Begin typing your search above and press return to search.

"చైనా వెళ్తే ఫోన్ వాషింగ్టన్‌లోనే వదిలేస్తా... భారత్‌కు తెస్తా".. అమెరికా సెనేటర్ వ్యాఖ్యల వెనుక అసలు కథ

ప్రపంచంలో అత్యంత కీలకమైన అంశంగా మారిన డిజిటల్ భద్రత విషయంలో అమెరికా భారత్‌ను ఎంతటి విశ్వసనీయ భాగస్వామిగా చూస్తోందో ఈ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి.

By:  A.N.Kumar   |   1 July 2026 10:25 PM IST
చైనా వెళ్తే ఫోన్ వాషింగ్టన్‌లోనే వదిలేస్తా... భారత్‌కు తెస్తా.. అమెరికా సెనేటర్ వ్యాఖ్యల వెనుక అసలు కథ
X

"నేను చైనాకు వెళ్లినప్పుడు నా ఫోన్‌ను వాషింగ్టన్‌లోనే వదిలేస్తాను. కానీ భారత్‌కు వచ్చినప్పుడు ఇదే ఫోన్‌ను నాతో తీసుకొస్తాను. భారత్‌పై నాకు ఎంత నమ్మకం ఉందో దీనితో అర్థమవుతుంది. చైనా విషయంలో నేను అలా చేయలేను." అని అంతర్జాతీయ రాజకీయాలు, సైబర్ భద్రతా వలయాల్లో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక్క వాక్యంలో చెప్పిన ఈ పోలిక వెనుక ఉన్న సందేశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచంలో అత్యంత కీలకమైన అంశంగా మారిన డిజిటల్ భద్రత విషయంలో అమెరికా భారత్‌ను ఎంతటి విశ్వసనీయ భాగస్వామిగా చూస్తోందో ఈ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి.

స్మార్ట్‌ఫోన్ భద్రత... వ్యూహాత్మక సందేశం

నేటి కాలంలో ఒక స్మార్ట్‌ఫోన్‌లో కేవలం వ్యక్తిగత సమాచారం మాత్రమే కాదు, ప్రభుత్వ వ్యవహారాలు, అధికారిక ఈ-మెయిల్స్, ఆర్థిక లావాదేవీలు, అత్యంత గోప్యమైన డేటా కూడా నిక్షిప్తమై ఉంటుంది. అందుకే విదేశీ పర్యటనలకు వెళ్లే సమయంలో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తమ ప్రధాన ఫోన్లను వెంట తీసుకెళ్లకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ఈ నేపథ్యంలో అమెరికా సెనేటర్ చేసిన వ్యాఖ్యలను సాధారణ మాటలుగా కాకుండా.. చైనాకు వ్యతిరేకంగా అమెరికా ఇస్తున్న వ్యూహాత్మక సందేశంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

అమెరికా-చైనా సాంకేతిక యుద్ధం

గత కొన్నేళ్లుగా అమెరికా, చైనా మధ్య సాంకేతిక ఆధిపత్య పోటీ తీవ్రస్థాయికి చేరుకుంది. : చైనా ప్రభుత్వ మద్దతుతో జరిగే సైబర్ దాడులపై అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. మేధో సంపత్తి హక్కుల ఉల్లంఘన, సాంకేతిక రంగంలో జాతీయ భద్రతకు ముప్పు వంటి అంశాలపై అమెరికా చైనాను నిరంతరం హెచ్చరిస్తూనే ఉంది. ఈ కారణంగానే చైనా పర్యటనలకు వెళ్లే అమెరికా అధికారులకు కఠినమైన సైబర్ భద్రతా మార్గదర్శకాలు అమలులో ఉన్నాయి.

భారత్‌పై పెరుగుతున్న 'నమ్మకం'

మరోవైపు భారత్-అమెరికా సంబంధాలు గత దశాబ్దంలో ఊహించని రీతిలో బలపడ్డాయి. రక్షణ, వాణిజ్యం, అంతరిక్ష పరిశోధనలతో పాటు కృత్రిమ మేధస్సు (ఏఐ), సెమీకండక్టర్లు, క్లీన్ ఎనర్జీ వంటి కీలక సాంకేతిక రంగాల్లో ఇరు దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుకు అడ్డుకట్ట వేస్తూ శాంతి, స్థిరత్వాన్ని కాపాడేందుకు భారత్, అమెరికా కలిసి పనిచేస్తున్నాయి. ఈ పరిణామాలు ఇరు దేశాల మధ్య పరస్పర డిజిటల్ , వ్యూహాత్మక విశ్వాసాన్ని మరింత బలోపేతం చేశాయి.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ వేగంగా ఎదుగుతున్న శక్తిగా నిలుస్తోంది. ఇక్కడి ప్రజాస్వామ్య వ్యవస్థ, పారదర్శక పాలన, భారీ మార్కెట్ వంటి అంశాలు అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచుతున్నాయి. ప్రముఖ అమెరికన్ టెక్నాలజీ సంస్థలు సైతం చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ భారత్‌లో తమ ఉత్పాదకతను, పెట్టుబడులను నిరంతరం పెంచుతున్నాయి.

ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నప్పటికీ.. ఒక దేశంపై ఉన్న నమ్మకాన్ని వ్యక్తిగత డిజిటల్ భద్రతతో పోల్చడం ద్వారా సదరు సెనేటర్ చెప్పిన సందేశం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. భారత్-అమెరికా సంబంధాలు మరింత బలపడుతున్న ప్రస్తుత తరుణంలో ఈ వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక నమ్మకానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి.