చిలుకూరు టెంపుల్ మీద నోరు పారేసుకున్న అమెరికా సెనేటర్
అవసరం ఉన్నా లేకున్నా భారతదేశం మీద నోరు పారేసుకునే తీరు అమెరికా అధినేత ట్రంప్ తో పాటు.. ఆ దేశ రాజకీయ నేతల్లో ఈ మధ్య పెరుగుతోంది.
By: Garuda Media | 15 May 2026 10:38 AM ISTఅవసరం ఉన్నా లేకున్నా భారతదేశం మీద నోరు పారేసుకునే తీరు అమెరికా అధినేత ట్రంప్ తో పాటు.. ఆ దేశ రాజకీయ నేతల్లో ఈ మధ్య పెరుగుతోంది. ఓర్వలేనితనం.. నిత్యం తమ కారణంగానే భారత్ బాగుపడుతుందన్న ఆసూయ.. ద్వేషాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా అమెరికా అధికారపార్టీ రిపబ్లికన్ సెనేటర్ ఎరిక్ ష్మిత్ ఈ జాబితాలో చేరారు. వీసా దేవుడిగా ప్రాచర్యం పొందిన చిలుకూరు బాలాజీ టెంపుల్ ను ప్రస్తావిస్తూ.. ఆ దేవాలయం ఫోటోను తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేయటమే కాదు.. వరుస పోస్టులతో తన నోటిదూలను ప్రదర్శించారు. ఈ ఆలయం మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన తీరుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
హెచ్ 1బీ, ఎల్1, ఎఫ్1.. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ లాంటి వీసా ప్రోగ్రాంలు అమెరికన్ మధ్యతరగతి ఉద్యోగ అవకాశాల్ని దెబ్బ తీస్తున్నట్లుగా ఆయన మండిపడ్డారు. ఈ వ్యవస్థ స్థానిక వేతనాల్ని తగ్గిస్తూ.. అమెరికన్ ఉద్యోగులను పక్కన పెట్టే గ్లోబల్ వీసా కార్టెల్ గా మారినట్లుగా నోటిదూలను ప్రదర్శించారు. ఇక్కడ కార్టిల్ అనే పదాన్ని మరింత సులువుగా అర్థం చేసుకోవటానికి.. పుష్ప సినిమాలో ఎర్రచందనం దుంగల్నిస్మగ్లింగ్ చేసే ముఠాను సిండికేట్ అని చెప్పుకోవటం కనిపిస్తుంది కదా. దానికి మరికాస్తా మెరుగ్గా చెప్పేందుకు వాడే పదంగా చెప్పాలి. మరింత తేలిగ్గా చెప్పాలంటే.. చట్టానికి భయపడుతూనే అక్రమ వ్యాపారాలు చేసే సమూహంగా దీన్ని చెప్పొచ్చు.
500 ఏళ్ల చరిత్ర ఉన్న పవిత్రమైన దేవాలయాన్ని.. భక్తుల నమ్మకాన్ని ఒక వీసా మాఫియా నెట్ వర్కుగా అభివర్ణించటం చూస్తే.. ఎరిక్ ష్మిత్ ఒళ్లు బలుపుతనం ఇట్టే అర్థమవుతుంది. స్థానిక ఉద్యోగాల్లో కోతలకు.. సదరు కంపెనీల నిర్ణయానికి భారతదేశాన్ని.. భారత ఐటీ నిపుణులను బాధ్యులుగా చేసి మాట్లాడటం చూస్తే..భారత్ మీద విద్వేషాన్ని మరింతగా పెంచేలా ఆయన పోస్టుల తీరు ఉందని చెప్పాలి. ఎక్స్ లో అతగాడు చేసిన పోస్టుల్లో ఆయన ఏయే అంశాల్ని పేర్కొన్నారన్న విషయానికి వస్తే.. మరింత సులువుగా అర్థం చేసుకోవటానికి కాస్తంత స్వేచ్ఛగా అనువాదం చేస్తే..
- హైదరాబాద్ లో వీసా కార్టెల్ కు సొంతంగా ఒక వీసా దేవాలయం ఉంది. అక్కడ యూఎస్ వర్క్ వీసాల కోసం ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. అమెరికన్ కార్మికులు ఇలాంటి వ్యవస్థతో పోటీ పడాల్సిన అవసరం లేదు. హెచ్ 1బీ, ఎల్ 1, ఎఫ్1 తో పాటు ఓపీటీ వంటి వీసా ప్రోగ్రామ్‌లు అమెరికా కార్మికులను ఉద్యోగాల నుండి తొలగిస్తున్నాయి.
- అమెరికాలోని కార్మికుల వేతనాలను తగ్గిస్తున్నాయి మరియు మన మధ్యతరగతి ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయి. ఈ వ్యవస్థలో మోసాలు, దుర్వినియోగం విపరీతంగా పెరిగిపోయాయి. అమెరికన్ కార్మికులు నష్టపోతున్నారు.ఇందులో గెలుస్తున్నది వీసా కార్టెల్ (మాఫియా లేదంటే సిండికేట్)
- ఈ వీసా టెంపుల్ (చిలుకూరు బాలాజీ ఆలయం) కు వేలాది మంది భారతీయులు అమెరికా వర్క్ వీసాల కోసం ప్రదిక్షిణలు చేస్తూ.. తమ పాస్ పోర్టులపై ఆశీర్వాదాలు పొందుతున్నారు. ఇంతలా లోపాలతో నిండిపోయి.. ఒక వ్యవస్థీక్రత సిండికేట్ గా మారిన వ్యవస్థతో అమెరికా కార్మికులు పోటీ పడాల్సిన అవసరం లేదు.
- ఈ మోసాల్ని అరికట్టాలి. ఈ నెట్ వర్కును మూసేయాలి. పెద్ద పెద్ద టెక్ కంపెనీలు వేలాది మంది అమెరికన్ కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించాయి. అదే సమయంలో అవే స్థానాల కోసం వేలాది మంది హెచ్ 1బీ వీసా అభ్యర్థనలను సమర్పించాయి. యూఎస్ కార్మిక శాఖ గణాంకాల ప్రకారం విదేశీ ఉద్యోగుల్లో 82 శాతం మందికి ఇక్కడి సగటు వేతనం కంటే తక్కువ జీతాలే ఇస్తున్నారు.
- అమెరికన్ల పన్నుల డబ్బుతో సబ్సిడీ పొందుతూ.. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ కోసం బిలియన్ల కొద్దీ డాలర్లు భారతదేశానికి తరలిపోతున్నాయి. కొంతమంది బిగ్ టెక్ కాంట్రాక్టర్లు బయటపెట్టిన వివరాల ప్రకారం.. భారతదేశంలోని వీసా దరఖాస్తుదారులు అమెరికా వీసా ఇంటర్వ్యూలో అడిగే అత్యంత రహస్యమైన ఇంటర్వ్యూ ప్రశ్నలను ఒకరికొకరు షేర్ చేసుకుంటూ లీక్ చేస్తున్నారు. ఇంతలా దుర్వినియోగమవుతున్న వీసా లోపాల్ని మనం వెంటనే అడ్డుకోవాలి. మన ప్రాధాన్యత ఎప్పుడూ అమెరికన్ కార్మికులకే ఉండాలి.
