వి.కావేరీ బస్సులకు ఏమైంది? త్రుటిలో పెను ప్రమాదం తప్పింది
ఇదిలా ఉంటే.. తాజాగా చోటు చేసుకున్న పరిణామం గురించి తెలిస్తే మాత్రం.. వి.కావేరీ అంటేనే వణుకు పుట్టేలా ఉండటం గమనార్హం.
By: Garuda Media | 19 Nov 2025 1:56 PM ISTఅవును.. వి.కావేరికి చెందిన మరో బస్సు త్రుటిలో ఘోర ప్రమాదం నుంచి తప్పించుకుంది. కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న పెను ప్రమాదంలో పెద్ద ఎత్తున (19 మంది) ప్రయాణికులు మంటల్లో కాలి బూడిద కావటం.. అప్పటి నుంచి వి.కావేరీ అంటేనే అమ్మో అనుకునే పరిస్థితి. ఇదిలా ఉంటే.. తాజాగా చోటు చేసుకున్న పరిణామం గురించి తెలిస్తే మాత్రం.. వి.కావేరీ అంటేనే వణుకు పుట్టేలా ఉండటం గమనార్హం.
మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళుతున్న వి.కావేరీకి చెందిన బస్సు ఒకటి హైదరాబాద్ మహానగర శివారు ప్రాంతమైన పెద అంబర్ పేట (హయత్ నగర్ దాటిన తర్వాత) బస్సు టైర్ల కింద నుంచి పొగలు వ్యాపించాయి. బస్సు ఓవర్ హీట్ తో టైర్ల కింద నుంచి పొగలు రావటాన్ని గుర్తించిన బస్సు డ్రైవర్ వెంటనే బస్సును రోడ్డు పైనే ఆపేశాడు. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో పాతిక మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది.
బస్సు ఆగిన వెంటనే.. ప్రయాణికుల్ని సురక్షితంగా దించేశాడు బస్సు డ్రైవర్. ఇలాంటి ఘటన చోటు చేసుకున్న వెంటనే.. ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వి.కావేరీ యాజమాన్యం మీద ఉంది. కానీ.. అలాంటిదేమీ జరగలేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
అసలే శీతాకాలం.. గడిచిన మూడునాలుగు రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న వేళ.. రాత్రి వేళ పదిన్నర గంటల వేళలో.. బస్సు ఆపేసిన నేపథ్యంలో.. రోడ్డు మీద నిలబడిన ప్రయాణికులు చలిలో వణుకుతూ ఉండిపోవాల్సిన దుస్థితి. అయినప్పటికి వి.కావేరీ యాజమాన్యం ప్రయాణికుల్ని పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రసార మాధ్యమాల్లో ఈ ఉదంతం పెద్ద ఎత్తున ప్రసారం కావటం.. యాజమాన్యం పట్టించుకోకపోవటాన్ని పలువురు తీవ్రంగా తప్పు పడుతున్నారు.
