లీక్ షాక్.. పబ్లిక్ ప్రింటర్ వద్ద ట్రంప్ – పుతిన్ భేటీ రహస్య వివరాలు!
వివరాళ్లోకి వెళ్తే... అలాస్కా యాంకరేజ్ 'కెప్టెన్ కుక్' హోటల్ లో అమెరికా విదేశాంగశాఖకు చెందిన కీలక అధికారులు బస చేశారు.
By: Raja Ch | 17 Aug 2025 6:00 PM ISTఅమెరికా - రష్యా అధ్యక్షుల భేటీ తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ భేటీ ప్రధాన ఉద్దేశ్యం రష్యా - ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపడమే అయినా.. ఆ ఫలితం రాలేదు కానీ.. కొసరు విషయాలు మరిన్ని మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి! ఈ సందర్భంగా తెరపైకి వచ్చిన విషయం లీకు ఇచ్చిన షాకా.. లేక, అధికారుల నిర్లక్ష్యమా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.
అవును... అమెరికా - రష్యా అధ్యక్షుల భేటీ ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన వేళ.. అక్కడ జరిగిన ఓ సంఘటన మరింత హాట్ టాపిక్ గా మారింది. అదేమిటంటే... వీరి మీటింగ్ కు సంబంధించిన అత్యంత కీలక సమాచారం ఉన్న పత్రాలను హోటల్ లోనే వదిలేసి వెళ్లిపోయారు అమెరికా అధికారులు. ఈ విషయాలను అమెరికా మీడియా సంస్థ బహిర్గతం చేసింది.
వివరాళ్లోకి వెళ్తే... అలాస్కా యాంకరేజ్ 'కెప్టెన్ కుక్' హోటల్ లో అమెరికా విదేశాంగశాఖకు చెందిన కీలక అధికారులు బస చేశారు. అయితే... వీరు ఇక్కడ పబ్లిక్ ప్రింటర్ నుంచి కొన్ని కాగితాలను ప్రింట్ తీసుకొని, వాటిలోని ఎనిమిది పేజీలను అక్కడే వదిలేశారు. ఈ క్రమంలో ట్రంప్ - పుతిన్ భేటీ కంటే రెండు గంటల ముందే ఇవి అమెరికా మీడియా సంస్థ దృష్టికి వచ్చాయి.
ఈ పత్రాల్లో మీటింగ్ ల వివరాలు.. యాంకరేజీ బేస్ లో ఏ గదుల్లో ఎవరు ఉంటారనే వివరాలు.. ఎవరెవరి మధ్య ఎప్పుడు సమావేశాలు జరగనున్నాయి వంటివి ఉన్నాయి. వీటితోపాటు అమెరికా ప్రభుత్వంలోని కీలక అధికారులు, వ్యక్తుల ఫోన్ నెంబర్లు.. రష్యా ప్రభుత్వ అధికారుల వివరాలు స్పష్టంగా పేర్కొన్నారు!
ఇలా బయట ప్రపంచానికి ఏమాత్రం తెలియని రహస్య వివరాలతో పాటు... పుతిన్ కు ట్రంప్ గిఫ్ట్ గా ఇచ్చేందుకు 'అమెరికాన్ బాల్డ్ ఈగిల్ డెస్క్ స్టాట్యూ'ను కూడా సిద్ధం చేసినట్లు ఆ పత్రాల్లో ఉంది.
స్పందించిన వైట్ హౌస్!:
ఇంత కీలక విషయాలకు సంబంధించిన పత్రాలు పబ్లిక్ ప్రింటర్ వద్ద లభించాయనే విషయం తెరపైకి రావడంతో వైట్ హౌస్ స్పందించింది. ఈ సందర్భంగా ఈ వార్తలను వైట్ హౌస్ డిప్యూటి ప్రెస్ సెక్రటరీ అన్నా కెల్లీ కొట్టిపారేశారు. అది భద్రతా వైఫల్యం ఏమాత్రం కాదని.. ట్రంప్ కార్యవర్గంలో కీలక అంశాల లీకేజీలు పెద్ద సమస్యగా మారాయని తెలిపారు.
