అదిరే టెస్టులో వందేభారత్ ‘స్లీపర్’ ఇట్టే పాస్.. తెలిస్తే వావ్ అనేస్తారు
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ 2025లోనూ అందుబాటులోకి రాలేదు. ఈ హైస్పీడ్ ట్రైన్ కోసం అంతా ఎదురుచూస్తున్న వేళ.. దీనికి సంబంధించిన ఆసక్తికర అంశాన్ని కేంద్ర రైల్వే శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా వెల్లడించారు.
By: Garuda Media | 1 Jan 2026 1:57 PM ISTఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ 2025లోనూ అందుబాటులోకి రాలేదు. ఈ హైస్పీడ్ ట్రైన్ కోసం అంతా ఎదురుచూస్తున్న వేళ.. దీనికి సంబంధించిన ఆసక్తికర అంశాన్ని కేంద్ర రైల్వే శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా వెల్లడించారు. గంటకు 180కిలోమీటర్ల వేగంతో వందే భారత్ స్లీపర్ దూసుకెళ్లింది. అంతేనా..అంతకు మించిన మరో ముచ్చట కూడా ఉంది. ఇంత హైస్పీడ్ లోనూ ఎలాంటి కుదుపుల్లేకుండా వందే భారత్ ఇంజిన్ తన సత్తాను చాటింది. ఇందుకు పెట్టిన కఠినపరీక్షలో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యింది.
తాజాగా వందే భారత్ స్లీపర్ కు రైల్వే భద్రత కమిషనర్ సమక్షంలో దీనికి తుది పరీక్షలు నిర్వహించారు. రాజస్థాన్ లోని కోటా నుంచి మధ్యప్రదేశ్ లోని నాగ్దా మధ్య నడిపిన వందే భారత్ స్లీపర్ ట్రైన్ గంటకు 180కి.మీ. వేగాన్ని టచ్ చేసింది. ఇంత వేగంలో ట్రైన్ లోని బెర్తు వద్ద గాజు గ్లాసులో నీళ్లు నింపి.. ఒకదానిపై మరొకటి ఉంచినా ఏ మాత్రం తొణకని వైనం అందరిని ఆకర్షిస్తోంది.
ఏదో మాటలతో చెప్పకుండా.. దీనికి సంబంధించిన వీడియోను కేంద్ర రైల్వే మంత్రి సోషల్ మీడియాలో షేర్ చేశారు. హైస్పీడ్ లో ట్రైన్ ప్రయాణించే వేళలో స్థిరత్వం ఎలా ఉంది? కుదుపులు ఏమైనా ఉన్నాయా? జర్కులు ఏమైనా ఉన్నాయా? అన్న అంశాలతో పాటు బ్రేకులు ఎలా పని చేస్తున్నాయి? భద్రత ప్రమాణాల మాటేమిటి? అన్న అన్ని ప్రశ్నలకు వందే భారత్ స్లీపర్ ట్రైన్ వావ్ అనిపించేలా పెర్ ఫార్మ్ చేసింది.
తాజాగా పరీక్షించిన ట్రైన్ లో పదహారు బోగీలతో నడిపారు. వీటికి ఆకర్షణీయమైన ఇంటీరియర్.. స్లీపర్ బెర్తులు.. ఆధునాతన సస్పెన్షన్ వ్యవస్థ మాత్రమే కాదు.. మోడ్రన్ బాత్రూలు.. ఫైర్ ను ఇట్టే గుర్తించే సిస్టం ఈ ట్రైన్ సొంతం. నిజానికి సార్వత్రిక ఎన్నికలకు ముందే ఈ ట్రైన్ పట్టాలు ఎక్కుతుందని భావించారు. కానీ.. అది జరగలేదు.
చివరకు 2024 సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ ట్రైన్ ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్న అంచనాలు వ్యక్తమైనా.. అవేమీ వాస్తవరూపంలోకి రాలేదు. చూస్తుండగానే 2025 కూడా గడిచిపోయింది. కొత్త సంవత్సరంలో అడుగు పెట్టిన వేళ.. కనీసం ఏ ఏడాదైనా వందే భారత్ స్లీపర్ ప్రయాణికుల కోసం పట్టాలెక్కుతుందా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే.. ఈ ట్రైన్ ను ఎప్పటి నుంచి తీసుకొస్తున్న విషయాన్ని రైల్వే శాఖ ఇప్పటికి ఎలాంటి ప్రకటన చేయలేదు.
