వల్లభనేని వంశీ అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారా..!
అవును... పలు కేసుల్లో బెయిల్ పై బయటకు వచ్చిన వల్లభనేని వంశీ.. గత కొన్ని రోజులుగా కనిపించడం లేదని.. ఫోన్ కూడా స్విచ్చాఫ్ వస్తుందనే విషయం ఇప్పుడు ప్రధానంగా గన్నవరం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది.
By: Raja Ch | 30 Dec 2025 9:46 AM ISTగన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారా.. విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టులో విచారణలో ఉన్న సత్యవర్ధన్ కేసు వాయిదాకు సోమవారం హాజరుకావాల్సి ఉన్నా ఎందుకు రాలేదు.. ఫోన్ ఎందుకు స్విచ్చాఫ్ వస్తోంది.. సమన్లు ఇచ్చేందుకు వెళ్లిన పోలీసులకు సమాధానం ఎందుకు లేదు.. ప్రస్తుతం ఈ ప్రశ్నలు తెరపైకి వచ్చాయి! వంశీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లునారనే ప్రచారం బలంగా జరుగుతోంది.
అవును... పలు కేసుల్లో బెయిల్ పై బయటకు వచ్చిన వల్లభనేని వంశీ.. గత కొన్ని రోజులుగా కనిపించడం లేదని.. ఫోన్ కూడా స్విచ్చాఫ్ వస్తుందనే విషయం ఇప్పుడు ప్రధానంగా గన్నవరం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. అయితే... వంశీని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఈ నెల 17న విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్ లో హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే వంశీ కనిపించడం లేదా అనే చర్చా తెరపైకి వచ్చింది.
మాచవరం పోలీసులు తనను అరెస్ట్ చేస్తారన్న అనుమానం, ఆందోళనతోనే ఆయన అండర్ గ్రౌండ్ లోకి వెళ్లి ఉంటారని అంటున్నారు. ఈ కేసులో వల్లభనేని వంశీతో పాటు మరికొంతమందిని నిందితులుగా చేర్చారు. 2024 జూన్ 7న సునీల్ పై దాడి చేయమని.. వల్లభనేని వంశీ తన అనుచరులను రెచ్చగొట్టారని.. దీంతో, వారు కర్రలు, మారణాయుధాలతో అతన్ని తీవ్రంగా గాయపరిచారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే మాచవరం స్టేషన్ లో కేసు నమోదైంది!
ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి సమన్లు ఇచ్చేందుకు పోలీసులు మాజీ ఎమ్మెల్యే వంశీ ఇంటికి వెళ్లారని.. అయితే ఆయన మాత్రం వారికి అందుబాటులోకి రాలేదని అంటున్నారు. మరోవైపు ఇప్పటికే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించినా ఉపశమనం లభించలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఫోన్ స్విచ్చాఫ్ చేసి, వంశీ అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోయి ఉంటారని ప్రచారం జరుగుతోంది.
అయితే విజయాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టులో విచారణలో ఉన్న సత్యవర్ధన్ కేసు వాయిదా సోమవారం ఉండటంతో.. కోర్టు వాయిదాకైనా వంశీ వస్తారని పోలీసులు భావించారని అంటున్నారు. అయితే.. వంశీ మాత్రం వాయిదాకు హాజరుకాలేదు! మరోవైపు సునీల్ పై దాడి కేసులో నిందితుడిగా ఉన్న ఆయన అనుచరుడు కూడా కోర్టు వాయిదాకు రాలేదు. ఇదే సమయంలో.. ఆయన మిగిలిన అనుచరులు సైతం అజ్ఞాతంలో ఉన్నారని చెబుతున్నారు. దీంతో పోలీసులు గాలిస్తున్నారని అంటున్నారు.
కాగా... వల్లభనేని వంశీని ఫిబ్రారి 13న హైదరాబాద్ లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిమే. సత్యవర్ధన్ కేసులో వంశీని అరెస్ట్ చేశారు. ఈ సమయంలో వంశీపై సుమారు 11 కేసులు నమోదు కాగా.. ఇటీవల అన్నింటిలోనూ కాస్త ఊరట లభించింది! దీంతో.. విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన సుమారు 137 రోజుల తర్వాత బయటకు వచ్చారు.
