నౌక సీజ్.. రష్యా సీరియస్.. అమెరికాతో యుద్ధం తప్పదా?
ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రం ఇప్పుడు ప్రపంచ శక్తుల మధ్య మరో హాట్‌స్పాట్‌గా మారుతోంది.
By: A.N.Kumar | 8 Jan 2026 9:54 AM ISTఉత్తర అట్లాంటిక్ మహా సముద్రం ఇప్పుడు ప్రపంచ శక్తుల మధ్య మరో హాట్‌స్పాట్‌గా మారుతోంది. రష్యా జెండాతో ప్రయాణిస్తున్న వెనెజువెలా చమురు నౌకను అమెరికా సీజ్ చేయడం.. ఆ ఆపరేషన్‌కు బ్రిటన్ సహకరించడం… ఈ రెండు చర్యలు కలిసి అమెరికా, రష్యా మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం అంటూ క్రెమ్లిన్ ఘాటుగా స్పందించగా నౌక రక్షణకు రష్యా ఏకంగాజలాంతర్గాములు, రక్షణ నౌకలను పంపేందుకు సిద్ధమవుతోందన్న సమాచారం పరిస్థితిని మరింత సీరియస్‌గా మార్చింది.
ఏం జరిగింది?
అమెరికా దక్షిణ కమాండ్, యూరోపియన్ కమాండ్ బుధవారం రష్యా జెండాతో వెళ్తున్న మ్యారినెరా (పాత పేరు బెల్లా-1) నౌకను ఐస్‌లాండ్ దక్షిణ తీరానికి సుమారు 190 మైళ్ల దూరంలో స్వాధీనం చేసుకున్నాయి. ఇదే సమయంలో ఏ దేశపు జెండా లేని మరో నౌక సోఫియాను కూడా సీజ్ చేశాయి. ఆపరేషన్‌లో అమెరికా మెరైన్లు హెలికాప్టర్ల ద్వారా నౌకపై దిగుతూ సిబ్బందిని అదుపులోకి తీసుకున్న దృశ్యాలు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యాయి. భారీగా యుద్ధవిమానాలు, హెలికాప్టర్లు రంగంలోకి దిగినట్లు సమాచారం.
ఆంక్షల నౌకే లక్ష్యమా?
మ్యారినెరా నౌకపై 2024లోనే అమెరికా ఆంక్షలు విధించింది. లెబనాన్‌లోని ఇరాన్ మద్దతున్న హెజ్‌బొల్లా మిలిటెంట్లకు ఆయుధాలు సరఫరా చేస్తోందని అప్పట్లో ఆరోపించింది. తాజాగా ఈ రెండు నౌకలు రష్యా–ఇరాన్–వెనెజువెలా నుంచి ఆసియా దేశాలకు చమురును తరలిస్తున్నాయని అమెరికా అంతర్గత భద్రతా శాఖ మంత్రి వెల్లడించారు. డిసెంబరులోనే ఈ నౌకను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా సన్నాహాలు చేసినట్లు తెలుస్తోంది. ప్రమాదాన్ని గ్రహించిన సిబ్బంది గుయానా జెండాను తొలగించి రష్యా జెండాను అమర్చారని సమాచారం.
రష్యా ఆగ్రహం
నౌక అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తోందని 1982 ఐరాస సముద్ర చట్టం ప్రకారం మరో దేశ నౌకను సీజ్ చేసే అధికారం ఎవరికీ లేదని రష్యా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. సిబ్బంది హక్కులను కాపాడాలని డిమాండ్ చేసింది. అమెరికాకు 4,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న నౌకను అమెరికా తీర రక్షణ దళాలు రోజులు తరబడి అనుసరిస్తున్నాయంటూ ఆరోపించింది.
మేం సహకరించామన్నా బ్రిటన్
ఈ ఆపరేషన్‌లో అమెరికాకు సహకరించామని బ్రిటన్ అధికారికంగా ప్రకటించింది. ఐస్‌లాండ్ ,గ్రీన్‌లాండ్ మధ్య నౌకను అడ్డుకోవడంలో ముందస్తు ప్రణాళికా సహాయం, నిఘా మద్దతు అందించామని తెలిపింది. ఇది అంతర్జాతీయ ఆంక్షలను అమలు చేసే ప్రయత్నాలకు నిదర్శనమని బ్రిటన్ రక్షణ మంత్రి వ్యాఖ్యానించారు.
యుద్ధ మేఘాలా?
ఒకవైపు అమెరికా–బ్రిటన్ ఆంక్షల అమలు పేరుతో ముందుకెళ్తుండగా.. మరోవైపు రష్యా సార్వభౌమ హక్కుల ఉల్లంఘన అంటూ ప్రతిస్పందిస్తోంది. జలాంతర్గాములు రంగంలోకి దిగితే… ఉత్తర అట్లాంటిక్‌లో చిన్న ఘటన పెద్ద సంఘర్షణగా మారుతుందా? అన్న ప్రశ్న ఇప్పుడు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. అంతర్జాతీయ దౌత్యం ఎంత వేగంగా జోక్యం చేసుకుంటుందోననే ఈ ఉద్రిక్తత భవితవ్యాన్ని నిర్ణయించనుంది.
