Begin typing your search above and press return to search.

ఓపీటీపై $100,000 ఫీజు.. విదేశీ విద్యార్థులపై ట్రంప్ చావుదెబ్బ

అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించి అక్కడే స్థిరపడాలని భావిస్తున్న అంతర్జాతీయ విద్యార్థులకు ఊహించని వార్త తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

By:  A.N.Kumar   |   14 Sept 2026 10:28 PM IST
ఓపీటీపై $100,000 ఫీజు.. విదేశీ విద్యార్థులపై ట్రంప్ చావుదెబ్బ
X

అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించి అక్కడే స్థిరపడాలని భావిస్తున్న అంతర్జాతీయ విద్యార్థులకు ఊహించని వార్త తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులపై ఏకంగా $100,000 (సుమారు రూ. 83 లక్షలు) రుసుము విధించే ప్రతిపాదనపై అమెరికాలో ప్రస్తుతం తీవ్రస్థాయిలో చర్చ నడుస్తోంది. ఈ ప్రతిపాదిత నిబంధన అమలులోకి వస్తే అత్యధిక సంఖ్యలో ఉన్న భారతీయ విద్యార్థులపైనే దీని ప్రభావం తీవ్రంగా పడనుంది.

అమెరికాలో ఎఫ్-1 వీసాపై చదువుకునే అంతర్జాతీయ విద్యార్థులకు తమ కోర్సు పూర్తయిన తర్వాత, ఆయా రంగాలలో తాత్కాలికంగా పనిచేసేందుకు ఓపీటీ అవకాశం కల్పిస్తుంది. విదేశీ విద్యార్థులు అమెరికాను తమ విద్యా గమ్యస్థానంగా ఎంచుకోవడానికి ఈ ప్రాక్టికల్ శిక్షణే ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలుస్తోంది. చదువు పూర్తయిన తర్వాత అమెరికాలో పని అనుభవం పొందడానికి ఆపై హెచ్1బీ వర్క్ వీసా పొందేందుకు ఓపీటీ ప్రధాన మార్గంగా ఉపయోగపడుతుంది. ఇప్పటికే భారీగా ట్యూషన్ ఫీజులు, జీవన వ్యయాలు భరిస్తున్న విద్యార్థులకు ఈ అదనపు రూ. 83 లక్షల ఫీజు భారం మోయలేని దెబ్బగా మారే ప్రమాదం ఉంది.

ముఖ్యంగా అమెరికాలో కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్, డేటా సైన్స్ వంటి స్టెమ్ కోర్సులు చేసే అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయులదే అగ్రస్థానం. కోర్సు పూర్తయ్యాక ఉద్యోగ అనుభవం సంపాదించి చదువు కోసం చేసిన రుణాలను తీర్చుకోవాలనుకునే నిరుపేద, మధ్యతరగతి ప్రతిభావంతులకు ఈ నిబంధన ఓపీటీని అందనంత దూరంలో ఉంచుతుంది. ఫలితంగా అమెరికాలో ఉన్నత విద్య వైపు భారతీయులు మొగ్గు చూపడం గణనీయంగా తగ్గే అవకాశాలున్నాయి.

ఈ ప్రతిపాదన ప్రభావం కేవలం విద్యార్థులకే కాక అమెరికాలోని విద్యా సంస్థలకు, టెక్ రంగానికి కూడా భారీ నష్టం కలిగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గితే యూనివర్సిటీల ట్యూషన్ ఫీజుల ద్వారా వచ్చే ఆదాయం క్షీణిస్తుంది. అదే సమయంలో టెక్నాలజీ, రీసెర్చ్ రంగాల్లో ఇప్పటికే అర్హులైన ఉద్యోగుల కొరత ఉంది. అంతర్జాతీయ ప్రతిభను దూరం చేయడం వల్ల అమెరికన్ కంపెనీల పోటీతత్వం కూడా దెబ్బతింటుంది. స్థానిక ఉద్యోగులకు రక్షణ కల్పించే ఉద్దేశంతో తెచ్చే 'అమెరికా ఫస్ట్' కఠిన నిబంధనలు దీర్ఘకాలంలో అమెరికా విద్యా రంగానికే చేటు చేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే ఈ $100,000 ఫీజు నిబంధన ఇంకా ప్రతిపాదనా దశలోనే ఉంది. ఇది తుది రూపంలోకి ఎలా వస్తుంది? ఏయే కేటగిరీలకు వర్తిస్తుంది లేదా ఏమైనా మినహాయింపులు ఉంటాయా అనే అంశాలపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. అయినప్పటికీ ఇప్పటికే వీసా ప్రాసెసింగ్, సీపీటీ, హెచ్1బీ వీసాలపై అనేక అనిశ్చితులు ఎదుర్కొంటున్న విద్యార్థుల భవిష్యత్తు ప్రణాళికలను ఈ వార్త మరింత సంక్లిష్టంలోకి నెట్టివేసింది.