భారీ కుదుపు బ్రెయిన్ డెడ్ మహిళ ప్రాణం పోసింది
ఉత్తరప్రదేశ్ లోని పిలిభిత్ జిల్లాకు చెందిన వినితా శుక్లా.. స్థానిక జిల్లా కోర్టులో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు.
By: Garuda Media | 12 March 2026 10:34 AM ISTసినిమాల్లో మాత్రమే చూసే ఘటనలు కొన్ని రియల్ గా జరిగినప్పుడు అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఉదంతమే ఒకటి ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. బ్రెయిన్ డెడ్ అయిన మహిళకు అంత్యక్రియలు చేసేందుకు అంబులెన్స్ లో తరలిస్తున్న వేళ.. అనూహ్యంగా రోడ్డు మీద పెద్ద గుంటలో భారీ కుదుపునకు గురి కావటం.. అప్పటివరకు నిర్జీవంగా ఉన్న ఆమె ఒక్కసారిగా ఊపిరి తీసుకున్న వైనం అందరిని విస్మయానికి గురి చేస్తోంది. సినిమాల్లో మాదిరి.. చనిపోయి అంతలోనే బతికేసిన వైనంతో ఆ కుటుంబం విపరీతమైన ఆనందానికి గురవుతున్న పరిస్థితి.
ఉత్తరప్రదేశ్ లోని పిలిభిత్ జిల్లాకు చెందిన వినితా శుక్లా.. స్థానిక జిల్లా కోర్టులో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు. ఫిబ్రవరి 22న ఆమె ఇంటి పనులు చేస్తుండగా.. ఒక్కసారి కింద పడిపోయారు. హైబీపీ కారణంగా భావించిన కుటుంబ సభ్యులు.. ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వైద్యులు చెప్పారు. దీంతో.. మెరుగైన వైద్య చికిత్స కోసం ఆమెను బరేలీలోని మరో ఆసుపత్రికి తరలించారు.
అక్కడ మూడు రోజులు వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స చేపట్టారు. అపస్మారకంగా ఉండిపోయిన ఆమె బతికే అవకాశాలు తక్కువేనని వైద్యులు చెప్పారు. ఇంటికి తీసుకెళ్లిపోవాలని కుటుంబ సభ్యులకు చెప్పటంతో.. ఆమెను ఇంటికి తీసుకెళ్లి.. అంత్యక్రియలు చేయాలని భావించారు. ఫిబ్రవరి 24న అంబులెన్సులో ఇంటికి తీసుకెళ్లే సమయంలో బరేలీ - హరిద్వార్ జాతీయ రహదారిపై ఒక భారీ గుంతలో అంబులెన్స్ వాహనం పడింది. దీంతో వాహనం భారీ కుదుపునకు లోనైంది.
అది జరిగిన వెంటనే అప్పటివరకు బ్రెయిన్ డెడ్ గా ఉన్నట్లు ఎలాంటి స్పందన లేకుండా ఉన్న ఆమె.. ఒక్కసారిగా స్ప్రహలోకి వచ్చారు. శ్వాస తీసుకోవటం ప్రారంభించినట్లు బాధితురాలి భర్త కుల్దీప్ శుక్లా వెల్లడించారు. దీంతో.. వెంటనే ఆమెను తిరిగి ఆసుపత్రికి తీసుకెళ్లారు. గ్రామస్తులకు ఫోన్ చేసి అంత్యక్రియ ఏర్పాట్లను నిలిపివేయాలని చెప్పారు. ఆమెను మరోసారి పరీక్షించిన వైద్యులు.. ఆమె కాలికి గాయం ఉండటంతో ఏదైనా పాము కానీ పురుగు కానీ కరిచి ఉండి ఉంటుందా?అన్న సందేహంతో మళ్లీ చికిత్స ప్రారంభించారు. మొత్తంగా 12 రోజులు ఐసీయూలో ఉన్న ఆమె ఇప్పుడు పూర్తిగా కోలుకోవటం ఆసక్తికరంగా మారింది. నూకలు చెల్లకుంటే.. పోయిన ప్రాణం కూడా తిరిగి వస్తుందనే మాటకు నిలువెత్తు రూపంగా ఈ ఉదంతాన్ని చెప్పక తప్పదు.
