Begin typing your search above and press return to search.

ఇండియన్ స్టోర్ లో అమెరికా మహిళ 80 లక్షల దొంగతనం.. వీడియో వైరల్

ఇటీవల కాలంలో అమెరికాలో ఇండియన్‌ కమ్యూనిటీని టార్గెట్ చేస్తూ జరుగుతున్న దొంగతనాల ఘటనల్లో తాజాగా మరో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది.

By:  A.N.Kumar   |   11 Nov 2025 11:00 PM IST
ఇండియన్ స్టోర్ లో అమెరికా మహిళ 80 లక్షల దొంగతనం.. వీడియో వైరల్
X

ఇటీవల కాలంలో అమెరికాలో ఇండియన్‌ కమ్యూనిటీని టార్గెట్ చేస్తూ జరుగుతున్న దొంగతనాల ఘటనల్లో తాజాగా మరో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక అమెరికన్ మహిళ, ఇండియన్‌ వ్యక్తికి చెందిన స్టోర్ నుండి ఏకంగా మూడు సంవత్సరాలుగా సుమారు రూ.80 లక్షల (USD 96,000) విలువైన సరుకులను క్రమపద్ధతిలో దొంగిలించినట్లు ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో పెను సంచలనంగా మారింది.

కన్నీళ్లతో వేడుకున్న దొంగ

ప్రస్తుతం సోషల్ మీడియా 'ఎక్స్' లో చక్కర్లు కొడుతున్న ఒక వీడియో ఈ ఘటనకు సాక్ష్యంగా నిలిచింది. స్టోర్ మేనేజర్ ముందు పట్టుబడిన ఆ మహిళ కన్నీళ్లు పెట్టుకుంటూ "దయచేసి నన్ను జైలుకు పంపొద్దు. నాకో చిన్న పాప ఉంది" అంటూ తీవ్రంగా వేడుకుంటున్న దృశ్యాలు అందులో ఉన్నాయి.

వీడియోలో తీవ్ర ఆగ్రహంతో ఉన్న స్టోర్ మేనేజర్ అయిన ఇండియన్‌ వ్యక్తి ఆమెను గట్టిగా ప్రశ్నించడం కనిపిస్తుంది. "నేను నిన్ను నమ్మి స్టోర్ తాళాలు కూడా ఇచ్చాను. నువ్వు నమ్మకాన్ని ఉంచుకుని మళ్లీ మళ్లీ దొంగతనం చేశావు. నా దగ్గర నిన్ను పట్టుకోవడానికి అన్ని సాక్ష్యాలు ఉన్నాయి" అని ఆయన నిలదీశారు. మొదట్లో తనపై వచ్చిన ఆరోపణలను ఖండించడానికి ప్రయత్నించిన ఆ మహిళ, చివరకు వీడియో సాక్ష్యాలను చూపి డీల్ చేయడంతో తప్పించుకోలేక ఏడుస్తూ దయ చూపాలని కోరింది. ఈ వీడియో ఇప్పటికే 9 లక్షలకు పైగా వ్యూస్‌ను దాటి అమెరికన్-ఇండియన్ కమ్యూనిటీలో హాట్ టాపిక్‌గా మారింది.

* నెటిజన్ల విమర్శలు: మీడియా ద్వంద్వ ధోరణిపై చర్చ!

ఈ వీడియో వైరల్‌ అయిన వెంటనే సోషల్ మీడియాలో దీనిపై రకరకాల చర్చలు మొదలయ్యాయి. పలువురు నెటిజన్లు అమెరికన్ మీడియా ద్వంద్వ ప్రమాణాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. "ఒక వైట్ వ్యక్తి ఇంత పెద్ద దొంగతనం చేసినా మీడియాలో ఇది పెద్ద వార్త కాదు. కానీ ఇండియన్ వ్యక్తి చేసినట్లయితే వాడిని వెంటనే స్కామర్ అని ముద్ర వేస్తారు. ఇండియన్లు దొంగతనం చేస్తే వెంటనే 'భారతీయ స్కామర్' అని చూపే మీడియా, ఇటువంటి కేసుల్లో ఎందుకు మౌనంగా ఉంది?" అని ప్రశ్నించారు.

ఈ ఘటనతో పాటు ఇటీవల అమెరికాలో భారతీయ మహిళల దొంగతనాలకు సంబంధించిన కొన్ని వీడియోలు, కేసులు కూడా చర్చకు దారితీశాయి. సెప్టెంబరులో ఒక గుజరాతీ మహిళ, టార్గెట్ స్టోర్ నుండి వస్తువులు దొంగిలించగా ఆమెను పోలీసులు పట్టుకున్న వీడియో వైరల్ అయింది. జూలైలో ఇల్లినాయిస్‌లో మరో భారతీయ మహిళ, సుమారు రూ.1 లక్ష విలువైన వస్తువులు దొంగిలించిన కేసులో అరెస్టయింది. గత వారం టార్గెట్ స్టోర్‌లో దొంగతనం చేసిన మరొక భారతీయ మహిళ అమెరికన్ పోలీసులను వేడుకుంటూ ఉన్న వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

ఈ వరుస ఘటనలు, అమెరికాలో వర్ణ వివక్ష, మీడియా పక్షపాతం, భారతీయులపై పెరుగుతున్న ప్రతికూల దృక్పథం వంటి అంశాలపై మళ్లీ చర్చలు రగులుతున్నాయి. ఒకవైపు అమెరికన్ మహిళ చేసిన రూ.80 లక్షల భారీ దొంగతనంపై పెద్దగా దృష్టి పెట్టని మీడియా, చిన్న చిన్న కేసుల్లో ఇండియన్‌ కమ్యూనిటీని టార్గెట్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.