Begin typing your search above and press return to search.

వీసా సెన్సార్ షిప్.. వార్తా స్వేచ్ఛ గొంతునొక్కేలా అమెరికా ఉక్కుపాదం

తాజా మార్పుల ప్రకారం ఐ, టీఎన్ , టీడీ వీసా దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ఖాతాలను 'పబ్లిక్' మోడ్‌లో పెట్టి అగ్రరాజ్య అధికారుల శోధనకు తెరచి ఉంచాల్సిందే.

By:  A.N.Kumar   |   2 Oct 2026 11:23 AM IST
వీసా సెన్సార్ షిప్..  వార్తా స్వేచ్ఛ గొంతునొక్కేలా అమెరికా ఉక్కుపాదం
X

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా.. భావ ప్రకటనా స్వేచ్ఛకు మారుపేరుగా నిలిచే అమెరికా.. ఇప్పుడు పత్రికా స్వేచ్ఛ గొంతును నొక్కేందుకు సిద్ధమైందా? విదేశీ జర్నలిస్టుల కళ్లలో భయం నింపి.. తమ పాలనపై వచ్చే విమర్శలను తొక్కిపెట్టేందుకు దొడ్డిదారిన కుట్ర పన్నుతోందా? అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త వీసా నిబంధనలు చూస్తుంటే అంతర్జాతీయ మీడియా ప్రతినిధుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. భద్రత నెపంతో తెచ్చిన ఈ కొత్త చట్టం వెనుక కంటికి కనిపించని 'అదృశ్య సెన్సార్‌షిప్' నీడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ప్రశ్నించే గొంతుకలపై డిజిటల్ నిఘా నెట్‌వర్క్

తాజా మార్పుల ప్రకారం ఐ, టీఎన్ , టీడీ వీసా దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ఖాతాలను 'పబ్లిక్' మోడ్‌లో పెట్టి అగ్రరాజ్య అధికారుల శోధనకు తెరచి ఉంచాల్సిందే. ముఖ్యంగా 'ఐ-వీసా' పరిధిలోకి వచ్చే విదేశీ విలేఖరులు, రిపోర్టర్లు, ఎడిటర్లు, ఫోటోగ్రాఫర్లపై ఈ నిఘా పంజా విసురుతోంది.

ఒక జర్నలిస్ట్ పని సమాజంలోని లోపాలను, ప్రభుత్వాల తప్పిదాలను ఎండగట్టడం.. కానీ గతంలో సోషల్ మీడియాలో అమెరికా విధానాలను లేదా వారి దౌత్య నీతిని విమర్శిస్తూ రాసిన ఒక్క పోస్ట్ ఉన్నా.. ఇక వారికి అమెరికా మట్టిపై కాలు మోపే అర్హత లేనట్టేనా? ఏళ్ల తరబడి పారదర్శక జర్నలిజం చేసిన రిపోర్టర్లు తమ ఆలోచనలను స్వేచ్ఛగా వ్యక్తపరిచినందుకు ఇప్పుడు వీసా నిరాకరణ అనే శిక్షను అనుభవించాలా?

భారతీయ జర్నలిస్టులకు తీరని ఆవేదన

అమెరికాలో ఉన్న లక్షలాది మంది భారతీయుల సమస్యలు, అక్కడ జరిగే రాజకీయ పరిణామాలు, టెక్నాలజీ, వలస విధానాలపై నిరంతరం గ్రౌండ్ రిపోర్టింగ్ చేసే భారతీయ జర్నలిస్టులకు ఈ నిర్ణయం గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. నిజాయితీగా వార్తలను అందించే ప్రతినిధులు కూడా తమ పాత పోస్టులు, రాజకీయ వ్యాఖ్యల వల్ల ఎక్కడ తమ వీసా తిరస్కరణకు గురవుతుందోనని తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు. స్వేచ్ఛగా రాయాల్సిన కలం.. భయం నీడలో వణుకుతోంది.

అధిపత్య ధోరణికి పరాకాష్ట.. ప్రజాస్వామ్యం ఎటుపోతోంది?

కేవలం తమ భజన చేసే తమ విధానాలను కీర్తించే మీడియా ప్రతినిధులను మాత్రమే దేశంలోకి రానిచ్చి.. నిజాలను నిలదీసే కరస్పాండెంట్లను సరిహద్దుల్లోనే అడ్డుకునే కుట్రకు ఇది ఆరంభమా? ఇది ప్రజాస్వామ్య మనుగడకే ముప్పు తెచ్చే పరిణామం. ఒక పక్క భావప్రకటనా స్వేచ్ఛ గురించి వేదికలపై ఉపన్యాసాలు ఇస్తూనే మరోపక్క విమర్శకుల నోళ్లు మూయించేలా ఉన్న ఈ నిర్ణయంపై అంతర్జాతీయ జర్నలిస్టు ప్రపంచం కన్నీరు పెడుతోంది.

అధికారానికి సత్యం చెప్పడమే జర్నలిజం పరమావధి. కానీ అమెరికా తెచ్చిన ఈ కొత్త డిజిటల్ గడప.. ఆ సత్యానికి, నిజాయితీకి సమాధి కడుతోందా అనే ప్రశ్న ప్రతి ఒక్కరి గుండెను పిండేస్తోంది.