Begin typing your search above and press return to search.

ట్రంప్‌ సుంకాలు : భారత్‌లో భారీగా ఉద్యోగాలు ఊస్ట్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన సుంకాల ప్రభావం ఇప్పుడు కేవలం ఆర్థిక లెక్కల్లోనే కాదు.. భారత ఉద్యోగ మార్కెట్‌ దాకా చేరుకుంది.

By:  A.N.Kumar   |   12 Sept 2025 9:44 PM IST
ట్రంప్‌ సుంకాలు : భారత్‌లో భారీగా ఉద్యోగాలు ఊస్ట్
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన సుంకాల ప్రభావం ఇప్పుడు కేవలం ఆర్థిక లెక్కల్లోనే కాదు.. భారత ఉద్యోగ మార్కెట్‌ దాకా చేరుకుంది. సూరత్‌లో 1.35 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవడం ఒక్క ఉదాహరణ మాత్రమే. ముత్యాలు, ఆభరణాలు, సముద్రపు ఆహార ఎగుమతులు, తయారీ రంగం అన్నీ ఈ దెబ్బ తాలూకు ప్రతికూలతను అనుభవిస్తున్నాయి. కాంగ్రెస్‌ నేత శశి థరూర్‌ సింగపూర్‌లో చేసిన వ్యాఖ్యలు ఈ వాస్తవానికి ప్రతిబింబం.

ట్రంప్‌ వైఖరి.. దౌత్యానికి విరుద్ధం

థరూర్‌ చేసిన విమర్శల్లో ఒక ముఖ్యమైన కోణం ట్రంప్‌ ప్రవర్తన. అమెరికా అధ్యక్షుడి స్థాయి నుంచి ఎప్పుడూ వినిపించని మాటలు ఆయన నోట వినిపిస్తున్నాయి. ప్రపంచ దేశాలు తన ముందు మోకరిల్లుతాయని చెప్పడం, భారత్‌–రష్యాలను “డెడ్‌ ఎకానమీలు”గా వ్యవహరించడం, తనకే నోబెల్‌ శాంతి బహుమతి అర్హత ఉందని గొప్పలు చెప్పుకోవడం ఇవన్నీ ఒక దేశాధినేతగా చూపవలసిన సమతుల్య వైఖరికి విరుద్ధం.

దౌత్యం అనేది సహకారం, గౌరవం, సమన్వయం మీద నడుస్తుంది. కానీ ట్రంప్‌ ఆచరణలో అవి అరుదుగా కనిపిస్తున్నాయి. అమెరికా వంటి శక్తివంతమైన దేశం తీసుకునే నిర్ణయాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. అలాంటప్పుడు నిర్లక్ష్య ధోరణి అనేక దేశాలను ఇబ్బందుల్లోకి నెడుతోంది.

* భారత్‌ ముందున్న మార్గం

అమెరికా సుంకాల వల్ల భారత్‌కు వచ్చిన ఇబ్బందులు వాస్తవమే. కానీ దీన్ని కేవలం విమర్శలతో ముగించలేం. మన ఎగుమతులను ఒకే మార్కెట్‌కు పరిమితం చేయడం ఎంత ప్రమాదకరమో ఈ పరిణామం మనకు గుర్తు చేసింది. ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా, ఆసియా దేశాల్లో కొత్త మార్కెట్లను వెతకడం అత్యవసరం. తయారీ రంగానికి విస్తృత మద్దతు ఇవ్వడం, దేశీయ వినియోగాన్ని పెంచడం కూడా కీలకం... అమెరికాతో చర్చలు కొనసాగించడం అవసరమే అయినా, దానిపై ఆధారపడటం మాత్రం ప్రమాదకరం.

ట్రంప్‌ విధానం, అతని దౌత్య శైలి ఇవి గందరగోళాన్ని సృష్టిస్తున్నాయన్నది థరూర్‌ వ్యాఖ్యల సారాంశం. కానీ ఈ గందరగోళం మనకు ఒక పెద్ద పాఠాన్ని కూడా చెబుతోంది. ప్రపంచ మార్కెట్లలో విభిన్న అవకాశాలను అన్వేషించకపోతే, ఒకే దేశంపై ఆధారపడితే, భారత ఆర్థిక వ్యవస్థ మరిన్ని దెబ్బలు తినే ప్రమాదం ఉంది. కాబట్టి, ట్రంప్‌ సుంకాలను విమర్శించడం మాత్రమే కాకుండా, భారత్‌ కొత్త వ్యూహాలతో ముందుకు సాగాల్సిన సమయం ఇది.