యువతిపై గ్యాంగ్‌రేప్.. నిందితులను నడిరోడ్డుపై చితకబాదిన జనం.. వైరల్ వీడియో
పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 25న రుద్రపూర్‌కు చెందిన 19 ఏళ్ల యువతిని ముగ్గురు యువకులు అపహరించి అనంతరం ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
By: A.N.Kumar | 30 July 2026 12:44 AM ISTఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్‌లో 19 ఏళ్ల యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణానికి పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసిన అనంతరం.. నేరస్థల సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం తీసుకెళ్లిన సమయంలో జరిగిన పరిణామాలు ఉద్రిక్తతకు దారితీశాయి. నిందితులు పోలీసుల అదుపు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. ఇదే సమయంలో అక్కడికి చేరుకున్న స్థానికులు, పలు హిందూ సంఘాల కార్యకర్తలు ఆగ్రహంతో నిందితులపై దాడి చేసి చితకబాదారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 25న రుద్రపూర్‌కు చెందిన 19 ఏళ్ల యువతిని ముగ్గురు యువకులు అపహరించి అనంతరం ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. నిందితులను పట్టుకునేందుకు వెళ్లిన సమయంలో వారు పోలీసులపై ఎదురుకాల్పులకు దిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఒక నిందితుడి కాలికి బుల్లెట్ తగలగా అనంతరం ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టు అనంతరం దర్యాప్తులో భాగంగా నిందితులను నేరం జరిగిన ప్రాంతానికి తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహించారు. ఈ సమయంలో ఇద్దరు నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే అక్కడే ఉన్న పోలీసులు వెంటనే వారిని పట్టుకున్నారు. ఇదే సమయంలో అక్కడికి చేరుకున్న స్థానిక ప్రజలు, పలు హిందూ సంఘాల కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో నిందితులపై దాడి చేశారు. పోలీసులు వారిని అదుపు చేయడానికి ప్రయత్నించినప్పటికీ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
చివరికి పోలీసులు నిందితులను సురక్షితంగా తమ వాహనాల్లోకి ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. ఘటన నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. బాధితురాలికి వైద్య చికిత్స అందించడంతో పాటు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మహిళలపై జరుగుతున్న నేరాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు, నిందితులపై చట్టప్రకారం వేగంగా విచారణ జరిపి కఠిన శిక్ష విధిస్తామని పోలీసులు వెల్లడించారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
