమైన వందేభారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్‌ను ఈ రెండు రాష్ట్రాలకు కేటాయించారు. తద్వారా రెండురాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం ఎంతగా కట్టుబడి ఉందన్న విషయాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేయనున్నారు.
