విజయ్ సాయి రెడ్డి కొత్త పార్టీ పేరు అదేనా ?
వైసీపీకి చెందిన మాజీ నేత, మాజీ ఎంపీ వి విజయసాయిరెడ్డి కొత్త పార్టీ సన్నాహాలలో ఉన్నారా అంటే అవును అని పొలిటికల్ సర్కిల్స్ నుంచి వినిపిస్తోంది. వైసీపీ పుట్టుక నుంచి ఆ పార్టీలో ఉన్న విజయసాయిరెడ్డి రాజకీయంగా గణనీయమైన అనుభవం సంపాదించారు.
By: Satya P | 11 Aug 2026 11:44 PM ISTవైసీపీకి చెందిన మాజీ నేత, మాజీ ఎంపీ వి విజయసాయిరెడ్డి కొత్త పార్టీ సన్నాహాలలో ఉన్నారా అంటే అవును అని పొలిటికల్ సర్కిల్స్ నుంచి వినిపిస్తోంది. వైసీపీ పుట్టుక నుంచి ఆ పార్టీలో ఉన్న విజయసాయిరెడ్డి రాజకీయంగా గణనీయమైన అనుభవం సంపాదించారు. వైసీపీకి ఆయన పునాదిగా నిలబడ్డారు. వ్యూహాలతో పాటు రాజకీయ చాతుర్యం ఆయనకు ఉంది. అయితే వైసీపీలో ఆయన తనకు తగిన ప్లేస్ లేదని భావించి 2025 జనవరి 25న ఆ పార్టీ నుంచి తప్పుకున్నారు. ఇప్పటికి ఇరవై నెలలు అయింది. విజయసాయిరెడ్డి రాజకీయ దారి ఏమిటి అన్నది ఎవరికీ తెలియడం లేదు, ఆయన వైసీపీలో తిరిగి చేరుతారు అని ప్రచారం కూడా ఈ మధ్యనే సాగింది. అయితే అంతలోనే విస్మయపరిచే వార్త ఒకటి వినిపిస్తోంది. అదే విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పెట్టబోతున్నారు అని.
అది నిజమేనా :
విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పెట్టడం నిజమేనా అంటే అవును అన్నట్లుగా పేరు కూడా ప్రచారంలోకి వస్తోంది. ఆయన పెట్టబోయే పార్టీ పేరు భారత్ జన వికాస్ పార్టీ అని నామకరణం కూడా సూత్రప్రాయంగా చేసినట్లుగా చెబుతున్నారు. అంటే షార్ట్ కట్ లో బీజేవీ అన్న మాట. బీజేపీకి దగ్గరగా ఉన్నట్లుగా సౌండ్ వినిపిస్తోంది కదూ. అవును బీజేపీని ఇటీవల కాలంలో ఎంతగానో పొగుడుతూ వస్తున్న విజయసాయిరెడ్డి తన కొత్త పార్టీలోనూ ఆ సౌండ్ వచ్చేలా చూసుకుంటున్నారా లేక యాధృచ్చికంగా ఇదంతా జరిగిందా అన్నది అయితే అంతా ఆలోచిస్తున్నారు.
గతంలోనే చెప్పారు :
అయితే విజయసాయిరెడ్డి అవసరం అయితే తానే ఒక కొత్త పార్టీని పెడతాను అని గతంలోనే శ్రీకాకుళం పర్యటన సందర్భంగా ప్రకటించారు. ఇపుడు అదే అమలు చేస్తున్నారు అని అంటున్నారు. ఆయన వైసీపీలో చేరుతారు అన్నది కేవలం పుకారు మాత్రమే అని ఈ పరిణామంతో తెలుస్తోంది. అదే సమయంలో ఆయన బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేశారు అన్న వార్తలు వినిపించినా అది వర్కౌట్ కాలేదని కూడా అంటున్నారు. దాంతో విజయసాయిరెడ్డి తన సొంత దారిలోనే రాజకీయం మళ్లీ స్టార్ట్ చేయబోతున్నారు అని అంటున్నారు.
రిజిస్ట్రేషన్ జరిగిందా :
మరి కొత్త పార్టీ పేరు అయితే బయటకు వినిపిస్తోంది. ఇంతకీ రిజిస్ట్రేషన్ జరిగిందా లేదా అన్నది తెలియడం లేదు. రిజిస్ట్రేషన్ అంటూ జరిగితే జెండా అజెండా అన్నీ కూడా అఫీషియల్ గానే బయటకు వస్తాయని అంటున్నారు. మరో వైపు చూస్తే విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పెడితే ఏపీ రాజకీయాల్లో దాని ప్రభావం ఏ మేరకు ఉంటుంది అన్న చర్చ కూడా సాగుతోంది. ఆయన జగన్ వెనక ఉంటూ వ్యూహాలు రచించిన నేతగాన అంతా చూస్తారు. రాజకీయాల్లో పార్టీ పెట్టడం అంటే ఇమేజ్ ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే బలమైన భావజాలం కూడా ఉండాలి. లేకపోతే ఎన్నో పార్టీలు పుట్టినట్లుగానే అవుతుందని అంటున్నారు.
సొంత మీడియా కూడా :
అయితే విజయసాయిరెడ్డి ఒక పద్ధతి ప్రకారమే తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నారు అని అంటున్నారు. దాంతో పాటుగా సొంత మీడియాను కూడా ఆయన తీసుకుని వస్తారని అంటున్నారు. ఆ విధంగా అండగా దండగా ఉండేలా అన్ని విధాలుగా ప్లాన్ చేసుకుంటున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇటీవలనే విజయసాయిరెడ్డి జెన్ జీ ని పొగుడుతూ ట్వీట్ చేశారు. దాంతో ఆయన జెన్ జీతో కలసి తన కొత్త పార్టీని రూపు దిద్దుతారా అన్నది కూడా చర్చగా ఉంది. ఏది ఏమైనా విజయసాయిరెడ్డి పార్టీ పెడితే మాత్రం ఏపీ రాజకీయాల్లో అది కొంత వరకూ సంచలనం అవుతుందని అంటున్నారు.
