అమెరికా వీసా తిరస్కరణ రేట్లు: భారత్ 16.32%.. ప్రపంచ దేశాల పరిస్థితి ఏంటంటే?
అమెరికాకు వ్యాపారం (బీ1), పర్యాటకం (బీ2) లేదా రెండింటి కోసం దరఖాస్తు చేసుకునే నాన్ ఇమిగ్రెంట్ వీసాల తిరస్కరణ రేట్లపై 2024 గణాంకాలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించాయి.
By: A.N.Kumar | 17 Dec 2025 1:13 AM ISTఅమెరికాకు వ్యాపారం (బీ1), పర్యాటకం (బీ2) లేదా రెండింటి కోసం దరఖాస్తు చేసుకునే నాన్ ఇమిగ్రెంట్ వీసాల తిరస్కరణ రేట్లపై 2024 గణాంకాలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించాయి.ప్రపంచంలోని వివిధ దేశాల పౌరులకు వీసా మంజూరులో అమెరికా అనుసరిస్తున్న విధానాలను ఈ గణాంకాలు స్పష్టంగా చూపుతున్నాయి.
భారతదేశం పరిస్థితి.. మధ్యస్థ స్థాయిలో తిరస్కరణ
2024లో భారతదేశం నుంచి వచ్చిన బీ క్లాస్ వీసా దరఖాస్తులలో తిరస్కరణ రేటు 16.32 శాతం గా నమోదైంది. ఈ సంఖ్య బ్రిటన్ (18.03 శాతం ) కంటే తక్కువగా.. స్పెయిన్ (16.39 శాతం)తో దాదాపు సమానంగా అయితే మెక్సికో (13.87 శాతం) , బ్రెజిల్ (15.48శాతం ) కంటే కొంచెం ఎక్కువగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా భారీ సంఖ్యలో దరఖాస్తుదారులు ఉన్న భారత్ కు ఈ రేటు మధ్యస్థ స్థాయిని సూచిస్తుంది.
అత్యల్ప తిరస్కరణలు.. అభివృద్ధి చెందిన దేశాల ఆధిపత్యం
తిరస్కరణ రేటు అత్యంత తక్కువగా ఉన్న దేశాలు ఆర్థికంగా రాజకీయంగా అత్యంత స్థిరంగా ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. లిక్టెన్ స్టెయిన్ , మొనాకో, విచిత్రంగా ఉత్తరకొరియా 0 శాతం తిరస్కరణ రేటును కలిగి ఉన్నాయి.
ఇక 5-10 శాతం లోపు చూస్తే.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (1.46 శాతం ), జపాన్ (5.76 శాతం) , సౌదీ అరేబియా (7.89 శాతం), ఫ్రాన్స్ (8.50 శాతం) , ఇజ్రాయెల్ (8.64 శాతం) వంటి దేశాలకు అత్యంత తక్కువ తిరస్కరణ రేటు ఉంది. ఈ దేశాల పౌరులు అమెరికాలో ఉండిపోయే అవకాశం లేదని వీసా అధికారులు బలంగా విశ్వసిస్తున్నట్లు అర్థమవుతోంది.
ఇక యూరప్ దేశాలను చూస్తే.. జర్మనీ (10.02 శాతం), ఇటలీ (10.89 శాతం), డెన్మార్క్ (9.25%) వంటి పశ్చిమ యూరప్ దేశాలు కూడా తక్కువ తిరస్కరణ రేటును నమోదు చేశాయి.
అత్యధిక తిరస్కణలు చూస్తే..
ఇక అమెరికా తిరస్కరణ రేటు పొందిన దేశాలు కూడా ఉన్నాయి. కొన్ని దేశాలలో తిరస్కరణ రేటు 30% నుంచి 50% పైగా నమోదైంది. ఇరాన్ (55.54శాతం), పాకిస్తాన్ (45.64శాతం), నైజీరియా (46.51 శాతం), అప్ఘనిస్తాన్ (48.89శాతం)లలో తిరస్కరణ రేటు చాలా ఎక్కువగా ఉన్న దేశాలు ఇవీ.. ఇక ఉక్రెయిన్ (33.45%), రష్యా (38.56%)లలో యుద్ధ పరిస్థితులు, రాజకీయ అస్థిరత వంటి కారణాల వల్ల వీసా తిరస్కరణ రేటు గణనీయంగా పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
ఇక అమెరికాకు ఆనుకొని ఉన్న సరిహద్దు దేశం కెనడా అత్యంత తిరస్కరణ రేటు 56.35 శాతంగా ఉండడం ఆశ్చర్యపరిచంది.అమెరికాకు మిత్రదేశంగా ఉండి ఇంతలా తిరస్కరించడం షాకింగ్ గా మారింది. సాధారణంగా అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో కెనడాకు ఇంత అధిక తిరస్కరణ రేటు ఉండటంపై మరింత లోతైన అధ్యయనం అవసరం.
తిరస్కరణకు ప్రధాన కారణం
వీసా తిరస్కరణకు అత్యంత సాధారణ కారణం ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ సెక్షన్ 214(బీ). దీని ప్రకారం.. దరఖాస్తుదారు అమెరికాలో స్థిరపడడానికి ఉద్దేశించిన వలసదారుడు కాదని.. తమ స్వదేశానికి తిరిగి వచ్చేందుకు బలమైన కారణాలు ఉద్యోగం, కుటుంబం, ఆస్తులు వంటి బలమైన బంధాలు ఉన్నాయని ఇంటర్వ్యూలో నిరూపించుకోకపోతే వీసా తిరస్కరణకు గురవుతారు.
ఈ గణాంకాలు 2024లో అమెరికా వీసా దరఖాస్తు ప్రక్రియలో వివిధ దేశాల పౌరులు ఎదుర్కొన్న సవాళ్లను స్పష్టం చేస్తున్నాయి. దరఖాస్తుదారులు తమ స్వదేశంతో తమకున్న బంధాలను , ఆర్థిక స్థిరత్వాన్ని బలంగా నిరూపించుకోగలిగితేనే అమెరికా వీసా పొందే అవకాశాలు మెరుగవుతాయి.
