బానిసల పిల్లలకే.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
జనవరి 2025లో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ట్రంప్ జన్మతః పౌరసత్వంపై ఓ కార్యనిర్వాహక ఉత్తర్వును జారీ చేసిన సంగతి తెలిసిందే.
By: Raja Ch | 10 Dec 2025 11:01 AM ISTజనవరి 2025లో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ట్రంప్ జన్మతః పౌరసత్వంపై ఓ కార్యనిర్వాహక ఉత్తర్వును జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... అక్రమంగా ఇక్కడికి వలస వచ్చిన వారి, తాత్కాలికంగా ఇక్కడకు వచ్చే సందర్శకులకు ఇద్దరికీ అమెరికాలో జన్మించిన పిల్లలకు పౌరసత్వ గుర్తింపు తొలగించారు. ఈ నిర్ణయం సంచలనంగా మారింది.
ఈ నేపథ్యంలో పలు సమాఖ్య కోర్టులు ఈ ఉత్తర్వును తాత్కాలికంగా నిరోధించాయి. ఇదే సమయంలో... ఫెడరల్ డిస్ట్రిక్ కోర్టులకు కార్యనిర్వాహక ఉత్తర్వు అమలును నిరోధించే విస్తృత అధికారం లేదని తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 5న అమెరికా అత్యున్నత న్యాయస్థానం అప్పీల్ ను స్వీకరించి, వివాదాన్ని నేరుగా పరిష్కరించాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... జన్మతః పౌరసత్వంపై చాలా కాలంగా నలుగుతున్న వివాదన్ని సమీక్షించడానికి సుప్రీంకోర్టు అంగీకరించిన కొన్ని రోజుల తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... బర్త్ రైట్ సిటిజన్ షిప్ అనేది ప్రధానంగా బానిసల పిల్లలకు ఉద్దేశించబడిందే కానీ, ధనిక వలసదారులు తమ మొత్తం కుటుంబాన్ని అమెరికా పౌరులుగా మార్చేందుకు కాదని తెలిపారు.
ఇదే సమయంలో.. సుప్రీంకోర్టులో తన పాలన ఈ కేసును ఓడిపోతే అది వినాశకరమైనది అని అన్నారు. ఎందుకంటే.. ఈ కేసు బానిసల పిల్లల కోసం ఉద్దేశించబడిందని.. ఈ కేసు వేరే దేశాల నుంచి మన దేశలోకి అడుగుపెట్టడానికి, అనంతరం అకస్మాత్తుగా వారి కుటుంబం మొత్తం యునైటెడ్ స్టేట్స్ పౌరులుగా మార్చడానికి ఉద్దేశించబడలేదని నొక్కి చెప్పారు.
ఈ సందర్భంగా... ప్రజలు ఇప్పుడు దానిని అర్ధం చేసుకుంటున్నారని.. ఇప్పటికే దాన్ని వివరించడం జరిగిన నేపథ్యంలో కోర్టు కూడా దానిని అర్ధం చేసుకుంటుందని నేను భావిస్తున్నానని.. ఒక వేళ ఈ కేసులో ఓడిపోతే అది వినాశకరమైన నిర్ణయం అవుతుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. దీంతో... అమెరికాలో బర్త్ రైట్ సిటిజన్ షిప్ పై సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.
