Begin typing your search above and press return to search.

నాలుగేళ్లు చదువుకొని వెళ్లిపోవాలి.. అమెరికా చదువులు ఇక కష్టమే

ఇప్పటి వరకు ఎఫ్‌, జే వీసాల ద్వారా విద్యార్థులు, ఎక్స్ఛేంజ్‌ విజిటర్లు చదువుతున్నంత కాలం అక్కడే ఉండే అవకాశం కలిగేది.

By:  A.N.Kumar   |   28 Aug 2025 11:15 AM IST
నాలుగేళ్లు చదువుకొని వెళ్లిపోవాలి.. అమెరికా చదువులు ఇక కష్టమే
X

అమెరికాలో చదవాలన్న స్వప్నం అనేకమంది భారతీయ యువతకు ప్రేరణ. మంచి భవిష్యత్తు, మెరుగైన ఉద్యోగావకాశాల కోసం ప్రతి సంవత్సరం లక్షలాది మంది అమెరికా వర్సిటీలను ఆశ్రయిస్తున్నారు. కానీ తాజాగా ఆ దేశ హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం ప్రతిపాదించిన కొత్త వీసా నిబంధనలు ఈ స్వప్నాలపై తాళాలు వేసేలా కనిపిస్తున్నాయి.

ఇప్పటి వరకు ఎఫ్‌, జే వీసాల ద్వారా విద్యార్థులు, ఎక్స్ఛేంజ్‌ విజిటర్లు చదువుతున్నంత కాలం అక్కడే ఉండే అవకాశం కలిగేది. ఈ సౌలభ్యం వల్ల కోర్సులు మార్చుకోవడమో, కొత్త ప్రోగ్రామ్‌ల్లో చేరడమో సులభమయ్యేది. ఇప్పుడు ఆ వెసులుబాట్లన్నింటికి చెక్‌ పెడుతూ గరిష్ఠంగా నాలుగేళ్లకు మాత్రమే అనుమతిస్తామని అమెరికా చెబుతోంది. అంతేకాదు చదువు పూర్తయ్యాక వీసా పొడిగింపునకు ఇచ్చే గ్రేస్‌ పీరియడ్‌ను కూడా సగం చేసి 30 రోజులకు కుదించింది.

ప్రతిపాదిత మార్పుల వెనుక అమెరికా చెబుతున్న కారణం.. భద్రతా సమస్యలు, స్థానికుల అవకాశాల పరిరక్షణ, ప్రభుత్వంపై భారం తగ్గించడం. కానీ ప్రశ్న ఏమిటంటే అంతర్జాతీయ విద్యార్థులను అనుమానాస్పదంగా చూడడం వల్ల నిజంగానే అమెరికా సమాజం ప్రయోజనం పొందుతుందా? లేక ప్రతిభావంతులైన విద్యార్థులను దూరం చేసుకోవడం వల్ల దేశం నష్టపోతుందా?

ప్రపంచంలో అత్యుత్తమ మెదళ్లలో చాలా వరకు అమెరికా వర్సిటీల ద్వారానే తీర్చిదిద్దబడ్డాయి. స్టార్టప్‌లు, టెక్నాలజీ, పరిశోధన రంగాల్లో అమెరికా ఆధిపత్యానికి కారణం అంతర్జాతీయ విద్యార్థులే. అటువంటి వారి నివాసాన్ని నాలుగేళ్లకు పరిమితం చేయడం భవిష్యత్‌లో అమెరికా మేధో సంపత్తిని బలహీనపరిచే ప్రమాదం ఉంది.

ముఖ్యంగా భారతీయ విద్యార్థులపై ఈ మార్పులు తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం 3.3 లక్షల మంది అమెరికా వర్సిటీల్లో చదువుతున్నారు. వీరిలో ఎక్కువమంది ఇంజనీరింగ్‌, మెడిసిన్‌, మేనేజ్‌మెంట్‌ వంటి దీర్ఘకాలిక కోర్సులు ఎంచుకుంటారు. నాలుగేళ్ల పరిమితితో వారు సగం దారిలోనే ఆటంకాలను ఎదుర్కోవాల్సి రావచ్చు.

అమెరికా నిబంధనలు ఎలాగైనా ఆ దేశ అంతర్గత విధానాలే. కానీ మన విద్యా విధానాలు, అవకాశాలు ఇంత ఆకర్షణీయంగా ఉండాలి.. మన ప్రతిభావంతులు విదేశాలకు వెళ్లకుండానే ఇక్కడే ప్రపంచస్థాయి విద్య, ఉద్యోగావకాశాలు పొందగలగాలి. లేదంటే ప్రతి కొత్త ఆంక్షా భారతీయ విద్యార్థుల భవిష్యత్తును కుదిపేస్తూనే ఉంటుంది.