పెద్ద బాంబు పేల్చిన అమెరికా: వీసా..గ్రీన్ కార్డులకు చుక్కలే
తాజాగా ఒక కార్యక్రమానికి హాజరైన లుట్నిక్.. వీసాలకు సంబంధించి హెచ్1బీ.. గ్రీన్ కార్డు జారీ విషయంలో కొత్త నిబంధనల్ని తీసుకురానున్నట్లు చెప్పారు.
By: Garuda Media | 27 Aug 2025 2:45 PM ISTరోజుకో సంచలన ప్రకటన చేస్తూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేస్తున్న ట్రంప్ ప్రభుత్వం.. తాజాగా మరో సంచలన బాంబ్ ను పేల్చింది. అమెరికా కలను నిజం చేసేందుకు అవసరమైన వీసా.. గ్రీన్ కార్డ్స్ రూల్స్ ను సమూలంగా మార్చనున్నట్లుగా యూఎస్ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న గ్రీన్ కార్డు వ్యవస్థ మొత్తం ఒక పెద్ద స్కాంగా మారిందన్న ఆయన.. అమెరికాకు వెళ్లాలనుకునే వారికి కొత్త నిబంధనలు తీసుకురానున్నట్లుగా చెప్పారు.
తాజాగా ఒక కార్యక్రమానికి హాజరైన లుట్నిక్.. వీసాలకు సంబంధించి హెచ్1బీ.. గ్రీన్ కార్డు జారీ విషయంలో కొత్త నిబంధనల్ని తీసుకురానున్నట్లు చెప్పారు. ప్రస్తుతం అమల్లో ఉన్న లాటరీ వ్యవస్థను తీసేయనున్నట్లు చెప్పారు. హెచ్1బీ వీసా జారీ అంశం కేవలం నైపుణ్యం.. వేతనం ఆధారంగా మాత్రమే జారీ చేస్తామన్నారు. అమెరికన్ కార్మికులను నియమించటమే మొదటి ప్రాధాన్యతగా ఉండాలి.. ప్రస్తుతం అమలు చేస్తున్న గ్రీన్ కార్డు వ్యవస్థలో లోపాలు ఉన్నాయన్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రస్తుతం అమల్లో ఉన్న గ్రీన్ కార్డు వ్యవస్థ సరికాదన్నారు. సగటు అమెరికన్ వార్షిక ఆదాయం 75వేల డాలర్లు ఉండగా.. గ్రీన్ కార్డు హోల్డర్ సగటు వార్షిక ఆధాయం 66వేల డాలర్లు మాత్రమే ఉందంటూ తమ నిర్ణయాన్ని సమర్థించే లాజిక్ ను తెర మీదకు తీసుకొచ్చారు. అధ్యక్షుడు ట్రంప్ విధానాలకు అనుగుణంగా కొత్త సంస్కరణల్ని తీసుకొస్తామన్నారు. ఈ మార్పులు అమెరికాకు వెళ్లాలనుకునే వారికి.. ముఖ్యంగా భారతీయుల మీద తీవ్ర ప్రభావాన్నిచూపుతుందని చెప్పాలి.
కొత్తగా తీసుకొచ్చే వీసా జారీ విధానంలో (హెచ్ 1బీ) ఎక్కువ జీతాలు ఉన్న వారికే మొదటి ప్రయారిటీ ఇస్తారు. దీంతో.. భారీ ఎత్తున జీతాలు.. ఆదాయాలు ఉన్నోళ్లకు మాత్రమే అమెరికాలో ఆశ్రయం లభిస్తుందని చెప్పాలి. గోల్డ్ కార్డు పేరుతో కొత్త వీసాను తీసుకొచ్చే అంశాన్ని దేశాధ్యక్షుడు ట్రంప్ చెప్పటం తెలిసిందే. అమెరికాలో 5 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టే విదేశీయులకు పర్మినెంట్ రెసిడెన్సీ హోదా ఇస్తామని ప్రకటించటం తెలిసిందే. చూస్తుంటే.. రానున్నరోజుల్లో ఎంపిక చేసిన కొన్ని వర్గాలకు మాత్రమే అమెరికాలో అడుగు పెట్టేలా చేయాలన్నది లక్ష్యంగా ఉందని చెప్పక తప్పదు.
