అమెరికాలో మీ బస: నిర్ణయించేది వీసా కాదు.. ఎంట్రీ ఆఫీసర్ మాత్రమే!
చాలా మంది భారతీయ ప్రయాణికులు తమ పాస్ పోర్ట్ పై 5 లేదా 10 ఏళ్ల అమెరికా వీసా ఉంటే.. అక్కడ ఎక్కువకాలం ఉండవచ్చని భావిస్తుంటారు.
By: A.N.Kumar | 18 Dec 2025 11:22 PM ISTచాలా మంది భారతీయ ప్రయాణికులు తమ పాస్ పోర్ట్ పై 5 లేదా 10 ఏళ్ల అమెరికా వీసా ఉంటే.. అక్కడ ఎక్కువకాలం ఉండవచ్చని భావిస్తుంటారు. కానీ ఇది ఒక పెద్ద అపోహ. నిజానికి అమెరికాలో మీరు ఎంతకాలం ఉండాలో నిర్ణయించేది వీసా కాదు.. అక్కడి యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) ఎంట్రీ ఆఫీసర్ మాత్రమే.
వీసా అంటే నిజంగా ఏమిటి?
యూఎస్ ఎంబసీ స్పష్టంగా చెబుతున్న విషయం ఏమిటంటే.. వీసా అనేది కేవలం అమెరికా సరిహద్దు వరకూ వెళ్లి ప్రవేశానికి అనుమతి కోరే హక్కు మాత్రమే. వీసా ఉన్నంత మాత్రాన దేశంలోకి తప్పనిసరిగా ప్రవేశం లభిస్తుందన్న గ్యారెంటీ లేదు. మీరు విమానాశ్రయం లేదా పోర్ట్ ఆఫ్ ఎంట్రీకి చేరుకున్న తర్వాత అక్కడి సీబీపీ అధికారి మిమ్మల్ని ప్రశ్నించి, మీ ప్రయాణ ఉద్దేశాన్ని పరిశీలించి మీరు ఎంతకాలం ఉండాలో నిర్ణయిస్తారు.
మీ బస గడువును ఎక్కడ చూసుకోవాలి?
అమెరికాలో ప్రవేశించిన వెంటనే మీకు అనుమతించిన బస కాలం ఐ-94 రికార్డులో నమోదు అవుతుంది. ఇది డిజిటల్ గా కూడా అందుబాటులో ఉంటుంది. మీ పాస్ పోర్ట్ పై వేసే స్టాంపులో లేదా డిజిటల్ ఐ-94 ఫారమ్ లో ‘అడ్మిట్ అంటిల్’ అనే తేదీ ఉంటుంది. ఈ తేది దాటిన తర్వాత మీ వీసా ఇంకా చెల్లుబాటు అవుతున్నా కూడా అక్కడ ఉండటం నిబంధనల ఉల్లంఘనగానే పరిగణిస్తారు.
గుర్తుంచుకోవాల్సిన ముఖ్యాంశాలు
మీ ఐ-94 వివరాలను ఎప్పుడైనా అధికారిక వెబ్ సైట్ https://i94.cbp.dhs.gov వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. ఇది కొత్త నిబంధన కాదు.. ఈ విషయం చాలా కాలంగా అమల్లోనే ఉంది. సుమారుడు మూడు నెలల క్రితం కూడా సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ఎంబసీ మరోసారి గుర్తు చేసింది. బోర్డర్ ఆఫీసర్ ఇచ్చిన గడువు పూర్తయ్యేలోపు దేశం విడిచి వెళ్లకపోతే భవిష్యత్తులో వీసా సమస్యలు, బ్యాన్ లు ఎదురయ్యే ప్రమాదం ఉంది.
మీరు అమెరికా ప్రయాణానికి సిద్ధమవుతున్నట్లయితే వీసా గడువు కంటే ఎక్కువగా ఐ-94లో ఉన్న అడ్మిట్ అంటిల్ తేదీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. అమెరికాలో మీ బసను నిర్ణయించేది వీసా కాదు.. ఎంట్రీ ఆఫీసర్ ఇచ్చిన అనుమతే అన్న నిజాన్ని మార్చి నిజాన్ని మర్చిపోకండి.
