Begin typing your search above and press return to search.

ఆడ లేదా మగ... 'ఎక్స్' కి ఛాన్స్ లేదంటూ సుప్రీం కీలక నిర్ణయం!

రెండోసారి అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న పలు కీలక, సంచలన నిర్ణయాల్లో పాస్ పోర్టులో ఎక్స్ అని చెప్పుకోవడానికి వీలేదనేది ఒకటనే సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   8 Nov 2025 10:57 AM IST
ఆడ లేదా మగ... ఎక్స్ కి ఛాన్స్  లేదంటూ సుప్రీం కీలక నిర్ణయం!
X

రెండోసారి అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న పలు కీలక, సంచలన నిర్ణయాల్లో పాస్ పోర్టులో ఎక్స్ అని చెప్పుకోవడానికి వీలేదనేది ఒకటనే సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వారు కచ్చితంగా ఆడ లేదా మగ అని ప్రకటించాలని ఉత్తర్వును జారీ చేశారు. దీనిపై అగ్రరాజ్యంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ సమయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

అవును... పాస్ పోర్టులో ఎక్స్ అని చెప్పుకోవడానికి వీలేదనేది.. వారు కచ్చితంగా ఆడ లేదా మగ అని ప్రకటించాలని డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ వ్యవహారం కోర్టు మెట్లెక్కింది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రంప్ ఉత్తర్వును సుప్రీంకోర్టు సమర్ధించింది.

ఇదే సమయంలో... ట్రాన్స్‌ జెండర్లు సైన్యంలో పని చేయరాదనే ట్రంప్‌ సర్కారు గతంలో జారీచేసిన ఉత్తర్వునూ సుప్రీంకోర్టు సమర్థించింది. కొత్త లేదా పునరుద్ధరించబడిన పాస్‌ పోర్ట్‌ లలో లింగ గుర్తింపుకు అనుగుణంగా ప్రజలు పురుషుడు, స్త్రీ లేదా ఎక్స్ ని ఎంచుకోనివ్వాలని కోరుతూ దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాన్ని ఈ నిర్ణయం నిలిపివేసింది.

వాస్తవానికి 1992 నుండి విదేశాంగ శాఖ కొన్ని పరిస్థితులలో ప్రజలు తమ పుట్టుకతో వచ్చిన లింగానికి అనుగుణంగా లేని పురుషుడు లేదా స్త్రీ మార్కర్‌ ను ఎంచుకోవడానికి అనుమతించింది. ఈ నేపథ్యంలో బైడెన్ పరిపాలన 2021లో వారికోసం "ఎక్స్" ఎంపికను ప్రవేశపెట్టింది. అయితే ఈ ఆప్షన్ ను ట్రంప్ రద్దు చేశారు.. తాజాగా ట్రంప్ నిర్ణయాన్ని సుప్రీం ఆమోదించింది.

ఈ సందర్భంగా... ప్రజలందరూ తాముగా ఉండే స్వేచ్ఛకు ఇది హృదయ విదారకమైన ఎదురుదెబ్బ అని.. ట్రంప్ పరిపాలన లింగమార్పిడి వ్యక్తులకు, వారి రాజ్యాంగ హక్కులకు వ్యతిరేకంగా రగిలిస్తున్న అగ్నికి ఈ నిర్ణయం ఆజ్యం పోస్తోందని.. ఈ విధానాన్ని సవాలు చేసిన లింగమార్పిడి వ్యక్తుల తరపున వాదించే న్యాయవాది జాన్ డేవిడ్సన్ ఒక ప్రకటనలో తెలిపారు.

కాగా... డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న తన మొదటి రోజు పదవిలోకి వచ్చిన వెంటనే దీనికి సంబంధించిన బైడెన్ నియమాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్పందించిన ట్రంప్... ప్రజలు పుట్టినప్పుడు వారి లింగాన్ని ప్రతిబింబించే పాస్‌ పోర్ట్‌ లను కలిగి ఉండాలని అన్నారు. దీంతో.. ట్రంప్ నిర్ణయాన్ని అనేకమంది ట్రాన్స్ జెండర్లు సవాలు చేశారు.

ఈ సందర్భంగా... రాజ్యాంగంలోని ఐదవ సవరణ కింద సమాన రక్షణ పొందే హక్కును, అలాగే అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ యాక్ట్ అనే ఫెడరల్ చట్టాన్ని ట్రంప్ విధానం ఉల్లంఘించినట్లవుతుందని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో... మసాచుసెట్స్‌ లోని ఒక ఫెడరల్ న్యాయమూర్తి ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు.

ఇందులో భాగంగా... ప్రజలు వారి స్వంత గుర్తులను లేదా "ఎక్స్"ని ప్రత్యామ్నాయంగా ఎంచుకోగలగాలి అని అన్నారు. దీనిపై ట్రంప్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. తాజాగా ఆ ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది!