Begin typing your search above and press return to search.

చైనాపై మెతకవైఖరి... అమెరికా ఆందోళన ఇదేనంట!

రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగించే దేశాలపై భారీగా సుంకాలు విధిస్తానంటూ అమెరికా పదేపదే హెచ్చరికలు చేస్తున్న సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   18 Aug 2025 12:25 PM IST
చైనాపై మెతకవైఖరి... అమెరికా ఆందోళన ఇదేనంట!
X

రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగించే దేశాలపై భారీగా సుంకాలు విధిస్తానంటూ అమెరికా పదేపదే హెచ్చరికలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులోభాగంగా.. రష్యా నుంచి పెద్దమొత్తంలో చమురు కొనుగోలు చేస్తోందని ఆరోపిస్తూ ఇటీవల భారత్‌ పై అదనపు సుంకాలు విధించింది. దీనిపై అమెరికా నుంచి పూటకోమాట వస్తుంది. ఈ నేపథ్యంలో చైనాపై మెతకవైఖరి వ్యాఖ్యలు రావడం గమనార్హం.

అవును... రష్యా నుంచి పెద్దమొత్తంలో చమురు కొనుగోలు చేస్తోందని ఆరోపిస్తూ ఇటీవల భారత్‌ పై అమెరికా అక్కసు వెళ్లగక్కుతూ అదనపు సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. మరోవైపు చైనాపై మాత్రం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మెతక వైఖరిని ప్రదర్శిస్తున్నారు. తాజాగా చైనాపై సుంకాల విషయంలో వెనక్కి తగ్గడంపై యూఎస్‌ విదేశాంగశాఖ మంత్రి మార్కో రూబియో స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

చైనాపై ద్వితీయ ఆంక్షలు విధిస్తే ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉందని.. అందుకే ఈ విషయంలో చైనాపై మాత్రం వెనక్కి తగ్గాల్సి వచ్చిందని సమర్థించుకున్న రూబియో... రష్యాతో భారత్‌ చేస్తున్న ఇంధన వాణిజ్యం అమెరికాకు సమస్యగా మారిందని అన్నారు. భారత్‌.. చమురు, బొగ్గు, గ్యాస్‌ వంటివాటిని తక్కువ ధరకు రష్యా నుంచి కొనుగోలు చేస్తుందని అన్నారు.

దీనివల్ల పరోక్షంగా ఉక్రెయిన్‌ పై రష్యా చేస్తున్న యుద్ధానికి సహకరిస్తోందని ఆరోపించారు. మరోవైపు చైనా, భారత్‌ లపై 100 శాతం సుంకాల విధింపును ప్రతిపాదించే సెనెట్ బిల్లుపై తాము చర్చలు జరిపిన సమయంలో ఈ విషయంపై పలు యూరోపియన్ దేశాలు అసంతృప్తి వ్యక్తంచేశాయని రూబియో వెల్లడించారు. ఏది ఏమైనా అమెరికా తాజా నిర్ణయం... చైనాను తమలపాకుతో కొట్టి, భారత్ ను తలుపుచెక్కతో మోదినట్లు ఉందని అంటున్నారు!

కాగా... అలాస్కా వేదికగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తో ఉక్రెయిన్‌ యుద్ధం ముగించే విషయంపై చర్చలు జరిగిన సందర్భంగా స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. రష్యా చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అదనపు సుంకాల గురించి రెండు, మూడు వారాల్లో పునరాలోచన చేస్తామని.. రష్యా తన చమురు క్లయింట్‌ ను కోల్పోయిందని (భారత్ ను ఉద్దేశించి) వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.