వీసా-గ్రీన్ కార్డ్ కోసం ‘యాంటీ-అమెరికన్’ టెస్ట్..భారతీయుల్లో ఆందోళన
ఈ కొత్త విధానంలో భాగంగా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను నిశితంగా పరిశీలించాలని అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) అధికారులకు సూచించింది.
By: A.N.Kumar | 21 Aug 2025 6:00 PM ISTఅమెరికా వీసా, గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులకు ఇకపై కొత్త నిబంధనలు ఎదురుకానున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వలస విధానాలను మరింత కఠినతరం చేస్తూ కొత్తగా ‘యాంటీ-అమెరికన్ టెస్ట్’ పేరుతో ఒక నిబంధనను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం వీసా లేదా గ్రీన్‌కార్డ్ కోసం దరఖాస్తు చేసే వ్యక్తులు అమెరికా వ్యతిరేక భావజాలం కలిగి ఉన్నారా లేదా అనే అంశాన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు.
-సోషల్ మీడియా పోస్టులపై కఠిన నిఘా
ఈ కొత్త విధానంలో భాగంగా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను నిశితంగా పరిశీలించాలని అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) అధికారులకు సూచించింది. సోషల్ మీడియాలో అమెరికా వ్యతిరేక పోస్టులు, వ్యాఖ్యలు లేదా ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని అనుమానించినా దరఖాస్తును తిరస్కరించే అవకాశం ఉంది. ఈ “యాంటీ-అమెరికన్” కార్యకలాపాలు అభ్యర్థులపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.
USCIS ప్రతినిధి మాథ్యూ ట్రాజెసర్ మాట్లాడుతూ “అమెరికా ప్రయోజనాలు ఈ దేశాన్ని ద్వేషించే వారికి ఇవ్వలేం. వలస ప్రయోజనాలు హక్కు కాదు, ప్రత్యేక అవకాశం మాత్రమే” అని స్పష్టం చేశారు. ఈ ప్రకటన అమెరికా వలస విధానాలపై ప్రభుత్వ వైఖరిని తెలియజేస్తుంది.
-భారతీయుల ఆందోళన
ఈ కఠిన నిబంధనలు వేలాదిమంది భారతీయ విద్యార్థులు, ఐటీ నిపుణులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది 6,000 మందికి పైగా విద్యార్థుల వీసాలను అమెరికా రద్దు చేసింది. దీనికి తోడు ఈ కొత్త నిబంధనలు భారతీయ దరఖాస్తుదారులపై మరింత ఒత్తిడి పెంచుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
అయితే ఈ విధానంపై విమర్శలు కూడా పెరుగుతున్నాయి. ఈ కఠిన నిబంధనల వల్ల అమెరికాకు రావాలనుకునే ప్రతిభావంతులైన విద్యార్థులు, నిపుణులు వెనకడుగు వేసే అవకాశం ఉందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే వీసా ఆంక్షలతో భయాందోళనలో ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు, ఈ కొత్త ‘యాంటీ-అమెరికన్’ స్క్రీనింగ్‌తో మరింత ఆందోళన చెందుతున్నారు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు, పరిశోధనలకు అవసరమైన మానవ వనరుల లభ్యతపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
