Begin typing your search above and press return to search.

యూఎస్ లో కూలిన బిజినెస్ జెట్.. ఈ ఏడాదిలో ఇదెన్నో ప్రమాదం?

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం స్టేట్స్ విల్లే రీజనల్ విమానాశ్రయంలో సెసనా సి550 జెట్ ల్యాండ్ అయ్యే సమయంలో కుప్పకూలింది. దీంతో.. పెద్దఎత్తున మంటలు చెలరేగాయి.

By:  Garuda Media   |   19 Dec 2025 10:06 AM IST
యూఎస్ లో కూలిన బిజినెస్ జెట్.. ఈ ఏడాదిలో ఇదెన్నో ప్రమాదం?
X

ప్రపంచంలోనే ప్రైవేట్ జెట్ లను విపరీతంగా వినియోగించే దేశాల్లో ఎవరికి అందనంత దూరంలో ఉంది అగ్రరాజ్యం అమెరికా. పేరుకు తగ్గట్లే.. అగ్రరాజ్యం అమెరికా ప్రైవేట్ జెట్ వినియోగం.. దాని సంఖ్య చూసిప్పుడు.. రెండో స్థానంలో ఉన్న దేశాన్ని చూసినప్పుడు అమెరికా అధిక్యత కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. తాజాగా అమెరికాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఒక ప్రైవేట్ జెట్ కూలింది.

ఈ విషాద ఘటనలో నలుగురు మరణించారు. ఈ దుర్ఘటన నార్త్ కరోలినాలో చోటు చేసుకుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం స్టేట్స్ విల్లే రీజనల్ విమానాశ్రయంలో సెసనా సి550 జెట్ ల్యాండ్ అయ్యే సమయంలో కుప్పకూలింది. దీంతో.. పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఉదంతంలో నలుగురు మరణించినట్లుగా చెబుతున్నప్పటికీ.. వారికి సంబంధించిన వివరాలు బయటకు రాలేదు. ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మీదా అస్పష్టత నెలకొని ఉంది.

ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో కొద్దిపాటి వర్షం పడినట్లుగా తెలుస్తోంది. ప్రమాద ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ చూసినప్పుడు కొద్దిపాటి వర్షం పడినట్లుగా కనిపిస్తోంది. మూడు రోజుల క్రితం మెక్సికోలోనూ ఒక ప్రైవేట్ జెట్ కూలిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతంలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. మెక్సికో పసిఫిక్ తీరంలోని అకాపుల్కో నుంచి బయలుదేరిన ప్రైవేట్ జెట్.. సాంకేతిక సమస్యతో అత్యవసర ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఘోర ప్రమాదానికి గురైంది.

టోలుకా ఎయిర్ పోర్టుకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇండస్ట్రియల్ ప్రాంతంలో అత్యవసర ల్యాండింగ్ లో భాగంగా ఒక ఫుట్ బాల్ గ్రౌండ్ లో ల్యాండ్ చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఒక ఫ్యాక్టరీ పైకప్పును ప్రైవేట్ జెట్ ఢీకొనటంతో భారీగా మంటలు చెలరేగి.. ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ జెట్ లో ఉన్న పది మంది సజీవ దహనం కాగా.. ఈ ప్రమాదం నేపథ్యంలో పరిసర ప్రాంతాల నుంచి 130 మందిని తరలించటం గమనార్హం.

ఈ ఏడాదిలో విమాన ప్రమాదాలు ఎక్కువగా జరిగినట్లుగా అనిపించటం తెలిసిందే. ప్రైవేట్ జెట్లు ఎక్కువగా కూలిన భావనలో నిజం లేదని చెబుతున్నారు. కాకుంటే మీడియా.. సోషల్ మీడియా విస్త్రతి నేపథ్యంలో అలాంటి భావనకు అవకాశం ఏర్పడినట్లుగా చెప్పాలి. అమెరికాలో ఈ ఏడాది మొత్తం మూడు ప్రైవేట్ జెట్ లు కూలినట్లుగా చెప్పాలి. విమాన ప్రమాదాల్లో పెద్ద ప్యాసింజర్ విమానాల కంటే ప్రైవేట్ జెట్ల ప్రమాదాలు ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి. వీటికి కారణాలేమిటన్న అంశాన్ని ఆరా తీస్తే.. పైలట్ అనుభవంతో పాటు వాతావరణం.. నిర్వాహణలో దొర్లే తప్పులు ప్రమాదానికి కారణాలుగా చెబుతుంటారు.