H-1B నుంచి గ్రీన్ కార్డు దిశగా వెళ్తున్న భారతీయులకు 'పబ్లిక్ ఛార్జ్' సెగ!
ఈ నిబంధనల మార్పును వ్యతిరేకిస్తూ 110 మంది కాంగ్రెస్ సభ్యులు, 17 మంది సెనేటర్లు కలిసి డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ‘డీహెచ్ఎస్’కు ఘాటైన లేఖ రాశారు.
By: A.N.Kumar | 25 Dec 2025 12:07 AM ISTఅమెరికాలో స్థిరపడాలనే కలలతో ఉన్న వలసదారులకు మళ్లీ కష్టకాలం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన వివాదాస్పద ‘పబ్లిక్ చార్జ్ నిబంధనలను మళ్లీ తెరపైకి తేవడంపై అమెరికా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ మార్పులు అమల్లోకి వస్తే హెచ్1బీ వీసాపై ఉంటూ గ్రీన్ కార్డ్ కోసం దశాబ్ధాలుగా వేచిచూస్తున్న భారతీయ వృత్తినిపుణులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.
ఎంపీల ఆందోళన.. డీహెచ్ఎస్ కు భారీ లేఖ
ఈ నిబంధనల మార్పును వ్యతిరేకిస్తూ 110 మంది కాంగ్రెస్ సభ్యులు, 17 మంది సెనేటర్లు కలిసి డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ‘డీహెచ్ఎస్’కు ఘాటైన లేఖ రాశారు. 2022లో రూపొందించిన సరళమైన పబ్లిక్ ఛార్జ్ నిబంధనలే కొనసాగించాలని.. కొత్త ప్రతిపాదనలను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.
అసలేమిటీ పబ్లిక్ ఛార్జ్ ముప్పు?
సాధారణంగా అమెరికా ప్రభుత్వం ఇఛ్చే సామాజిక ప్రయోజనాలను పొందే వలసదారులు భవిష్యత్తులో ప్రభుత్వానికి భారం అవుతారని భావిస్తే.. వారి గ్రీన్ కార్డ్ దరఖాస్తులను తిరస్కరించే అధికారం ఈ నిబంధన కల్పిస్తుంది. కొత్త ప్రతిపాదనల్లో స్పష్టత లేకపోవడం వల్ల వీసా అధికారులకు విచక్షణారహితంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. నిబంధనలు క్లిష్టంగా మారితే చట్టబద్ధంగా అర్హత ఉన్నప్పటికీ ఎక్కడ గ్రీన్ కార్డ్ రిజెక్ట్ అవుతుందో అన్న భయంతో వలసదారులు కనీస సౌకర్యాలను కూడా వదులుకోవాల్సి వస్తుంది.
భారతీయులపై ప్రభావం ఎందుకు ఎక్కువ?
అమెరికాలో ఉద్యోగాధారిత గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారిలో భారతీయులే అత్యధికం. గ్రీన్ కార్డ్ బ్యాక్ లాగ్ వల్ల భారతీయులు 10 నుంచి 15 ఏళ్ల పాటు హెచ్1బీ వీసాలపైనే ఉండాల్సి వస్తోంది. ఈ సుధీర్ఘకాలంలో అమెరికాలో పుట్టిన తమ పిల్లల కోసం పోషకాహార పథకాలు (డబ్ల్యూఐసీ) లేదా ఆరోగ్య బీమా (సీహెచ్ఐపీ) వంటివి వాడాల్సి వస్తే అది భవిష్యత్తులో గ్రీన్ కార్డుకు అడ్డంకిగా మారుతుందేమోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
బలహీన వర్గాలకు అన్యాయం
కేవలం ఉద్యోగులే కాకుండా గృహహింస బాధితులు, శరణార్థులు... అనాథ పిల్లలు ఈ నిబంధనల వల్ల తీవ్రంగా నష్టపోతారని ఎంపీలు హెచ్చరించారు. మానవతా దృక్పథంతో ఇచ్చే సాయాన్ని కూడా ‘పబ్లిక్ చార్జ్’ కింద పరిగణించడం వల్ల అమెరికా ప్రాథమిక విలువలకే భంగం కలుగుతుందని వారు అభిప్రాయపడ్డారు.
పబ్లిక్ చార్జ్ నిబంధనల్లో మార్పులు చేస్తే అది కేవలం వలసదారుల సమస్యగానే మిగిలిపోదు. ప్రజలు వైద్య సహాయం తీసుకోకపోవడం వల్ల ప్రజారోగ్యం దెబ్బతినడమే కాకుండా అత్యవసర చికిత్సల కోసం ప్రభుత్వాలపై ఆర్థిక భారం మరింత పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
