Begin typing your search above and press return to search.

హనుమంతుడు దేవుడు కాదన్న రిపబ్లికన్ లీడర్.. దుమారం

టెక్సాస్ రిపబ్లికన్ పార్టీకి చెందిన అలెగ్జాండర్ డంకన్, తన సోషల్ మీడియాలో ఈ హనుమాన్ విగ్రహం గురించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

By:  A.N.Kumar   |   23 Sept 2025 11:00 PM IST
హనుమంతుడు దేవుడు కాదన్న రిపబ్లికన్ లీడర్.. దుమారం
X

అమెరికాలో టెక్సాస్ రాష్ట్రం, షుగర్‌ల్యాండ్‌లోని అష్టలక్ష్మి ఆలయంలో ఇటీవల ప్రతిష్టించిన 90 అడుగుల హనుమాన్ విగ్రహంపై రిపబ్లికన్ పార్టీ నేత అలెగ్జాండర్ డంకన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. "స్టాచ్యూ ఆఫ్ యూనియన్" పేరుతో పిలవబడే ఈ విగ్రహం, ఉత్తర అమెరికాలో ఉన్న హిందూ దేవుళ్ల విగ్రహాల్లో అతి పొడవైనది. 2024లో త్రిదండి చినజీయర్ స్వామి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

*రిపబ్లికన్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

టెక్సాస్ రిపబ్లికన్ పార్టీకి చెందిన అలెగ్జాండర్ డంకన్, తన సోషల్ మీడియాలో ఈ హనుమాన్ విగ్రహం గురించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన హనుమంతుడిని "కల్పిత హిందూ దేవుడు" అని అభివర్ణించారు. అంతేకాకుండా క్రైస్తవ దేశమైన అమెరికాలో ఇలాంటి విగ్రహం ఎందుకు ప్రతిష్టించారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా బైబిల్‌లోని ఒక వాక్యాన్ని ఉదహరిస్తూ, "ఆకాశంలో గానీ, భూమిపై గానీ, స్వర్గంలో గానీ, సముద్రంలో గానీ ఏ విగ్రహాన్ని పూజించకూడదు" అని పేర్కొన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వేగంగా వ్యాప్తి చెందాయి.

*హిందూ సంస్థల, నెటిజన్ల విమర్శలు

డంకన్ వ్యాఖ్యలపై హిందూ అమెరికన్ ఫౌండేషన్ (HAF) తీవ్రంగా స్పందించింది. "ఈ వ్యాఖ్యలు హిందూ వ్యతిరేక ద్వేషాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఇవి డంకన్ పార్టీకి చెందిన మార్గదర్శకాలకు కూడా విరుద్ధంగా ఉన్నాయి" అని HAF ఒక పోస్ట్‌లో స్పష్టం చేసింది. అనేక మంది నెటిజన్లు కూడా డంకన్‌పై విమర్శలు కురిపించారు. అమెరికా రాజ్యాంగం ప్రజలకు తమ మతాన్ని స్వేచ్ఛగా పాటించే హక్కును కల్పించిందని గుర్తు చేశారు. కొంతమంది నెటిజన్లు, "మీరు హిందువు కాకపోయినా, హిందూ మతానికి సంబంధించిన ప్రాచీన గ్రంథాలను గౌరవించడం, వాటి గురించి తెలుసుకోవడం జ్ఞానవంతమైన పని" అని సూచించారు.

విగ్రహం నిర్మాణ వివరాలు

గతేడాది ఆగస్టులో ఈ హనుమాన్ విగ్రహ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. విగ్రహ భాగాలు చైనాలో తయారయ్యాయి. వాటిని టెక్సాస్‌కు రవాణా చేసి, అక్కడ వాటిని అసెంబుల్ చేసి ప్రతిష్టించారు. డంకన్ చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా హనుమాన్ విగ్రహం, మత స్వేచ్ఛకు సంబంధించిన చర్చ అటు అమెరికాలో, ఇటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.