Begin typing your search above and press return to search.

ఔట్‌సోర్సింగ్‌పై టారిఫ్‌లు: ఇండియన్ ఐటీపై అమెరికా దెబ్బ?

అమెరికాలో ఐటీ ఔట్‌సోర్సింగ్ సేవలపై టారిఫ్‌లు విధించాలనే ప్రతిపాదనలు భారతదేశ ఐటీ రంగానికి భారీ సవాలుగా మారనున్నాయి.

By:  A.N.Kumar   |   7 Sept 2025 5:45 AM IST
ఔట్‌సోర్సింగ్‌పై టారిఫ్‌లు: ఇండియన్ ఐటీపై అమెరికా దెబ్బ?
X

అమెరికాలో ఐటీ ఔట్‌సోర్సింగ్ సేవలపై టారిఫ్‌లు విధించాలనే ప్రతిపాదనలు భారతదేశ ఐటీ రంగానికి భారీ సవాలుగా మారనున్నాయి. ఈ ప్రతిపాదనలు అమలైతే ముఖ్యంగా భారతీయ ఐటీ ఉద్యోగులపై, అలాగే దేశ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది.

*ఔట్‌సోర్సింగ్‌పై టారిఫ్‌లు: కారణాలు, ప్రభావాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధం గురించి తెలిసిందే. ఆ విధానాలకు మద్దతుదారుడు, సలహాదారు అయిన పీటర్ నవారో ఇప్పుడు వస్తువులకే కాకుండా ఔట్‌సోర్సింగ్ సేవలపైనా టారిఫ్‌లు విధించాలని ప్రతిపాదించారు. అమెరికన్ ఉద్యోగాలను రక్షించాలనే ఉద్దేశంతో ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. రిమోట్ సేవలు అందిస్తున్న దేశాలు అమెరికాలో వస్తువులు విక్రయిస్తున్న దేశాల మాదిరిగానే 'ఫీజు' చెల్లించాలనేది వారి వాదన. ఈ ప్రతిపాదన అమెరికాలోని టెక్ కార్మికులను సంతోషపెడుతున్నప్పటికీ, దీనికి అనేక చట్టపరమైన, ఆర్థిక సమస్యలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

* భారత ఐటీ రంగంపై ప్రభావం

భారత ఐటీ రంగం ఎక్కువగా అమెరికా మార్కెట్‌పై ఆధారపడి ఉంది. అమెరికా నుంచి వచ్చే ఆదాయం ఈ రంగానికి అత్యంత కీలకం. టారిఫ్‌లు అమలైతే ఔట్‌సోర్సింగ్‌ ఖర్చు విపరీతంగా పెరిగి, అమెరికన్ కంపెనీలకు భారతీయ సేవలు ఖరీదైనవిగా మారతాయి.

ఈ టారిఫ్‌లు నేరుగా కంపెనీలపై లేదా వారి కస్టమర్లపై భారం మోపుతాయి. ఫలితంగా ప్రాజెక్టుల వ్యయం పెరుగుతుంది. అమెరికా కంపెనీలు భారత్‌ నుంచి సేవలు తీసుకోవడం తగ్గిస్తాయి. కొత్త ప్రాజెక్టులు, డీల్స్‌ లభించడం కష్టమవుతుంది. భారతీయ ఐటీ కంపెనీల ఆదాయం, లాభాలు తగ్గుతాయి. ఈ పరిణామాలు భారతీయ ఐటీ ఉద్యోగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. కొత్త నియామకాలు తగ్గడం, జీతాలు స్తంభించడం, కొన్ని సందర్భాల్లో ఉద్యోగాలు కోల్పోవడం వంటి పరిస్థితులు తలెత్తవచ్చు.

*ఆర్థిక, చట్టపరమైన సవాళ్లు

అంతర్జాతీయ వాణిజ్య నిబంధనల ప్రకారం... వస్తువులకు టారిఫ్‌లు విధించడం సులభం. కానీ సేవలకు విధించడం చాలా సంక్లిష్టమైన విషయం. ఇంటర్నేషనల్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ICC) ప్రకారం.. ఒక దేశంలోకి సేవలు ఎప్పుడు 'ప్రవేశిస్తాయి' అనేది నిర్వచించడం కష్టం. అంతేకాకుండా సేవలకు గ్లోబల్ క్లాసిఫికేషన్ సిస్టమ్ లేదు. ఈ కారణాల వల్ల ఈ ప్రతిపాదన అమలు చేయడంలో తీవ్రమైన చట్టపరమైన, కార్యాచరణ, ఆర్థిక సవాళ్లు ఎదురవుతాయి.

*భవిష్యత్ కార్యాచరణ

ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి భారతీయ ఐటీ రంగం అప్రమత్తంగా ఉండాలి. ఇది కేవలం ఒక హెచ్చరికగా భావించి, కొత్త మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉంది. కేవలం అమెరికాపై ఆధారపడకుండా, యూరప్, ఆఫ్రికా, ఆసియా వంటి ఇతర దేశాల మార్కెట్లలో అవకాశాలు వెతకడం అనివార్యం చేసుకోవాలి. కృత్రిమ మేధస్సు (AI), ఆటోమేషన్ పరిష్కారాలపై మరింత దృష్టి పెట్టడం. తద్వారా తక్కువ ఖర్చుతో సేవలను అందించడం నేర్వాలి.. ఉద్యోగులు సాంకేతికతలో తమ నైపుణ్యాలను నిరంతరం పెంచుకోవాలి.

ఈ ప్రతిపాదనలు కేవలం అమెరికన్ ఉద్యోగాలను రక్షించడానికే కాకుండా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐటీ సంస్థలు, ఉద్యోగులు ఈ పరిణామాలను గమనిస్తూ, తమ భవిష్యత్‌ను సురక్షితం చేసుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలి.