Begin typing your search above and press return to search.

93 ఏళ్ల ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ఇకలేరు... ఈయన డిజైన్స్ లెక్కే వేరు!

అవును... ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ వాలెంటినో గరవాని 93 ఏళ్ల వయసులో మరణించారు. ఈ క్రమంలో ఆయన భౌతికకాయాన్ని బుధవారం, గురువారం రోమ్ లోని ఫౌండేషన్ ప్రధాన కార్యాలయంలో ఉంచుతారు.

By:  Raja Ch   |   20 Jan 2026 6:00 PM IST
93 ఏళ్ల ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ఇకలేరు... ఈయన డిజైన్స్ లెక్కే వేరు!
X

దాదాపు అర్ధ శతాబ్దం పాటు ఫ్యాషన్ షోలో ప్రధాన ఆకర్షణగా నిలిచిన హైగ్లామర్ గౌన్లు.. తరచుగా వాలెంటినో రెడ్ షేడ్‌ లో ఉండే ఇటాలియన్ జెట్ సెట్ డిజైనర్ వాలెంటినో గరవాని.. రోమ్‌ లోని తన ఇంట్లో మరణించినట్లు ఆయన ఫౌండేషన్ సోషల్ మీడియాలో ప్రకటించింది. ఆయన వయసు 93 సంవత్సరాలు. ఈ సందర్భంగా రాజకుటుంబాల నుంచి ప్రథమ మహిళలు, హాలీవుడ్ నటీ మణుల వరకూ అందరినీ ఆకర్షించిన ఈ డిజైనర్ ప్రతిభ మరోసారి తెరపైకి వచ్చి చర్చనీయాంశంగా మారింది.

అవును... ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ వాలెంటినో గరవాని 93 ఏళ్ల వయసులో మరణించారు. ఈ క్రమంలో ఆయన భౌతికకాయాన్ని బుధవారం, గురువారం రోమ్ లోని ఫౌండేషన్ ప్రధాన కార్యాలయంలో ఉంచుతారు. అనంతరం శుక్రవారం పియాజ్జా డెల్లా రిపబ్లికాలోని బసిలికా శాంటా మారియా డెగ్లి ఏంజెలి ఇ డీ మార్టిరిలో అంత్యక్రియలు జరుగుతాయి. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకతలు, ఆయన డిజైన్ లకు ముగ్ధులైన సెలబ్రెటీలు, సందర్భాలు చర్చకొస్తున్నాయి.




రాజ కుటుంబీకులు, దేశ ప్రథమ మహిళలు, సినీ తారలు తరతరాలుగా ఆరాధించే డిజైనర్.. వాలెంటినో గరవాని. ఈయన ఎల్లప్పుడూ తమను ఉత్తమంగా కనిపించేలా చేస్తాడని వారు చెబుతుంటారు. ఈ క్రమంలో... 1979 విప్లవం సమయంలో ఇరాన్ రాణి ఫరా పహ్లవి దేశం విడిచి పారిపోయినప్పుడు, ఆమె వాలెంటినో తయారు చేసిన కోటును ధరించినట్లు చెబుతారు. ఆమె ముస్లిం సమాజంలో పట్టాభిషేకం చేసిన తొలి మహిళ. అప్పుడు ఆమె వయసు కేవలం 29 సంవత్సరాలు!

1960లలో రోమ్‌ లో తన తొలి రోజుల నుండి 2008లో పదవీ విరమణ వరకు వాలెంటినో చెప్పేది ఒకటే మాట అని అంటారు.. అదే.. 'స్త్రీలు ఏమి కోరుకుంటున్నారో నాకు తెలుసు' అని! అందుకే హాలీవుడ్ తారలు, ప్రథమ మహిళలు, రాజ కుటుంబాలు వారి వారి ప్రత్యేక సందర్భాల్లో కచ్చితంగా వాలెంటినో డిజన్ లనే ధరించేవారు. ఉదాహరణకు... 2001లో రాబర్ట్స్ తన ఉత్తమ నటి అవార్డును స్వీకరించడానికి వేదికపైకి వెళ్లినప్పుడు.. ఆమె పాతకాలపు నలుపు, తెలుపు వాలెంటినో డిజైన్ ను ధరించారు.




ఇదే క్రమంలో... 2005లో ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్ అవార్డును గెలుచుకున్నప్పుడు కేట్ బ్లాంచెట్ కూడా వెన్న-పసుపు పట్టు రంగులో ఉన్న వాలెంటినోను ధరించింది. అంతకంటే ముందు.. 1968లో గ్రీకు షిప్పింగ్ మాగ్నెట్ అరిస్టాటిల్ ఒనాసిస్‌ తో జరిగిన వివాహం కోసం జాక్వెలిన్ కెన్నెడీ ధరించిన పొడవాటి చేతుల లేస్ డ్రెస్ వెనుక వాలెంటినో ఉన్నారు. ఇది అప్పట్లో యునైటెడ్ స్టేట్స్‌ లో సంచలనం సృష్టించింది.




ఇదే సమయంలో... వేల్స్ యువరాణి డయానా కూడా ఎక్కువగా వాలెంటినో డిజైన్స్ నే ప్రిఫర్ చేసేవాళ్లని చెబుతారు. అంతే కాదు 1970లో న్యూయార్క్ లో షాప్ ఓపెన్ చేసిన తొలి ఇటాలియన్ డిజైనర్ గా వాలెంటినో నిలిచారు.

కాగా... మే 11, 1932న ఉత్తర ఇటలీలోని వోగెరా పట్టణంలో ఒక సంపన్న కుటుంబంలో జన్మించాడు వాలెంటినో. చిన్ననాటి సినిమా ప్రేమ తనను ఫ్యాషన్ బాటలోకి నడిపించిందని ఆయన చెప్పేవారు. సంవత్సరాలు గడిచేకొద్దీ ఈ డిజైనర్ తన దుస్తులకు రెడీ-టు-వేర్, పురుషుల దుస్తులు జోడించడంతో అతని సామ్రాజ్యం మరింత విస్తరించింది. ఈయన 2008లో పదవీ విరమణ చేశాడు. ఈ క్రమంలో 93 ఏళ్ల వయసులో మరణించారు!