Begin typing your search above and press return to search.

20 వ‌య‌సులోపు 200కోట్లు: IPL 2026 సెన్సేష‌న్ వైభవ్ సూర్యవంశీ సంపాద‌న‌!?

భారత క్రికెట్ రంగంలో సరికొత్త వండర్‌కిడ్‌గా దూసుకొచ్చిన 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ క్రేజ్ ఐపీఎల్ 2026 సీజన్ తర్వాత ఆకాశాన్ని తాకింది.

By:  Sivaji Kontham   |   3 Jun 2026 4:00 PM IST
20 వ‌య‌సులోపు 200కోట్లు: IPL 2026 సెన్సేష‌న్ వైభవ్ సూర్యవంశీ సంపాద‌న‌!?
X

భారత క్రికెట్ రంగంలో సరికొత్త వండర్‌కిడ్‌గా దూసుకొచ్చిన 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ క్రేజ్ ఐపీఎల్ 2026 సీజన్ తర్వాత ఆకాశాన్ని తాకింది. మైదానంలో అతడు చూపిస్తున్న విధ్వంశ‌క‌ర‌ బ్యాటింగ్ శైలి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షించడమే కాకుండా.. బిజినెస్ మార్కెట్‌లోనూ అతని బ్రాండ్ వాల్యూను అసాధారణ స్థాయికి తీసుకెళ్లింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ఐపీఎల్ ముగిసిన కొద్ది రోజుల్లోనే వైభవ్ బ్రాండ్ ఎండార్స్‌మెంట్ (ప్రకటనల) ఫీజు దాదాపు రెట్టింపు అయింది. భవిష్యత్తులో ఈ యువ సంచలనం గనుక ఐపీఎల్ మెగా వేలంలోకి వస్తే ఏకంగా 30 కోట్ల వరకు ధర పలికే అవకాశం ఉందనే అంచనాలు అప్పుడే ఇండస్ట్రీలో మొదలయ్యాయి.

ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీతో 1.10 కోట్ల వార్షిక కాంట్రాక్ట్‌లో ఉన్న వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్ నిబంధనల ప్రకారం తన శాలరీ పెరగడానికి మరికొంత కాలం వేచి చూడాల్సిందే. కానీ ప్రకటనల మార్కెట్లో మాత్రం అతడి సంపాదన అప్పుడే ఊహించని మలుపు తిరిగింది. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ ఏకంగా 237.30 స్ట్రైక్-రేట్‌తో 776 పరుగులు సాధించి సరికొత్త రికార్డులు సృష్టించాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనతో అత్యధిక పరుగులు చేసినందుకు గానూ ప్రతిష్టాత్మక `ఆరెంజ్ క్యాప్` సొంతం చేసుకోవడమే కాకుండా ఈ సీజన్ `మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్` (MVP) అవార్డును కూడా కైవసం చేసుకుని ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాడు.

ఈ సరికొత్త సంచలనంతో కార్పొరేట్ కంపెనీలు వైభవ్ సూర్యవంశీతో డీల్స్ కుదుర్చుకోవడానికి క్యూ కడుతున్నాయి. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు వైభవ్ ఒక్కో బ్రాండ్ ప్రకటన కోసం దాదాపు 1 కోటి వరకు ఛార్జ్ చేసేవాడు. ఆ సమయంలోనే యువ ఆట‌గాడు ప్రముఖ బ్రాండ్లయిన కాంప్లాన్ , రెడ్ బుల్ లతో కోటి రూపాయల రేంజ్‌లో ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. అయితే ఐపీఎల్‌లో అతడు సృష్టించిన విధ్వంసం తర్వాత ఇప్పుడు తన కొత్త ఎండార్స్‌మెంట్ ఫీజును ప్రతి డీల్‌కు 1.5 కోట్ల నుండి 2 కోట్ల వరకు పెంచాడ‌ని ఇండస్ట్రీ నిపుణులు వెల్లడించారు.

ప్ర‌స్తుతం డ‌జ‌ను పాపుల‌ర్ బ్రాండ్ల‌కు ఏడాది సీజ‌న్ (2026-2027)కు కాంట్రాక్టులు సంత‌కం చేయ‌డం ద్వారా అత‌డు ఏకంగా 20కోట్ల వ‌ర‌కూ సంపాదించుకునే వీలుంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. IPL 2026 సెన్సేష‌న్ వైభవ్ సూర్యవంశీ 100 కోట్లు సంపాదించ‌డానికి ఎంత‌కాలం ప‌డుతుంది? అనే ప్ర‌శ్న‌కు స‌మాధానాన్ని ఎవ‌రైనా పై విశ్లేష‌ణ‌ను బ‌ట్టి స్వ‌యంగా అంచ‌నా వేయొచ్చు. ఐపిఎల్ కు ఆడుతూ ఏడాదికి 30కోట్లు సంపాదిస్తే, బ్రాండ్స్ తో మ‌రో 20కోట్లు ఆర్జించ‌గ‌లిగితే కేవ‌లం మ‌రో రెండేళ్ల‌లోనే(2028 నాటికే) అత‌డు 100 కోట్లు ఆర్జించే వీలుంటుంద‌ని అంచ‌నా వేయ‌వ‌చ్చు. అయితే ఈ ఫీట్ సాధించాలంటే అత‌డు స్థిరంగా 2026 ఐపిఎల్ త‌ర‌హాలో రాణించాల్సి ఉంటుంది. ప్ర‌తి హాఫ్ సెంచ‌రీ, ప్ర‌తి సెంచ‌రీ అత‌డి మ‌నుగ‌డ‌ను, ఆదాయ ఆర్జ‌న‌ను నిర్ధేశించ‌గ‌ల‌వు.

ప్రస్తుతం కేవలం 15 ఏళ్ల వయస్సు మాత్రమే ఉన్న వైభవ్‌కు సంబంధించిన బ్రాండ్ పోర్ట్‌ఫోలియోను అతడి తల్లిదండ్రులు జాగ్ర‌త్త‌గా పర్యవేక్షిస్తున్నారు. వారితో పాటు అతడి ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం కూడా ఈ యువ ఆటగాడిని సరైన రీతిలో ప్రమోట్ చేయడానికి... మంచి బ్రాండ్లను ఎంచుకోవడానికి వెన్నుముకగా నిలిచింది. క్రికెట్ విశ్లేషకులు - మాజీ క్రికెట్ దిగ్గజాలు అప్పుడే సూర్యవంశీని సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, సునీల్ గవాస్కర్ వంటి లెజెండ్స్ సరసన చేరుస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే కెరీర్ ప్రారంభంలోనే వస్తున్న ఈ విపరీతమైన పాపులారిటీ భారీ ఆర్థిక ప్రయోజనాల వల్ల ఆట నుంచి దూరంగా దృష్టి మరలకుండా అతడి మేనేజ్‌మెంట్ టీమ్ చాలా అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంద‌ని విశ్లేషిస్తున్నారు.