అమెరికా ఆశావహులకు యూఎస్.సీఐఎస్ బిగ్ షాక్.. కాగితం తేడా వస్తే డైరెక్ట్‌గా చెత్తబుట్టకే
ఇన్నాళ్లూ దరఖాస్తులో ఏదైనా లోపం ఉంటే 'రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్' పేరిట దాదాపు 12 వారాల పాటు నిపీడన సమయాన్ని.. ఓపికగా ఆలోచించుకునే అవకాశాన్ని ఇచ్చేవారు.
By: A.N.Kumar | 7 Aug 2026 10:43 AM ISTఅమెరికా కలలు కంటున్న మనోభావులకు యూఎస్ సీఐఎస్ వారు ఓ ఘనమైన తీపి కబురును మోసుకొచ్చారు. అదేంటంటే ఇప్పటివరకూ దరఖాస్తుల్లో ఏమైనా చిన్న చిన్న తప్పులుంటే "అయ్యో పాపం" అని ప్రేమగా ఒక లెటర్ రాసి.. "నాయనా ఆ కాగితం మర్చిపోయావ్.. కాస్త పంపు" అని ప్రాధేయపడే ఆ మంచి రోజులకు వారు శాశ్వతంగా మంగళం పాడేశారు. ఇకపై మీ అప్లికేషన్‌లో ఒక్క కాగితం తగ్గినా సంతకం సరిగ్గా లేకపోయినా చివరికి ఫీజు లెక్కలో పైసా తేడా వచ్చినా ఏమాత్రం మొహమాటం లేకుండా కనీసం ఒక్క హెచ్చరిక కూడా ఇవ్వకుండా మీ దరఖాస్తును నేరుగా చెత్తబుట్టలో పడేసే సరికొత్త "ఫాస్ట్ ట్రాక్" విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.
అమెరికా వెళ్లాలనే ఉత్సాహంలో ఫారాలు సరిగ్గా నింపకుండా "ముందు అప్లై చేసేద్దాం.. ఆర్ఎఫ్ఈ వస్తే అప్పుడు నిమ్మలంగా పంపుదాంలే" అని కాలయాపన చేసే మహా మేధావుల తెలివితేటలకు ఇక పూర్తిస్థాయిలో చెక్ పడింది. హెచ్-1బీ వీసాలు, ఓపీటీ విద్యార్థులు, గ్రీన్ కార్డ్ కోసం ఏళ్ల తరబడి క్యూలో నిలబడినవారు.. ఇలా అందరికీ ఈ కొత్త రూల్ అత్యంత ప్రేమతో వర్తిస్తుంది. పోనీలే కొత్తగా దరఖాస్తు చేసేవారికే కదా ఈ తిప్పలు అని సంతోషపడటానికి కూడా లేదు. ఇప్పటికే లక్కీగా అప్లై చేసి అధికారుల టేబుళ్ల మీద పెండింగ్‌లో పడి ఉన్న పాత దరఖాస్తులకు కూడా ఇదే రాజమర్యాద లభిస్తుంది.
ఇన్నాళ్లూ దరఖాస్తులో ఏదైనా లోపం ఉంటే 'రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్' పేరిట దాదాపు 12 వారాల పాటు నిపీడన సమయాన్ని.. ఓపికగా ఆలోచించుకునే అవకాశాన్ని ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అంత ఓపిక, కరుణ మా దగ్గర లేవంటూ అధికారులు చాలా నిర్మోహమాటంగా తెగేసి చెప్పారు. ఒకవేళ ఏ దయామయుడైన అధికారి అయినా జాలిపడి ఆర్ఎఫ్ఈ ఇద్దామని అనుకున్నా, దానికి ఇచ్చే సమయం మాత్రం ఇచ్చి ఇవ్వనంత చాలా తక్కువగా ఉంటుంది. అసలు మీలాంటి అసంపూర్ణ దరఖాస్తులు చూసి చూసి మా ప్రాణాలు విసిగిపోతున్నాయని.. పెండింగ్ కేసుల కొండను తగ్గించుకోవడానికే ఈ ఘనమైన విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నామని అధికారులు చాలా ముచ్చటగా సమర్థించుకుంటున్నారు.
ఈ కొత్త దెబ్బతో అమెరికాలో స్థిరపడాలనుకునే విదేశీయులకు, అక్కడి ఉద్యోగులకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ముఖ్యంగా హెచ్-1బీ, ఎల్-1, ఓ-1 వీసాలపై ఉన్నవారు, చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఆరాటపడే స్టెమ్ ఓపీటీ విద్యార్థులు, గ్రీన్ కార్డ్ కలలు కంటున్న వేలాది మంది భారతీయులకు ఇది కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి. చిన్న ఫారం తప్పుగా నింపినా లేదా సరైన ప్రూఫ్ వెనకాల పెట్టడం మర్చిపోయినా మీ వీసా కల అక్కడికక్కడే గోవిందా అయిపోతుంది.
ఇమ్మిగ్రేషన్ నిపుణులు ఇప్పుడు లబోదిబోమంటూ దరఖాస్తుదారులకు ఉచిత సలహాలు ఇస్తున్నారు. అమెరికా వీసా కోసం ట్రై చేసేవారు ఇకపై తమ అప్లికేషన్లను దేవుడిపై భారం వేసి పంపకుండా ప్రతి కాగితాన్ని భూతద్దంలో చూసి, నాలుగు సార్లు రీ-చెక్ చేసుకుని మరీ సమర్పించాలి. "ముందు తొందరపడి ఏదో ఒకటి అప్లై చేద్దాం.. తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం" అనే పాతకాలపు బద్ధకపు పద్ధతులు ఇకపై అస్సలు నడవవు. చిన్నపాటి నిర్లక్ష్యం చేసినా.. మీ అమెరికా డ్రీమ్‌కు ఎలాంటి ఆర్ఎఫ్ఈ లేదా రిక్వెస్ట్ కవర్ లేకుండానే నేరుగా ఫుల్‌స్టాప్ పడిపోతుందని గుర్తుంచుకుంటే అందరికీ శ్రేయస్కరం.
