Begin typing your search above and press return to search.

యూపీలో అప్పుడే రాజుకుంటున్న ఎన్నికల వేడి !

దేశ రాజకీయాలను శాసించే కీలక రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో 2027 మే 22తో ఐదేళ్ల శాసనసభ గడువు ముగుస్తుంది.

By:  Garuda Media   |   22 Aug 2026 4:00 PM IST
యూపీలో అప్పుడే రాజుకుంటున్న ఎన్నికల వేడి !
X

దేశ రాజకీయాలను శాసించే కీలక రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో 2027 మే 22తో ఐదేళ్ల శాసనసభ గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి మార్చి నెలల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. అవసరం అయితే జనగణన షెడ్యూలు సర్దుబాటు చేసి ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు. మొత్తం 403 శాసనసభ స్థానాలు ఉన్న యూపీలో ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు.

403 శాసనసభ స్థానాలు ఉన్న యూపీలో అధికారంలోకి రావాలంటే 202 స్థానాలు అవసరం. సర్ తరువాత 13.39 కోట్ల ఓటర్లు ఉన్నట్లు తేలింది. ఇందులో 7.31 కోట్ల మంది పురుషులు, 6.09 కోట్ల మంది మహిళలు ఉన్నారు. ముఖ్యంగా 18 - 19 ఏళ్ల వయసున్న వారు గణనీయంగా పెరిగారు. సర్ ప్రక్రియలో భాగంగా 2.04 కోట్ల ఓట్లు తొలగించడం గమనార్హం. ఎన్నికలకు ముందు మరిన్ని మార్పులు చేర్పులు ఉండవచ్చు.

యోగీ ఆదిత్యనాథ్ సారధ్యంలో బీజేపీ మరోసారి డబల్ ఇంజన్ సర్కారు, అభివృద్ధి, శాంతిభద్రతలు, సంక్షేమ పథకాలను ముందు పెట్టి హిందుత్వ నినాదంతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నది. ఆర్ఎస్ఎస్ సమన్వయంతో 1.7 లక్షల బూత్ స్థాయిలో బలోపేతం చేసేలా వ్యూహాలు రచించింది. దీంతో పాటు ఆప్నా దళ్ (ఎస్), నిషాద్, ఆర్ ఎల్ డీ, సుహెల్ దేవ్ బీఎస్పీలతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది.

అఖిలేష్ యాదవ్ సారధ్యంలోని సమాజ్ వాదీ పార్టీ దళిత, వెనకబడిన, అల్పసంఖ్యాక వర్గాలతో పాటు యాదవ, ముస్లిం సామాజిక వర్గాలు, నాన్ యాదవ్ వర్గాలను ఆకట్టుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నది. నిరుద్యోగం, వ్యవసాయ సమస్యలు, ధరల పెరుగుదల అంశాలను ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది.

పొత్తులో భాగంగా సమాజ్ వాదీ పార్టీతో కలిపి 80 సీట్లలో పోటీ చేయాలన్న ప్రయత్నాల్లో కాంగ్రెస్ ఉంది. దళితులు, మైనారిటీలు, యువత, రైతులను ఆకట్టుకుంటూ సంస్థాగత బలహీనతలను అధిగమించే ప్రయత్నం చేస్తున్నది. ఇక మాయావతి సారధ్యంలోని బీఎస్పీ దళిత ఓటు బ్యాంకు తిరిగి సాధించడం, బ్రాహ్మణులు, ముస్లింలు, ఓబీసీలను ఆకట్టుకునే విధంగా భాయ్ చారా కమిటీలతో ప్రజలను ఆకట్టుకునే ప్రణాళికలు రచిస్తుంది. ప్రధానంగా ఇక్కడ పోటీ బీజేపీ, సమాజ్ వాదీ పార్టీల మధ్యనే ఉండనుంది.

అయితే ఎన్నికలకు ఇంకా ఎంతో కాలం ఉన్నా కూడా అప్పుడే భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. ప్రధానంగా సీఎం యోగీ ఆదిత్యానాథ్, ఎస్పీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, 11 మంది క్యాబినెట్ మంత్రులతో పాటు, బీజేపీ నేత అపర్ణ యాదవ్ లతో సహా 52 మందికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను అందించారు. దీనికోసం రూ.5.2 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తుంది. దేశ రాజకీయాలను మలుపుతిప్పే యూపీ ఎన్నికల్లో ఈ సారి ఫలితాలు ఎలా ఉంటాయో వేచిచూడాలి.