2027 లో భీకర యుద్ధం...ఎన్డీయే వర్సెస్ ఇండియా కూటమి !
2027లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. యూపీలో ఫిబ్రవరి-మార్చి మధ్య మూడు విడతల్లో పోలింగ్ నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ఒకే విడతలో ఎన్నికలు జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ఈ ఫలితాలు జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపనున్నాయి.
By: Satya P | 10 Nov 2026 12:48 AM ISTమరో డెబ్బై రోజుల వ్యవధిలో కొత్త ఏడాది ఎంటర్ అవుతోంది. 2026 వెళ్ళిపోయి 2027 రానుంది. ఈ కొత్త ఏడాది వస్తూనే దేశంలో ముఖ్యంగా జాతీయ రాజకీయాల్లో తీవ్ర ప్రభావం చూపించేలా ఉంది అని అంటున్నారు. దేశంలో 2027 లో అయిదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో దేశ రాజకీయాలనే మలుపు తిప్పే అతి పెద్ద రాష్ట్రం యూపీ ఎన్నికలు ఉన్నాయి. అలాగె పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్లలో కూడా ఇదే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి.
యూపీలో ఫిబ్రవరిలో :
ఇక ఉత్తరప్రదేశ్ లో ప్రస్తుత అసెంబ్లీ గడువు 2027 మే 22తో ముగుస్తుంది. దానితో అంతకంటే ముందే ఎన్నికలు అక్కడ నిర్వహించడం రాజ్యాంగ నిబంధనల ప్రకారం అవసరం. అలాగే గడువు తేదీ కంటే ముందే రాష్ట్రంలో కొత్త అసెంబ్లీ కొలువుదీరాల్సి ఉంటుంది. దాంతో కేంద్ర ఎన్నికల సంఘం కొత్త ఏడాది వస్తూనే జనవరిలో ఎన్నికల షెడ్యూల్ ని ప్రకటిస్తుందని అంటున్నారు. ఈ క్రమంలో ముందుగా ఫిబ్రవరి మార్చి 2027 మధ్య కాలంలో యూపీ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మేరకు తేదీలతో పాటు టోటల్ షెడ్యూల్ ని ఖరారు చేసే పనిలో కేంద్ర ఎన్నికల సంఘం ఉంది.
యూపీ మూడు దశలలో :
ఇక యూపీ పెద్ద స్టేట్. 403 అసెంబ్లీ సీట్లు ఉన్న ప్రాంతం. అందుకే మూడు దశలలో యూపీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తుంది అని అంటున్నారు. ఇక మిగిలిన రాష్ట్రాలు అయిన పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను మాత్రం ఒకే విడతలో నిర్వహిస్తుంది అని తెలుస్తోంది. ఇక ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తో పాటు మిగిలిన ఇద్దరు కమిషనర్లు కూడా ఈ నెల చివరి వారం నుంచి పర్యటనలు చేస్తారు అని అంటున్నారు. ఈ పర్యటనలలో ఆయా రాష్ట్రాలలో గ్రౌండ్ లెవెల్ పరిస్థితులు అలాగే ఎన్నికలకు ఆ రాష్ట్రం ఏ మేరకు సిద్ధంగా ఉంది అన్న దాని మీద రాష్ట్రాల అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు అని అంటున్నారు. ఇప్పటికే యూపీలో కేంద్ర ఎన్నికల సంఘం ఒక దఫా పర్యటన పూర్తి చేసింది. అదే విధంగా పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్ లలో కూడా సీఈసీ బృందాలు పర్యటించాయి.
యూపీ రిజల్ట్ తోనే :
ఇక అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలను తీవ్రంగానే ప్రభావితం చేస్తాయి అని అంటున్నారు. అందులో యూపీ చాలా కీలకమైనది గా చెబుతున్నారు. యూపీలో కనుక ఎవరేమిటి అన్నది తేలితే అది దేశ రాజకీయాలలో గణనీయమైన ప్రభావం చూపిస్తుంది అని అంటున్నారు. ఈసారి సమాజ్ వాదీ పార్టీ కాంగ్రెస్ తో కలిసి యూపీ పీఠాన్ని సొంతం చేసుకోవాలని చూస్తోంది. 2024 లో లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను ఎస్పీ కాంగ్రెస్ కాంబో గెలుచుకున్నాయి. ఇక మూడేళ్ల ఎన్డీయే పాలనలో యాంటీ ఇంకెంబెన్సీ పెరుగుతుందని అలాగే యూపీలో పదేళ్ళ బీజేపీ పాలన మీద కూడా జనాలు తమ తీర్పుని ఇస్తారని ఇండియా కూటమి భావిస్తోంది. మొత్తానికి 2027 వస్తూనే దేశంలో భీకర రాజకీయ సమరానికి తెర తీయనుంది అని అంటున్నారు.
