దేశ బహిష్కరణే.. గ్రీన్‌కార్డ్ హోల్డర్లు జాగ్రత్తగా ఉండాల్సిందేనా?
అమెరికాలో స్థిరపడిన గ్రీన్‌కార్డ్ హోల్డర్లకు అక్కడి అత్యున్నత న్యాయస్థానం గట్టి షాక్ ఇచ్చింది.
By: A.N.Kumar | 24 Jun 2026 10:39 AM ISTఅమెరికాలో స్థిరపడిన గ్రీన్‌కార్డ్ హోల్డర్లకు అక్కడి అత్యున్నత న్యాయస్థానం గట్టి షాక్ ఇచ్చింది. నేరారోపణలు ఎదుర్కొంటున్న గ్రీన్‌కార్డ్ హోల్డర్లను దేశం నుంచి బహిష్కరించే ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన వాదనకు మద్దతుగా 6-3 మెజారిటీతో న్యాయస్థానం ఈ నిర్ణయాన్ని వెలువరించింది. ఈ తీర్పుతో అమెరికాలో దశాబ్దాలుగా నివసిస్తున్న లక్షలాది మంది వలసదారుల్లో సరికొత్త ఆందోళన మొదలైంది.
అసలు ఏమిటీ కేసు? బాధితుడు ఎవరు?
ఈ వివాదానికి మూలం ముక్ చోయ్ లావ్ అనే గ్రీన్‌కార్డ్ హోల్డర్‌కు సంబంధించిన కేసు. నకిలీ వస్తువుల వ్యాపారం/ఫోర్జరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ఒకసారి విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి అమెరికాకు వచ్చారు. ఆ సమయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయనను సాధారణ గ్రీన్‌కార్డ్ హోల్డర్‌గా కాకుండా అమెరికాలోకి కొత్తగా ప్రవేశించేందుకు అనుమతి కోరుతున్న విదేశీయుడిగా పరిగణించారు. అధికారుల ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ లావ్ కోర్టును ఆశ్రయించగా ఈ కేసు సుదీర్ఘ విచారణ అనంతరం సుప్రీంకోర్టుకు చేరింది.
సుప్రీంకోర్టు తీర్పులో ఏముంది?
ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు ఇమ్మిగ్రేషన్ అధికారులకు విపరీతమైన అధికారాలు కట్టబెడుతూ తీర్పునిచ్చింది. ఒక గ్రీన్‌కార్డ్ హోల్డర్‌పై డిపోర్టేషన్ ప్రక్రియను ప్రారంభించడానికి లేదా వారిని "కొత్తగా దేశంలోకి ప్రవేశించే వ్యక్తి"గా పరిగణించడానికి... సదరు వ్యక్తి చేసిన నేరానికి సంబంధించిన "స్పష్టమైన బలమైన ఆధారాలు" ముందే సమర్పించాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. కేవలం ప్రాథమిక ఆరోపణలు లేదా అనుమానాల ఆధారంగానే సరిహద్దు భద్రతా అధికారులు, ఇమ్మిగ్రేషన్ అధికారులు తమ విచక్షణాధికారాలను ఉపయోగించి చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది.
ఈ తీర్పుపై అమెరికా న్యాయవ్యవస్థతో పాటు వలసదారుల సంఘాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. "ఈ నిర్ణయం వల్ల చట్టబద్ధమైన గ్రీన్‌కార్డ్ హోల్డర్ల ప్రాథమిక హక్కులు బలహీనపడే ప్రమాదం ఉంది. వలస వ్యవహారాల్లో ప్రభుత్వానికి మితిమీరిన అధికారాలు ఇచ్చినట్లవుతుంది." అని సుప్రీంకోర్టు లిబరల్ న్యాయమూర్తి జస్టిస్ కేతంజి బ్రౌన్ జాక్సన్ అభిప్రాయపడ్డారు.
ఇమ్మిగ్రేషన్ హక్కుల సంస్థలు సైతం ఈ తీర్పును తప్పుబడుతున్నాయి. కోర్టులో నేరం నిరూపణ కాకముందే.. కేవలం ఆరోపణల ఆధారంగా కఠినమైన ఇమ్మిగ్రేషన్ చర్యలు తీసుకోవడం వల్ల శాశ్వత నివాసితుల్లో అభద్రతాభావం, అనిశ్చితి పెరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దేశ భద్రతను కాపాడేందుకు.. తీవ్రమైన నేరాలకు పాల్పడే వలసదారులపై వేగంగా చర్యలు తీసుకునేందుకు ఈ తీర్పు ఎంతగానో దోహదపడుతుందని ప్రభుత్వ మద్దతుదారులు వాదిస్తున్నారు.
గ్రీన్‌కార్డ్ హోల్డర్లు జాగ్రత్తగా ఉండాల్సిందేనా?
ఈ తాజా తీర్పు అమెరికా ఇమ్మిగ్రేషన్ చరిత్రలో ఒక పెద్ద మలుపుగా మారనుంది. ముఖ్యంగా వ్యాపార లేదా వ్యక్తిగత పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లి.. తిరిగి అమెరికాకు వచ్చే గ్రీన్‌కార్డ్ హోల్డర్లు ఇకపై ఇమ్మిగ్రేషన్ నిబంధనల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. చిన్నపాటి చట్టపరమైన వివాదాలు లేదా ఆరోపణలు ఉన్నా.. విదేశీ ప్రయాణాలు చేసేటప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
