అమెరికా ప్రభుత్వం మూత.. ఫెడరల్ ఉద్యోగులు ఔట్
ఇప్పటికే లక్షలాది మంది ఫెడరల్ ఉద్యోగులు జీతాలు లేకుండా ఫర్లో (తాత్కాలిక సెలవు) లోకి పంపబడిన నేపథ్యంలో ఇప్పుడు శాశ్వత తొలగింపులు కూడా అధికారికంగా ప్రారంభమయ్యాయి.
By: A.N.Kumar | 11 Oct 2025 11:59 AM ISTఅమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ మరింత తీవ్రమవుతోంది. ఆందోళనకరమైన మలుపు తిరిగింది. ఇప్పటికే లక్షలాది మంది ఫెడరల్ ఉద్యోగులు జీతాలు లేకుండా ఫర్లో (తాత్కాలిక సెలవు) లోకి పంపబడిన నేపథ్యంలో ఇప్పుడు శాశ్వత తొలగింపులు కూడా అధికారికంగా ప్రారంభమయ్యాయి.
వైట్‌హౌస్ బడ్జెట్ డైరెక్టర్ రస్సెల్ వోటు శుక్రవారం సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ప్రకటించగా ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ (OMB) ప్రతినిధి దానిని ధృవీకరించారు. ఈ తొలగింపులు "గణనీయమైన స్థాయిలో" ఉన్నాయని ఆయన తెలిపారు. షట్‌డౌన్ సమయంలో ఇలా శాశ్వత తొలగింపులు జరగడం చాలా అరుదు.. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
*యూనియన్ల అత్యవసర పిటిషన్
ప్రభుత్వ ఈ చర్యపై ఫెడరల్ ఉద్యోగుల సంఘాలు (యూనియన్లు) వెంటనే ప్రతిస్పందించాయి. ఉద్యోగుల తొలగింపులను నిలిపివేయాలంటూ అత్యవసర కోర్టు ఆదేశాల కోసం పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ తొలగింపులు చట్టపరమైన రక్షణలు, ఉద్యోగుల న్యాయపరమైన హక్కులను ఉల్లంఘిస్తున్నాయని యూనియన్లు బలంగా వాదిస్తున్నాయి. ఈ చర్యను అవి “బాధ్యతారహితమైనది”.. “అనూహ్యమైనది” అని తీవ్రంగా విమర్శించాయి.
*ప్రజా సేవలపై తీవ్ర ప్రభావం
కాంగ్రెస్‌లో బడ్జెట్ ఆమోదం నిలిచిపోవడంతో మొదలైన ఈ షట్‌డౌన్ ఇప్పటికే రవాణా, జాతీయ పార్కులు, ప్రజారోగ్య సేవలు వంటి అనేక కీలక రంగాలను దెబ్బతీసింది. ఇప్పుడు శాశ్వత తొలగింపులు కొనసాగితే.. దాని ప్రభావం కేవలం ఉద్యోగుల కుటుంబాలపైనే కాకుండా.. వివిధ ఏజెన్సీల పనితీరు, ప్రజా సేవల వ్యవస్థ మీద కూడా తీవ్రమైన దుష్ప్రభావం చూపవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఈ ఫండింగ్ సంక్షోభం కొత్త ఉత్కంఠ దశలోకి చేరింది. ఈ తొలగింపులపై కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది. కాంగ్రెస్ ఎప్పుడు బడ్జెట్ ప్రతిష్టంభనను పరిష్కరిస్తుంది అనే దానిపైనే వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్తు ఆధారపడి ఉంది.
