వల్లభనేని వంశీ 2.0.. మళ్లీ మొదలు పెట్టేసిన మాజీ ఎమ్మెల్యే!
వైసీపీ కీలకనేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ మళ్లీ తన పాత పంథాలో రాజకీయంగా దూకుడు చూపుతున్నారు.
By: Tupaki Political Desk | 15 Oct 2026 2:45 PM ISTవైసీపీ కీలకనేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ మళ్లీ తన పాత పంథాలో రాజకీయంగా దూకుడు చూపుతున్నారు. స్థానిక ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు చేర్చే బాధ్యతను భుజానికెత్తుకున్న వంశీ వరుసగా కేడర్ తో సమావేశాలు నిర్వహిస్తూ ధైర్యం నూరుపోస్తున్నారు. ఈ క్రమంలో ఊడత ఊపులకు తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరన్నట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తనకు భయం లేదని, తన అనుచరులు కూడా భయపడొద్దు అంటూ వంశీ చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి.
స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో వంశీ వరుసగా కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు. ఈ క్రమంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత ప్రభుత్వంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం ద్వారా వంశీ కూటమి ప్రభుత్వానికి టార్గెట్ అయ్యారని చెబుతున్నారు. దీంతో కూటమి గెలిచిన వెంటనే ఆయన కొంత తగ్గినట్లు కనిపించినా, ప్రస్తుతం మళ్లీ పూర్తిస్థాయిలో రాజకీయాలు చేస్తూ తన దూకుడును కొనసాగిస్తున్నారని అంటున్నారు.
గన్నవరం నియోజకవర్గంలో వరుస కార్యక్రమాల్లో వంశీ చేస్తున్న వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. రెండు రోజుల క్రితం తనను లోపల వేసిన వాడిని లోపలికి పంపిన నాయకుడు తనతో ఉన్నాడని చెబుతూ తనకు అండదండగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఉన్నారని, ఆయన కోసం తాను తెగించి పనిచేస్తానని స్పష్టం చేసినట్లుగా భావిస్తున్నారు. ఇక తాజాగా కూడా మాజీ సీఎం జగన్ రెడ్డి గొప్పతనాన్ని చాటిచెబుతూ వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో పార్టీని పెట్టి అధికారంలోకి వచ్చిన నాయకులు ముగ్గురే ఉన్నారని చెబుతూ, ఆ ఘనత సాధించిన నేతలుగా ఎన్టీఆర్, కేసీఆర్, జగన్ రెడ్డి పేర్లను ప్రస్తావించారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎందరో పార్టీలు పెట్టినా అధికారంలోకి రాలేకపోయారని, కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మాత్రం తన విస్తృత జనాకర్షణతో పార్టీని గెలిపించుకోగలిగారని వంశీ కొనియాడారు. మళ్లీ జగన్ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఇదే సమయంలో ఆయన బెదిరింపులకు లొంగేది లేదు అన్నట్లు చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేస్తున్నాయి. ఇప్పటికే పలు కేసుల ఎదుర్కొని, జైలుకు వెళ్లి వచ్చిన వంశీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ద్వారా కూటమి ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పెద్దలను తన ట్రాప్ లోకి లాగే ప్రయత్నం చేస్తున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
తన విమర్శలకు సమాధానం చెప్పలేని విధంగా మాటల బాణాలు విసరడం ద్వారా ప్రజల్లో తన పట్ల సానుభూతి పెంచుకోవాలని వంశీ వ్యూహంగా ఉందని అంటున్నారు. ఒకవేళ కూటమి ప్రభుత్వం మళ్లీ కేసులు నమోదు చేయించి అరెస్టు చేసేందుకు ప్రయత్నించినా, అది తనకు అనుకూలంగా మారుతుందని ఆయన భావిస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. లేనిపక్షంలో తన మాటలతో వైసీపీ కార్యకర్తల్లో ఉత్తేజం నింపి ప్రభుత్వంపై దూకుడుగా పోటీ చేసేందుకు పనికొస్తుందన్న ఆలోచన కూడా ఉండొచ్చని అంటున్నారు. మొత్తానికి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని తాజా వ్యూహం రాజకీయంగా ఆసక్తి రేపుతోందని అంటున్నారు.
