భారత్ పై పాక్ గెలించిందట.. ఈ అమెరికా రిపోర్ట్ చూశారా మోదీ జీ?
భారత్ ఆపరేషన్ సిందూర్ లో విమానాలను కోల్పోయిందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నోటికొచ్చినట్లు వాగారు.
By: Tupaki Political Desk | 21 Nov 2025 3:16 PM ISTఅమెరికాకు ఎంతైనా పాకిస్థాన్ అంటే మొదటినుంచి అభిమానమే..! అది ఎంత దుర్మార్గపు దేశమైనా సరే, పాక్ అంటే అమెరికా ఒక ఆకు ఎక్కువే వేస్తుంది. బహుశా భారత్ గతంలో రష్యా (యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రష్యా- యూఎస్ఎస్ఆర్)తో సన్నిహితంగా ఉన్నందునే ఏమో... అమెరికా మనపట్ల అవసరం కొద్దీ అన్నట్లు ఉంటుంది. అయితే, సాఫ్ట్ వేర్ బూమ్, 25 ఏళ్ల కిందట నేరుగా ఉగ్రదాడుల (సెప్టెంబరు 11) బారిన పడడంతో దాని ఆలోచన కొంత మారింది. ఇప్పటికీ విధానపరంగా మాత్రం భారత్ కంటే పాకిస్థాన్ నే ఒకింత ఎక్కువగా సమర్థిస్తుంటుంది. ఇది అనేక సందర్భాల్లో రుజువైంది కూడా. తాజాగా ఆ దేశ సెనేట్ లో సమర్పించిన నివేదిక మరోసారి నిజం చేసింది. ఏప్రిల్ లో భారత్ లోని పెహల్గాంలో అమాయక పర్యటకులను పాక్ కు చెందిన ఉగ్రవాదులు దారుణంగా కాల్చిచంపారు. దీనికి ప్రతిగా మే నెలలో భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాక్ ఆక్రమిత కశ్మీర్ తో పాటు పాక్ లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. భారత దాడికి తట్టుకోలేక పాకిస్థాన్ బెంబేలెత్తింది. అసలే ఆర్థికంగా అధ్వాన పరిస్థితుల్లో ఉన్న పాక్.. భారత్ గనుక ఆపరేషన్ సిందూర్ ను తీవ్రం చేస్తే దివాళా తీసే పరిస్థితి. అందుకే కాళ్లబేరానికి వచ్చింది. వాస్తవ పరిస్థితి ఇది అయితే.. అమెరికా సెనేట్ లో సమర్పించిన నివేదిక మాత్రం పూర్తి భిన్నంగా ఉంది.
అసత్య ప్రచారం..
భారత్ ఆపరేషన్ సిందూర్ లో విమానాలను కోల్పోయిందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నోటికొచ్చినట్లు వాగారు. దీనిని భారత్ ఖండించింది కూడా. అయినా, మరోసారి అలాంటి తీరులోనే అమెరికా సెనేట్ లో నివేదిక ప్రవేశపెట్టారు. ఇందులో అసత్యాలు నివేదించింది. ఆపరేషన్ సిందూర్ కు పాకిస్థాన్ దీటుగా బదులిచ్చిందంటూ రాసుకొచ్చింది. నాలుగు రోజుల పాటు సాగిన ఆపరేషన్ సిందూర్ లో పాకిస్థాన్ సైన్యం విజయవంతం అయిందని పేర్కొంది.
చైనాకు ప్రయోజనం..
భారత్ -పాక్ మధ్య సంఘర్షణను చైనా అనుకూలంగా మార్చుకుందని అమెరికా తెలిపింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ కు ఆయుధాలను చైనా సమకూర్చిందనే కథనాలు వచ్చాయి. ఈ కోణంలోనే తమ బద్ధ శత్రువు చైనా ప్రస్తావనను తెచ్చి ఉంటుందని భావించవచ్చు. కాగా, భారత్ -పాక్ ఉద్రిక్తతలపై ట్రంప్ వ్యాఖ్యలు గతంలో తీవ్ర వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. వాటిని తానే నివారించానంటూ ట్రంప్ గొప్పలు పోయారు. భారత యుద్ధ విమానాలను పాకిస్థాన్ కూల్చివేసిందని కూడా తప్పుడు వ్యాఖ్యలు చేశారు. తాజాగా అమెరికా సెనేట్ లో ప్రవేశపెట్టిన నివేదిక కూడా ట్రంప్ ఆలోచనలకు దగ్గరగా ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ రిపోర్టుపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ మండిపడ్డారు. ఇది మోదీ ప్రభుత్వ దౌత్య వైఫల్యానికి నిదర్శనం అంటూ నిప్పులు చెరిగారు.
భారత్ ఏమని స్పందిస్తుందో..?
అమెరికా చట్ట సభలో ప్రవేశపెట్టిన నివేదిక అంటే దానికి తగిన విలువ ఉన్నట్లే. ఒక దేశ యుద్ధ విజయాన్ని తారుమారు చేస్తూ ఇచ్చిన ఈ నివేదిక ఎలా రూపొందించారు? అన్నది తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. కాగా, ఇప్పటికైతే భారత ప్రభుత్వం దీనిపై స్పందించలేదు. బహుశా ఇంకా పూర్తిస్థాయిలో పరిశీలనకు రాలేదేమో?
