Begin typing your search above and press return to search.

వంగవీటి విత్ వల్లభనేని...ఇంట్రెస్టింగ్ భేటీ !

వంగవీటి రాధాక్రిష్ణ వల్లభనేని వంశీ చాలా కాలం తరువాత ఒక్రే ఫ్రేమ్ లో కనిపించారు. రాధా టీడీపీలో కొనసాగుతున్నారు.

By:  Satya P   |   20 Aug 2026 12:38 PM IST
వంగవీటి విత్ వల్లభనేని...ఇంట్రెస్టింగ్ భేటీ !
X

వంగవీటి రాధాక్రిష్ణ వల్లభనేని వంశీ చాలా కాలం తరువాత ఒక్రే ఫ్రేమ్ లో కనిపించారు. రాధా టీడీపీలో కొనసాగుతున్నారు. వంశీ వైసీపీలో ఉన్నారు. రాజకీయ పార్టీల పరంగా ఇద్దరూ వేరు వేరు. అయితే ఈ ఇద్దరి స్నేహం మాత్రం దానికి అతీతమైనది అని అంటున్నారు. ఇక లేటెస్ట్ గా చూస్తే రాధా ఇంటికి వంశీయే వెళ్ళారు. దానికి ఒక కారణం ఉంది. తన స్నేహితుడు కంఠంనేని శ్రీనివాసరావు కుమారుడి వివాహానికి రాధాను ఆహ్వానించడానికి వంశీ ఆయనను వెంటబెట్టుకుని వెళ్ళారు అని అంటున్నారు. ఇక ఈ ఇద్దరూ ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా కబుర్లు చెప్పుకున్నారు అని అంటున్నారు.

గతంలో కూడా :

ఇంతకు ముందు రాధా కుమార్తె నామకరణం వేడుకకు వంశీని కొడాలి నానిని ఇతర వైసీపీ నేతలను రాధా ఆహ్వానించారు అని గుర్తు చేస్తున్నారు. అప్పట్లో ఆ ఫోటోలు అన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇపుడు కూడా మరో సారి వైరల్ అవుతున్నాయి. ఇక వల్లభనేని వంశీ టీడీపీలో ఉంటూ రెండు సార్లు ఎమ్మెల్యేగా గన్నవరం నుంచి గెలిచారు. ఆయన 2019 వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ వైపుగా వెళ్ళారు. 2024 ఎన్నికలలో పోటీ చేస్తే ఓటమి ఎదురైంది. ఇక టీడీపీ వైసీపీ ఏపీలో బద్ధ శత్రువుల మాదిరిగా రాజకీయం చేస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ నేతలతో టీడీపీ వారు కనిపించకూడదని పార్టీ ఆదేశాలు జారీ చేసినది కూడా అందరికీ తెలిసిందే. అయితే రాజకీయాలకు అతీతంగా స్నేహాలను చూడాలని అంటున్నారు.

ఈ సమయంలో కలయిక :

ఇదిలా ఉంటే ఇటీవల రెండు ఎమ్మెల్సీ పోస్టులు గవర్నర్ కోటాలో టీడీపీ భర్తీ చేసింది. అయితే అందులో ఒకటి రాధాకు దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ అది జరగలేదు. దాంతో ఆయన వర్గీయులలో నిరాశ ఆవరించింది. రాధాకు టీడీపీలో ఇంతవరకూ ఏ పదవీ దక్కలేదని గుర్తు చేస్తున్నారు. 2019 ఎన్నికల ముందు రాధా వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు. ఆ ఎన్నికల్లో టికెట్ దక్కలేదు, అయినా పార్టీ కోసం పనిచేశారు. అయితే టీడీపీ ఓటమి పాలు కావడంతో ఆయనకు అవకాశాలు రాలేదు. ఇక 2024 ఎన్నికల్లో కూడా రాధాకు టికెట్ దక్కలేదు. అయినా పార్టీ కోసం ప్రచారం చేశారు అని గుర్తు చేస్తున్నారు. రెండేళ్ళకు పైగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ మధ్యలో రాజ్యసభ సీట్లు అలాగే ఎమ్మెల్సీ పోస్టులు భర్తీ అవుతున్నాయి కానీ రాధా వరకూ అవి రావడం లేదు అని అంటున్నారు. దీంతో రాధా వర్గీయులు అయితే ఆవేదన చెందుతున్నారు. సరిగ్గా ఈ సమయంలో రాధాను కలవడం రాజకీయంగానూ చర్చగా ఉంది.

సహనంతోనే ఆయన :

అయితే ఎవరు ఎలా అనుకున్నా రాధా మాత్రం సహనంతోనే వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు. ఆయన వేచి చూసే ధోరణిని అనుసరిస్తున్నారు. టీడీపీ ద్వారా పదవులు వస్తాయని నమ్మకంతోనే ఉన్నారు అని అంటున్నారు. అందుకే పెదవి విప్పడం లేదు, ఎక్కడా బయటపడడం లేదు అని గుర్తు చేస్తున్నారు. అయితే రాధా సహనానికి వేచి ఉంటున్న దానికి మంచి ఆఫర్ ఆయనకు దక్కుతుందని కూడా మాట వినిపిస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే రాధా ఇంటికి వల్లభనేని వంశీ వెళ్ళడం మీద రాజకీయ చర్చ సాగుతున్నా ఇది కేవలం స్నేహ పూర్వకమైన భేటీగానే అంటున్నారు.