యూఎస్ సిటిజన్ షిప్ కోసం డెలివరీ.. ఇకపై చెల్లదు
ప్రపంచంలో పలు ప్రాశ్చాత్య దేశాలు ఉన్నప్పటికి.. అగ్రరాజ్యం అమెరికాలో దశాబ్దాలుగా అమలవుతున్న ఒక విధానాన్ని తమకు అనువుగా మార్చుకోవటానికి పలువురు సంపన్నులు ప్రయత్నిస్తుంటారు
By: Garuda Media | 12 Dec 2025 9:31 AM ISTప్రపంచంలో పలు ప్రాశ్చాత్య దేశాలు ఉన్నప్పటికి.. అగ్రరాజ్యం అమెరికాలో దశాబ్దాలుగా అమలవుతున్న ఒక విధానాన్ని తమకు అనువుగా మార్చుకోవటానికి పలువురు సంపన్నులు ప్రయత్నిస్తుంటారు. అందులో కీలకమైనది అమెరికాలో పుట్టే ఎవరైనా సరే వారికి అమెరికా పౌరసత్వం ఆటోమేటిక్ . ఈ వెసులుబాటుతో ఇంతకాలం పలువురు తమ బిడ్డకు జన్మనివ్వటం కోసం ప్రత్యేకంగా అమెరికాకు వెళ్లి.. అక్కడి ఆసుపత్రిలో జన్మనివ్వటం మామూలే.
అయితే.. ఈ తరహా ఎత్తుగడలకు చెక్ చెప్పాలని డిసైడ్ అయ్యింది ట్రంప్ సర్కార్. అమెరికా వలస విధాన విషయంలో కఠినంగా వ్యవహరించాలని డిసైడ్ అయిన నేపథ్యంలో ఈ తరహా కారణాలతో అమెరికా వీసా కోసం అప్లై చేసే వారిని రిజెక్టు చేసేలా నిర్ణయం తీసుకున్నారు. వీసాల జారీ విషయంలో గతంలో మాదిరి కాకుండా.. వారి అమెరికా పర్యటన ఉద్దేశం ఏమై ఉంటుందన్న అంశంపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు.
ఈ క్రమంలో బిడ్డ డెలివరీ కోసం.. పుట్టే బిడ్డకు అమెరికా పౌరసత్వం కోసమే వారి అమెరికా పర్యటనగా గుర్తిస్తే మాత్రం అలాంటి వారి వీసా దరఖాస్తుల్ని తాము తిర్కరిస్తామని భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం తాజాగా స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలోనూ అలెర్టుగా జారీ చేసింది. పుట్టే చిన్నారులకు అమెరికా పౌరసత్వం పొందటం పర్యాటకుల ప్రధాన ఉద్దేశంగా తాము భావిస్తే.. అలాంటి వీసా దరఖాస్తుల్ని రిజెక్టు చేస్తాం.. ఇకపై అలాంటి వాటిని అనుమతించమని స్పష్టం చేశారు. మొత్తంగా తమ దేశంలో అడుగు పెట్టే ప్రతి ఒక్కరిని సంపూర్ణంగా స్కాన్ చేసిన తర్వాతే తమ దేశంలోకి ఎంట్రీ ఇవ్వాలన్నట్లుగా ట్రంప్ సర్కారు తీరు ఉందని చెప్పాలి.
