అమెరికాలో మరోసారి విజృంభించిన తుపాకీ సంస్కృతి.. ఇడాహో రెస్టారెంట్‌లో కాల్పులు... ముగ్గురి మృతి!
శనివారం మధ్యాహ్నం వరకు ఆ రెస్టారెంట్ నవ్వులు, హడావుడి, ఆత్మీయ సంభాషణలతో హాయిగా సాగిపోతోంది.
By: A.N.Kumar | 2 Aug 2026 11:08 AM ISTశనివారం మధ్యాహ్నం వరకు ఆ రెస్టారెంట్ నవ్వులు, హడావుడి, ఆత్మీయ సంభాషణలతో హాయిగా సాగిపోతోంది. సెకన్ల వ్యవధిలో ఏం జరిగిందో తెలుసుకునేలోపే తుపాకీ గుళ్లు పేలాయి... నవ్వుల స్థానంలో చావు కేకలు, రక్తపు మడుగులు నిండిపోయాయి. అమెరికాలోని ఇడాహో రాష్ట్రం ట్విన్ ఫాల్స్ నగరంలో విధి ఆడిన ఈ విషాద నాటకం అనేక కుటుంబాల జీవితాల్లో ఎప్పటికీ పూడ్చలేని శోకాన్ని నింపింది. అనుకోకుండా వచ్చిపడ్డ ఆ ముష్కరుడి బుల్లెట్లకు అమాయకుల ఊపిరులు గాల్లో కలిసిపోగా మరెందరో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఒక్క సంఘటన ఎంతమంది కలలను కల్లలు చేసిందో తలుచుకుంటేనే గుండె పిండేస్తోంది.
అమెరికాలో మరోసారి తుపాకి సంస్కృతి ప్రాణాలను బలిగొంది. ఇదాహో రాష్ట్రంలోని ట్విన్ ఫాల్స్ నగరంలో ఉన్న ప్రముఖ ఇన్-ఎన్-అవుట్ రెస్టారెంట్ వద్ద శనివారం మధ్యాహ్నం జరిగిన కాల్పుల ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో కనీసం ముగ్గురు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని సెంట్ లూక్స్ మ్యాజిక్ వ్యాలీ మెడికల్ సెంటర్ సహా సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
స్థానిక కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో బ్లూ లేక్స్ బులివార్డ్ నార్త్‌లోని రద్దీగా ఉండే వాణిజ్య ప్రాంతంలో ఒక్కసారిగా కాల్పులు ప్రారంభమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అత్యవసర వైద్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భద్రతా కారణాల దృష్ట్యా పరిసర ప్రాంతాలను పూర్తిగా ఖాళీ చేయించి కొన్ని రహదారులను తాత్కాలికంగా మూసివేశారు.
ట్విన్ ఫాల్స్ పోలీస్ చీఫ్ మాథ్యూ హిక్స్ మీడియాతో మాట్లాడుతూ కాల్పులకు పాల్పడిన అనుమానితుడు కూడా మరణించినట్లు ధ్రువీకరించారు. అయితే అతను ఎలా మరణించాడన్న విషయాన్ని అధికారులు వెల్లడించలేదు. నిందితుడి గుర్తింపు, కాల్పుల వెనుక ఉన్న ఉద్దేశం, బాధితులతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ప్రస్తుతం ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని పోలీసులు స్పష్టం చేశారు.
ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాల్పులు ప్రారంభమయ్యే ముందు ఒక వ్యక్తి చేతిలో లాంగ్ గన్‌తో రెస్టారెంట్ పార్కింగ్ ప్రాంతంలో తిరుగుతున్న దృశ్యాలు కొన్ని వీడియోల్లో కనిపిస్తున్నాయి. మరోవైపు కాల్పులు మొదలవగానే భయంతో ప్రజలు రెస్టారెంట్ నుంచి పరుగులు తీస్తున్న దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి.
ట్విన్ ఫాల్స్ నగరం ఇదాహో దక్షిణ ప్రాంతంలో ఉన్న ప్రముఖ పట్టణం. సుమారు 56 వేల జనాభా కలిగిన ఈ నగరం సాల్ట్ లేక్ సిటీకి వాయువ్య దిశలో సుమారు 290 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
ఇటీవలి కాలంలో అమెరికాలో సామూహిక కాల్పుల ఘటనలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది మాత్రమే దేశవ్యాప్తంగా 300కు పైగా మాస్ షూటింగ్ ఘటనలు నమోదైనట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ ఘటనల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా మరెందరో తీవ్ర గాయాల పాలయ్యారు. తాజా ఇదాహో ఘటనతో అమెరికాలో తుపాకి నియంత్రణ చట్టాలపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు సేకరిస్తుండగా మృతుల వివరాలు.. కాల్పులకు దారితీసిన కారణాలపై త్వరలో మరింత సమాచారం వెల్లడయ్యే అవకాశం ఉంది.
