Begin typing your search above and press return to search.

వంశీ రీస్టార్ట్.. గన్నవరంలో వైసీపీ నేత సందడే.. సందడి

ప్రస్తుతానికి తన మకాం హైదరాబాద్ లోనే ఉన్నా వారంలో ఒకటి రెండు సార్లు నియోజకవర్గంలో పర్యటిస్తూ వంశీ తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు.

By:  Tupaki Political Desk   |   25 March 2026 10:14 PM IST
వంశీ రీస్టార్ట్.. గన్నవరంలో వైసీపీ నేత సందడే.. సందడి
X

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ఫైర్ బ్రాండ్ వల్లభనేని వంశీమోహన్ తన నియోజకవర్గంలో మళ్లీ యాక్టివ్ అయ్యారు. గత ఏడాది ఫిబ్రవరిలో అరెస్టు అయిన వంశీ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా కాలం సైలెంటు అయ్యారు. ఇంకా చెప్పాలంటే గత ఎన్నికల్లో ఎదురైన ఓటమితో షాక్ కు గురైన వంశీ ఇప్పటివరకు రాజకీయంగా పెద్దగా హడావుడి చేసింది లేదని అంటున్నారు. ఇదే సమయంలో వంశీ రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారని, ఆయన బదులుగా వంశీ భార్య పంకజశ్రీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని రకరకాల ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాలు, ఊహాగానాలకు తెరదించుతూ మాజీ ఎమ్మెల్యే వంశీ గన్నవరంలో చురుకుగా తిరుగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో నేనే క్యాండిడేట్ అంటూ వంశీ సంకేతాలిస్తున్నారు.

ఇటీవల కాలంలో గన్నవరం నియోజకవర్గంలో వంశీ తరచుగా పర్యటిస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన ఎక్కువగా హైదరాబాద్ కే పరిమితమయ్యారు. దాదాపు తొలి ఏడాది మొత్తం నియోజకవర్గంవైపు చూడకపోవడంతో ఆయన అండర్ గ్రౌండుకి వెళ్లిపోయారని ప్రత్యర్థులు ప్రచారం చేశారు. ఇక అరెస్టు తర్వాత వంశీ రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు ఊహాగానాలు షికారు చేశాయి. అయితే ఇవన్నీ ఉత్తుత్తివే అంటూ వంశీ తాజా అడుగులు చెబుతున్నాయి.

ప్రస్తుతానికి తన మకాం హైదరాబాద్ లోనే ఉన్నా వారంలో ఒకటి రెండు సార్లు నియోజకవర్గంలో పర్యటిస్తూ వంశీ తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. పెళ్లిళ్లు, పంక్షన్లకు క్రమం తప్పకుండా హాజరవుతూ వచ్చి ఎన్నికల కోసం గ్రౌండ్ వర్క్ గట్టిగానే చేస్తున్నారని అంటున్నారు. 2029 ఎన్నికల్లో గన్నవరం నుంచి వంశీనే అభ్యర్థి అంటూ వైసీపీ అధినేత జగన్ కూడా తేల్చెచెప్పారని అంటున్నారు. వంశీని కాదని గన్నవరంలో మరో నేతను బరిలోకి దింపలేనని జగన్ స్పష్టం చేశారని, ఆ కారణంతోనే వంశీ గన్నవరంపై ఫోకస్ పెంచారని ప్రచారం జరుగుతోంది.

గన్నవరంలో వంశీకి భారీ అనుచురగణం ఉంది. టీడీపీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ 2019 ఎన్నికల తర్వాత వైసీపీలో చేరారు. టీడీపీ ఎమ్మెల్యేగా ఉంటూనే ఆ పార్టీ అధిష్టానంపై విమర్శల దాడి చేసేవారు. వంశీ విమర్శలు పరిధి దాటాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో వైసీపీలో చేరిన వంశీపై టీడీపీలో సామాన్య కార్యకర్త నుంచి అధినేత వరకు గుర్రుగా ఉన్నారని చెబుతున్నారు. ప్రస్తుతం టీడీపీ తిరుగులేని అధికారంలో ఉండటంతో వంశీ రాజకీయంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆయన పాలిటిక్స్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. కానీ, తాజా పరిణామాలు గమనిస్తే వంశీ మళ్లీ పోటీ ఖాయమన్న అభిప్రాయమే ఎక్కువగా వ్యక్తమవుతోంది.