జెలెస్కీ మీద పుతిన్ అదే పని చేస్తే ?
ఈ రోజున అగ్ర రాజ్యం అమెరికా ప్రపంచానికి సరికొత్త నీతిని బోధించింది. అదేంటి అంటే బలవంతుడిదే రాజ్యం అని.
By: Satya P | 4 Jan 2026 1:14 PM ISTఈ రోజున అగ్ర రాజ్యం అమెరికా ప్రపంచానికి సరికొత్త నీతిని బోధించింది. అదేంటి అంటే బలవంతుడిదే రాజ్యం అని. ఎవడి దగ్గర గట్టిగా బలం బలగం ఉంటుందో వాడు ఏమైనా చేయవచ్చు అని. రాత్రికి రాత్రి సైన్యాన్ని మోహరించి బాంబులు పేల్చి శతృవు అనుకున్న వాడిని లొంగదీసుకోవచ్చు. ఏకంగా వారి బెడ్ రూం దాకా వెళ్ళి మరీ కిడ్నాప్ చేసేయవచ్చు. భార్యతో సహా వెంట తెచ్చుకోవచ్చు. ఇదే నయా యుద్ధ నీతి. ఇదే ఇపుడు చెల్లుబాటు అని అగ్ర రాజ్యం ప్రపంచ పోలీసుగా భావించే పెద్దన చెప్పే నీతి సూత్రం ఇదే అంటున్నారు.
చేష్టలుడిగిన తీరు :
ఇదిలా ఉంటే ఈ ప్రపంచంలో చాలా కాలంగా అనేక దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధాలు జరుగుతున్నాయి. ఇజ్రాయిల్ ఇరాక్ మధ్య యుద్ధం చూసినా రష్యా ఉక్రెయిన్ యుద్ధం చూసినా అలాగే అనేక దేశాల మధ్య యుద్ధ సన్నాహాలు కానీ ప్రచ్ఛన్న యుద్ధాలు కానీ చూసినా అంతర్జాతీయ సంస్థలు ఏమి చేస్తున్నాయన్న సందేహాలు రాక మానదు, ఐక్య రాజ్యసమితి అని అంతర్జాతీయ సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. మరి శాంతి కోసం పనిచేయాలి, దేశాల మధ్యన ఘర్షణలు చోటు చేసుకోకుండా ముందే నివారించాలి. కానీ అలాంటిది ఏదీ జరగడం లేదని అంటున్నారు. 1945 తరువాత అప్పటిదాకా ఉన్న నానా జాతి సమితి ప్లేస్ లో ఐక్య రాజ్య సమితిని ఏర్పాటు చేశారు. కానీ పెద్దన్నల ఆధిపత్య పోకడలే అంతర్జాతీయంగా ఎక్కడ చూసినా యధేచ్చగా సాగిపోతున్నాయి. అదే సమయంలో ఘర్షణలు నివారించే సన్నివేశాలు కనిపించడం లేదు. ఉక్రెయిన్ రష్యాల మధ్య గత అయిదేళ్ళుగా సాగుతున్న యుద్ధమే ఇందుకు ఉదాహరణ అని చెబుతారు.
జెలెస్కీ ఇలా తెస్తే :
యుద్ధం సుదీర్ఘంగా జరుగుతున్నా జెలెస్కీ మీద రష్యా అయితే ఇంతవరకూ బల ప్రయోగం చేయలేదు. వెనెజులా అధ్యక్షుడిని అమెరికా బంధీ చేసిన మాదిరిగా రష్యా అధినేత పుతిని చేస్తే ఏమవుతుంది అన్న కొత్త చర్చ మొదలైంది. అంతే కాదు బలవంతుడు ఎవరైనా ఎక్కడైనా ఇలా దేశాల మీద దాడులు చేసి అక్కడ పాలకులను బంధించి తమ వెంట తీసుకుని వచ్చే విధానం వల్ల అంతర్జాతీయ చట్టాలు నింబంధనలు ఇబ్బందుల్లో పడతాయి అని అంటున్నారు.
ఒవైసీ సలహానా :
ఇదిలా ఉంటే అమెరికా పెద్దన్న చేసినట్లుగా మోడీ కూడా పాక్ మీదకు వెళ్ళి ముంబై దాడుల సూత్రధారిని పట్టి తీసుకుని రావచ్చు కదా అని మజ్లీస్ అధినేత ఒవైసీ సలహా లాంటి సూచన చేశారు. మరి ఆయన ఏ ఉద్దేశ్యంతో అన్నారో ఏమో తెలియదు. మరో వైపు ఇలా దేశాల మీద పడిపోయి ఈ విధంగా కూడా చేయాలీ అనుకుంటే అపుడు అగ్ర రాజ్యాలే మిగులుతాయి, ఏ దేశాధినేత కూ రక్షణ ఉండదు, ఏ దేశమూ శాంతిగా ఉండదు, అక్కడ ప్రజలు సైతం ప్రాణాలు అర చేతులలో పెట్టుకోవాల్సిందే అంటున్నారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం మీద అయితే మిశ్రమ స్పందన వస్తోంది. అమెరికా చేయడం కరెక్ట్ అన్న దేశాలు కొన్ని ఉంటే కాదు అన్నవి మరి కొన్ని దేశాలు. మరి ఈ అంతర్జాతీయ న్యాయంలో ఏది నిజం ఏది తప్పు అన్నది కాలం కూడా అంచనా వేసి జవాబు చెప్పగలుతూందా అన్నదే చూడాల్సి ఉంది.
