Begin typing your search above and press return to search.

అమెరికా వాణిజ్య కఠిన నిర్ణయాలు: భారతీయ వ్యవసాయంపై ప్రభావం

అమెరికా పాల ఉత్పత్తులను కొనాలని కార్పొరేట్ సంస్థల ఒత్తిడి పెరుగుతోంది. కానీ అమెరికాలో పశువులకు జీఎంఓ పంటలు, మాంస ఉపఉత్పత్తులు దాణాగా వేస్తారు.

By:  A.N.Kumar   |   27 Aug 2025 11:50 AM IST
అమెరికా వాణిజ్య కఠిన నిర్ణయాలు: భారతీయ వ్యవసాయంపై ప్రభావం
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనుసరిస్తున్న వాణిజ్య విధానాలు, ముఖ్యంగా భారతదేశంపై సుంకాల పెంపు, దేశీయ ఎగుమతులను మాత్రమే కాకుండా.. భారత రైతాంగాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అమెరికా నుండి దిగుమతి అవుతున్న చౌక ఉత్పత్తులు మన మార్కెట్‌ను ముంచెత్తే ప్రమాదం ఏర్పడింది. దీనివల్ల దేశీయ రైతులు తీవ్రంగా నష్టపోనున్నారు.

- పత్తి మార్కెట్‌పై సుంకాల ప్రభావం

ట్రంప్ ఒత్తిడి కారణంగా భారత ప్రభుత్వం ఇటీవల విదేశీ పత్తి దిగుమతులపై 11% సుంకాన్ని తాత్కాలికంగా తొలగించింది. ఈ నిర్ణయం అమెరికన్ పత్తికి భారత మార్కెట్‌లోకి సులభంగా ప్రవేశించే మార్గాన్ని సుగమం చేసింది. ప్రస్తుతం, విదేశీ పత్తి క్యాండీ ధర రూ. 50,000-51,000 మధ్య ఉండగా దేశీయ పత్తి ధర రూ. 56,000-57,000 మధ్య ఉంది. భవిష్యత్తులో కొత్త కనీస మద్దతు ధర (MSP) రూ. 61,000గా నిర్ణయించబడితే చౌక పత్తి మన రైతులకు భారీ నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. 'పత్తి ధర వ్యత్యాసం చూస్తే.. విదేశీ పత్తి రూ. 50-51 వేలు, దేశీయ పత్తి రూ. 56-57 వేలుగా ఉంది.

- అమెరికా సబ్సిడీలు: మన రైతులకు సవాలు

అమెరికా ప్రభుత్వం తమ రైతులకు భారీ సబ్సిడీలు అందిస్తుంది. ఈ సబ్సిడీల కారణంగా, పత్తి, పాలు, చీజ్, చక్కెర, సోయాబీన్, మొక్కజొన్న, బియ్యం వంటి ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్‌లో చాలా తక్కువ ధరలకు లభిస్తాయి. ఈ చౌక ఉత్పత్తులు భారత్‌లోకి దిగుమతి అయితే, మన రైతులు వాటితో పోటీ పడలేరు. తద్వారా వస్త్ర పరిశ్రమ వంటి కొన్ని రంగాలు మాత్రమే లాభపడతాయి, కానీ వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింటుంది.

-జీఎంఓ పంటల ముప్పు

అమెరికా నుండి దిగుమతి అయ్యే పంటలలో ఎక్కువ శాతం జన్యుమార్పిడి (GMO) ఉత్పత్తులే. మొక్కజొన్న, చక్కెర, సోయా, కనోలా నూనెల రూపంలో ఇవి భారత మార్కెట్‌లోకి వస్తే మన రైతులకు మాత్రమే కాకుండా, ప్రజల ఆరోగ్యానికి కూడా ముప్పు ఉంటుంది. జీఎంఓ ఉత్పత్తులు దీర్ఘకాలికంగా ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

-పాల ఉత్పత్తుల రంగంలో ఒత్తిడి

అమెరికా పాల ఉత్పత్తులను కొనాలని కార్పొరేట్ సంస్థల ఒత్తిడి పెరుగుతోంది. కానీ అమెరికాలో పశువులకు జీఎంఓ పంటలు, మాంస ఉపఉత్పత్తులు దాణాగా వేస్తారు. ఈ కారణంగా అక్కడి పాల నాణ్యత మన దేశీయ పాల నాణ్యతకు భిన్నంగా ఉంటుంది. ఈ ఉత్పత్తులు మన మార్కెట్‌లోకి వస్తే, అమూల్ వంటి పెద్ద సహకార సంస్థలతో పాటు, చిన్న పాడి రైతులకు కూడా నష్టం వాటిల్లుతుంది.

-'సేంద్రియ ఉత్పత్తులే మార్గం'

భారతీయ రైతులను కాపాడటానికి సేంద్రియ ఉత్పత్తులే మార్గంగా చెప్పొచ్చు. దీనివల్ల ప్రజల ఆరోగ్యాన్ని రక్షించవచ్చు. దిగుమతులపై కఠిన నిబంధనలు విధించాలి. సేంద్రియ ఉత్పత్తులకే అనుమతి ఇవ్వాలి.

- పరిష్కార మార్గాలు

ట్రంప్ విధానాలు తమ దేశీయ రైతులకు మద్దతుగా ఉన్నట్లే, భారతదేశం కూడా తమ రైతులను రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. స్వదేశీ వ్యవసాయం, పాడి పరిశ్రమలను కాపాడటానికి కొన్ని కఠినమైన నిబంధనలను విధించాలి. జీఎంఓ ఉత్పత్తులకు నో చెబుతారు. జన్యుమార్పిడి పంటల దిగుమతులను పూర్తిగా నిలిపివేయాలి.

సేంద్రియ ఉత్పత్తులకు మాత్రమే అనుమతించాలి. విషరసాయనాల అవశేషాలు లేని, సేంద్రియ పద్ధతుల్లో ఉత్పత్తి చేసిన వాటికి మాత్రమే గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వాలి. దేశీయ రైతులకు మద్దతు ఇవ్వాలి. మన రైతులకు మద్దతు ఇచ్చే ధర విధానాలను ప్రోత్సహించాలి.

ట్రంప్‌ విధానాలు ఒకవైపు మన ఎగుమతులను అడ్డుకుంటే, మరోవైపు అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు మన మార్కెట్‌ను ముంచెత్తే ప్రమాదం ఉంది. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి భారత్‌ తెలివిగా, వ్యూహాత్మకంగా వ్యవహరించడం అత్యవసరం. దీని ద్వారా మన ఆర్థిక వ్యవస్థ, మన రైతులు రక్షింపబడతారు.