Begin typing your search above and press return to search.

భారత్ మాత్రమే కాదు మరో 25 దేశాలు పెద్దన్నకు పోస్టల్ సర్వీసులు బంద్

భారత్ లాంటి నమ్మకస్తుడైన.. విశ్వసనీయ భాగస్వామితో పంచాయితీ పెట్టుకున్న ఆయన.. ఎడా పెడా అన్నట్లుగా నిర్ణయాలు తీసుకోవటం తెలిసిందే.

By:  Garuda Media   |   27 Aug 2025 7:00 PM IST
భారత్ మాత్రమే కాదు మరో 25 దేశాలు పెద్దన్నకు పోస్టల్ సర్వీసులు బంద్
X

ఏదో చేద్దామనుకుంటే మరేదో అయిందన్నట్లుగా ఉంది అమెరికా ప్రస్తుత పరిస్థితి. అమెరికా దేశ చరిత్రలో అత్యంత వివాదాస్పద నిర్ణయాలు.. విదేశాంగ విధానం విషయంలో కలగాపులగం చేస్తూ.. ఇష్టారాజ్యంగా వ్యవహరించటమే కాదు.. ఏ నిమిషాన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న అనిశ్చితిని ప్రపంచానికి కలిగించిన అమెరికా అధినేతగా ట్రంప్ నిలుస్తారు. రెండోసారి అమెరికాకు అధ్యక్షుడైన ఆయన తీరుతో యావత్ ప్రపంచం ఆగమాగమవుతోంది.

భారత్ లాంటి నమ్మకస్తుడైన.. విశ్వసనీయ భాగస్వామితో పంచాయితీ పెట్టుకున్న ఆయన.. ఎడా పెడా అన్నట్లుగా నిర్ణయాలు తీసుకోవటం తెలిసిందే. చిన్న ప్యాకేజీలపై పన్ను మినహాయింపులను ట్రంప్ యంత్రాంగం ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఇప్పటికే భారత్ తన పోస్టల్ సర్వీసులను నిలిపి వేయటం తెలిసిందే. తాజాగా భారత్ తరహాలో మరో 24 దేశాలు ఇదే బాటను పట్టాయి.

ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితిలోని యూనివర్సల్ పోస్టల్ యూనియన్ వెల్లడించింది. ఐక్యరాజ్యసమితిలోని సభ్య దేశాలకు సంబంధించిన పోస్టల్ సేవలకు సంబంధించిన సహకారం కోసం ఈ సంస్థను స్విట్జర్లాండ్ కేంద్రంగా ఏర్పాటు చేయటం తెలిసిందే. పోస్టల్ ప్యాకేజీలపై అమెరికా పన్ను మినహాయింపుల్ని వెనక్కి తీసుకున్న నేపథ్యంలో భారత్ తో సహా పాతిక దేశాలు అగ్రరాజ్యానికి పోస్టల్ సేవల్ని బంద్ చేసినట్లుగా యూనివర్సల్ పోస్టల్ యూనియన్ వెల్లడించింది.

ఈ నిర్ణయంపై అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక లేఖ రాసినట్లుగా ఈ సంస్థ పేర్కొంది. అమెరికాకు పోస్టల్ సేవల్ని బంద్ చేసిన దేశాల జాబితాను అధికారికంగా వెల్లడించనప్పటికీ.. భారత్ తోపాటు ఫ్రాన్స్.. జర్మనీ..ఆస్ట్రేలియా.. నార్వే.. స్విట్జర్లాండ్ తదితర దేశాలు మాత్రం ఇప్పటికే ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించాయి.

ట్రంప్ సర్కారు తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం అమెరికాకువ వెళ్లే అన్ని పోస్టల్ సర్వీసులకు వాటి విలువతో సంబంధం లేకుండా సుంకాలకు లోబడి ఉంటాయి. ఆగస్టు 29 నుంచి ఈ కొత్త సుంకాల షాక్ తగలనుంది. దీనికి ముందే.. 25 దేశాలు అమెరికాకు పోస్టల్ సేవల్ని బంద్ చేస్తూ నిర్ణయం తీసుకోవటం గమనార్హం.