15000 డాలర్లు.. అమెరికా వీసా ఇక మరింత భారం
తాజాగా అమెరికా విదేశాంగశాఖ ప్రతిపాదనల ప్రకారం, వీసా కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం $5,000 నుండి గరిష్ఠంగా $15,000 వరకు షూరిటీ బాండ్‌ను చెల్లించాల్సి ఉంటుంది.
By: A.N.Kumar | 5 Aug 2025 3:51 PM ISTఅగ్రరాజ్యం అమెరికా వీసా విధానంలో మరోసారి కఠినమైన మార్పులు తీసుకురావడానికి సిద్ధమైంది. వలసదారులపై ఇప్పటికే కఠిన నిబంధనలను అమలు చేస్తున్న అమెరికా ప్రభుత్వం, ఇప్పుడు బిజినెస్ (B1), టూరిస్ట్ (B1) వీసాల దరఖాస్తుదారులపై భారీ ఆర్థిక భారాన్ని మోపనుంది. తాజాగా అమెరికా విదేశాంగశాఖ ప్రతిపాదనల ప్రకారం, వీసా కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం $5,000 నుండి గరిష్ఠంగా $15,000 వరకు షూరిటీ బాండ్‌ను చెల్లించాల్సి ఉంటుంది.
-పైలట్ ప్రోగ్రామ్‌గా ఆరంభం
ఈ కొత్త విధానం ప్రస్తుతానికి 12 నెలల పాటు ఒక పైలట్ ప్రోగ్రామ్‌గా అమలు కానుంది. దీనికి సంబంధించిన అధికారిక నోటీసులు ఫెడరల్ రిజిస్ట్రీలో ప్రచురించిన 15 రోజుల్లోగా ఈ పాలసీ అమల్లోకి రానుంది. ఈ నిర్ణయం వీసా పొందాలనుకునే వారిపై గణనీయమైన ప్రభావాన్ని చూపనుంది.
షూరిటీ బాండ్ ఎలా పని చేస్తుంది?
ఈ విధానం ప్రకారం వీసా దరఖాస్తు సమయంలోనే అభ్యర్థి నిర్ణీత మొత్తం డాలర్లను షూరిటీ బాండ్‌గా చెల్లించాలి. వీసా గడువు పూర్తయిన తర్వాత అభ్యర్థి చట్టబద్ధంగా అమెరికాను విడిచి వెళ్ళిపోతే, ఈ బాండ్ మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి ఇచ్చేస్తుంది. ఒకవేళ వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అభ్యర్థి అమెరికాలోనే ఉండిపోతే, లేదా చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే, ప్రభుత్వం ఆ బాండ్ మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటుంది.
-ఈ నిబంధన అన్ని దేశాలకూ వర్తిస్తుందా?
ఈ షూరిటీ బాండ్ నిబంధన అన్ని దేశాలకు వర్తించదు. అమెరికా ప్రభుత్వం త్వరలో ఈ నిబంధన వర్తించే దేశాల జాబితాను విడుదల చేయనుంది. ప్రస్తుతం వీసా వేవర్ ప్రోగ్రామ్ కింద ఉన్న 42 దేశాలకు ఈ కొత్త నిబంధన వర్తించదు. ఈ దేశాలలో ఎక్కువగా ఐరోపా దేశాలు, కొన్ని ఆసియా , మధ్యప్రాచ్య దేశాలు ఉన్నాయి. వ్యక్తిగత పరిస్థితులను బట్టి కొంతమందికి ఈ నిబంధనల నుండి మినహాయింపులు లభించే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.
-భద్రతా కారణాలే ప్రధాన ఉద్దేశం
వీసా గడువు ముగిసినా దేశం విడిచి వెళ్ళకుండా అమెరికాలోనే ఉండిపోయే వారి వల్ల దేశ భద్రతకు ముప్పు ఏర్పడుతుందనే ఆందోళనతో అమెరికా ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించుకుంది. ఈ విధానం కొత్తదేమీ కాదు; ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2020లో దీనిని ప్రవేశపెట్టారు. అప్పట్లో కోవిడ్ మహమ్మారి కారణంగా అంతర్జాతీయ ప్రయాణాలు నిలిచిపోవడంతో ఇది పూర్తిగా అమలు కాలేదు. ఇప్పుడు మళ్లీ ఈ విధానాన్ని తిరిగి తెరపైకి తీసుకొస్తున్నారు.
ఈ తాజా నిర్ణయం వీసా కోసం ఎదురుచూస్తున్న వారిపై ఆర్థికంగా తీవ్ర భారం మోపడమే కాకుండా, దరఖాస్తుదారుల సంఖ్యను కూడా గణనీయంగా తగ్గించవచ్చు. షూరిటీ బాండ్‌ను చెల్లించలేని చాలా మందికి అమెరికాకు వెళ్ళాలనే కల కేవలం కలగానే మిగిలిపోయే అవకాశం ఉంది. వీసా విధానాలను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు చేయాలంటే ఇటువంటి మార్పులను మరింత లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
