Begin typing your search above and press return to search.

పట్టాలెక్కిన ఏడేళ్లకు వందేభారత్ లో జర్నీ చేసిన దాని రూపకర్త

భారత రైల్వే వ్యవస్థలో సమూల మార్పులకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ట్రైన్ గా వందే భారత్ ను చెప్పాలి.

By:  Garuda Media   |   26 Nov 2025 3:38 PM IST
పట్టాలెక్కిన ఏడేళ్లకు వందేభారత్ లో జర్నీ చేసిన దాని రూపకర్త
X

భారత రైల్వే వ్యవస్థలో సమూల మార్పులకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ట్రైన్ గా వందే భారత్ ను చెప్పాలి. అప్పటివరకున్న ట్రైన్లకు భిన్నంగా దాని రూపురేఖలు ఉండటం.. సామాన్య ప్రజలకు దూరంగా దాని టికెట్ ధరలు ఉండటం తెలిసిందే. పేదోడి ప్రయాణబండిలో ప్రయాణం కంటే దూరంగా చూసి.. ఇది మనమెక్కే రైలుబండి కాదన్నట్లుగా సామాన్యుడు ఫీలయ్యేలా చేసిన ట్రైన్ ఇది. కాకుంటే.. వందేభారత్ కు ముందున్న రైళ్లలో ప్రయాణించే అనుభూతిని పూర్తిగా మార్చేసిన వైనం తెలిసిందే.

పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారైన భారత్ తొలి హైస్పీడ్ రైలుగా దీన్ని చెప్పొచ్చు. ఈ ట్రైన్ కర్త.. కర్మ..క్రియ అన్నీ తానైన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ మాజీ జీఎం సుధాంశు మణి.. ఈ ట్రైన్ పట్టాలెక్కిన ఏడేళ్ల తర్వాత ఆయన ప్రయాణించారు. లక్నోలోని చార్ బాగ్ స్టేషన్ నుంచి ప్రయాగ్ రాజ్ వరకు వెళ్లిన ఆయన తన ప్రయాణ అనుభూతిని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక అంశాల్ని ప్రస్తావించారు. పాజిటివ్ లు కాకుండా నెగిటివ్ అంశాల్ని ప్రస్తావించేందుకు అస్సలు వెనుకాడని ఆయన ఫీడ్ బ్యాక్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఈ రైలు బయట నుంచి చూసేందుకు బాగుందన్న సుధాంశు.. ప్రయాణికులు కొందరే ఉన్నారని.. అదే విధంగా ట్రైన్ లోపల రెడ్ కార్పెట్ అనవసరమని పేర్కొన్నారు. నిజమే.. దక్షిణాది మినహా దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో ఇలాంటి ఖరీదైన ట్రైన్లకు పెద్దగా ఆదరణ ఉండదు. మనవద్ద తీసుకుంటే సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడిచే వందే భారత్ ట్రైన్ కు రద్దీ భారీగా పెరగటంతో ఇప్పుడు దాన్ని 20 బోగీలకు పెంచిన సంగతి తెలిసిందే. సుధాంశు పేర్కొన్నట్లుగా ఉత్తరాదిలో ఈ తరహా ఖరీదైన రైళ్లకు ఆదరణ అంతంతే.

రైలు వెలుపలి భాగం తాము నిర్మించిన దాని మాదిరే కనిపించిందని చెప్పిన ఆయన.. ‘‘చాలా రైళ్ల కన్నా మెరుగ్గా ఉంది. ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్ శుభ్రంగా ఉంది. ఇంటీరియర్ బాగుంది. పరిశుభ్రమైన ఆహారాన్ని అందిస్తున్నారు. రెడ్ కార్పెట్ ను అనవసరంగా పర్చారు. సీట్లు ప్రోటోటైప్ కన్నా సౌకర్యవంతంగా ఉన్నాయి. టాయిలెట్ చక్కగా పని చేస్తోంది. కాకుంటే అందులోని బాత్రూం వేర్ నాణ్యత అంతంతమాత్రమే. ప్రయాణం సౌకర్యంగా ఉంది. ప్రోటోటైప్ తో పోలిస్తే మెరుగుపడలేదు. యాక్సిలరేషన్ ఇప్పటికీ అద్భుతంగా ఉంది. ఇదే ఈ రైలు అతి పెద్ద బలం’’ అంటూ తన అనుభవాల్ని ఆయన నిర్మోహమాటంగా చెప్పేశారు.

ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఆక్యుపెన్సీ 25 శాతం కన్నా తక్కువ ఉందని.. ఛైర్ కార్ దాదాపు సగం సామర్థ్యంతోనే నడుస్తుందన్న ఆయన.. ‘‘ఈ పరిస్థితిని మేం చాలా కాలం క్రితమే ఊహించాం. స్లీపర్ వేరియంట్ లేకుండా డే ట్రైన్ మోడల్ లో ఈ ఇబ్బందులు తప్పవని తెలుసు. వీలైనంత త్వరగా స్లీపర్ వందేభారత్ ను తీసుకురావాలి. తన ప్రయాణం ప్లాన్ చేసుకొని కాకుండా అకస్మాత్తుగా అలా జరిగిపోవాలని నిర్ణయించుకున్నా. తరచూ నేనెళ్లే హైదరాబాద్.. బెంగళూరు.. చెన్నై.. ముంబయి లాంటి నగరాలకు లక్నో నుంచి రైలు ప్రయాణం అంత మంచి ఎంపిక కాదు’’ అని స్పష్టం చేశారు.

అన్నింటికి మించి వందేభారత్ స్లీపర్ వెర్షన్ తీసుకురావటంలోని జాప్యంపై రైల్వే శాఖపై విమర్శలు చేయటానికి అస్సలు మొహమాటపడలేదు. అంతేకాదు.. వందే భారత్ గరిష్ఠ వేగం కంటే తక్కువ వేగంతో నడవటంపైనా ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాను రూపొందించిన వందేభారత్ ట్రైన్ (అప్పట్లో ట్రైన్ 18)లో 2018లో ప్రయాణించారు. ఆ తర్వాత ఆయన ఇదే ప్రయాణించటం. తన ప్రయాణ అనుభవాల్ని ఆయనో బ్లాగ్ లో పేర్కొన్నారు. వందేభారత్ స్లీపర్ ను తీసుకురావటంలో ఎందుకు జాప్యం జరుగుతుందన్న సుధాంశు ప్రశ్నకు రైల్వే శాఖ సమాధానం ఇస్తే బాగుంటుంది.