Begin typing your search above and press return to search.

మాజీ మంత్రి.. అటా - ఇటా.. ఇదో పాలిటిక్స్‌.. !

అయితే కూటమి ప్రభావంతో గత ఎన్నికల్లో వైసిపి భారీగా నష్టపోయింది. ఈ క్రమంలో ఆమె కూడా ఓడిపోయారు. గెలుపు ఓటముల సంగతి ఎలా ఉన్నప్పటికీ ఉషశ్రీ చరణ్ ప్రజల్లో అయితే ఉంటున్నారు.

By:  Garuda Media   |   9 Dec 2025 4:00 AM IST
మాజీ మంత్రి.. అటా - ఇటా.. ఇదో పాలిటిక్స్‌.. !
X

మాజీ మంత్రి, వైసీపీ నాయ‌కురాలు ఉషశ్రీ చరణ్ రాజకీయంగా దూకుడుగా ఉన్నారు. గత ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటికీ ప్రజల మధ్య తిరుగుతున్నారు. పార్టీ పిలుపుమేరకు ఆమె కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యంగా టిడిపి నాయకులను, మంత్రులను కూడా ఉషశ్రీ చరణ్ టార్గెట్ చేసుకొని కామెంట్లు చేస్తున్నారు. ఏ విషయం వచ్చినా కౌంటర్ ఇస్తూ వైసిపి తరఫున బలమైన వాయిస్ కూడా వినిపిస్తున్నారు.

ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఆమె రాజకీయంగా కీలక సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా 2019 ఎన్నికల్లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఉష శ్రీ చరణ్... ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని కళ్యాణదుర్గం నుంచి విజయం సాధించారు. ఆ క్రమంలోనే వైసిపి ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఉషశ్రీ చరణ్ వచ్చీ రావడంతోనే జగన్ ఆశీస్సులతో మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు. అయితే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాల మార్పులో భాగంగా ఉషశ్రీ చరణ్‌ పెనుకొండ నుంచి పోటీ చేయాల్సి వచ్చింది.

అయితే కూటమి ప్రభావంతో గత ఎన్నికల్లో వైసిపి భారీగా నష్టపోయింది. ఈ క్రమంలో ఆమె కూడా ఓడిపోయారు. గెలుపు ఓటముల సంగతి ఎలా ఉన్నప్పటికీ ఉషశ్రీ చరణ్ ప్రజల్లో అయితే ఉంటున్నారు. కానీ ఏ నియోజకవర్గ నుంచి ఆమె రాజకీయాలు చేయాలన్నది ఇప్పుడు సందేహంగా మారింది. వచ్చే ఎన్నికల్లో కళ్యాణదుర్గం నుంచి పోటీ చేయాలన్నది ఆమె మనసులో మాట. కానీ పార్టీ ఇప్పటి వరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. మరోవైపు పెనుకొండలో రాజకీయాలు చేస్తున్నప్పటికీ ఇక్కడ వైసిపిలో నెలకొన్న అంతర్గత కొమ్ములాట‌ల కారణంగా ఉషశ్రీ చరణ్ గ్రాఫ్ అంతగా పెరగడం లేదు.

దీంతో మాజీ మంత్రిగా ఉషశ్రీ చరణ్ ఏ నియోజకవర్గ నుంచి రాజకీయాలు చేయాలన్నది డోలాయమానం లో పడింది. అటు పార్టీ నేమో పెనుకొండలో ఆమె చేస్తున్న రాజకీయాలను గమనిస్తోంది.. క‌ల్యాణదుర్గంలోనూ ఆమె తరచుగా పర్యటిస్తున్నారు. ఈ విషయాన్ని కూడా గమనిస్తోంది. అయినప్పటికీ నియోజకవర్గ విషయంలో ఇప్పటికీ ఆమెకు క్లారిటీ లేకుండా పోయింది. ఇదే ఇప్పుడు అసలు సమస్యగా ఉంద‌ని ఉషశ్రీ చరణ్‌ అనుచరులు చెబుతున్నారు.