విదేశీ విద్యార్థులకు భారీ షాక్: వర్క్ పర్మిట్ రద్దు చేసే దిశగా అమెరికా అడుగులు
అమెరికాలో విదేశీ విద్యార్థుల భవిష్యత్తును.. ముఖ్యంగా భారతీయ విద్యార్థుల కెరీర్ ఆశలను ఆందోళనలో నెట్టే పరిణామం చోటుచేసుకుంది.
By: A.N.Kumar | 15 April 2026 3:54 PM ISTఅమెరికాలో విదేశీ విద్యార్థుల భవిష్యత్తును.. ముఖ్యంగా భారతీయ విద్యార్థుల కెరీర్ ఆశలను ఆందోళనలో నెట్టే పరిణామం చోటుచేసుకుంది. అమెరికాలోని అత్యంత ప్రజాదరణ పొందిన ఓపీటీ (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ) ప్రోగ్రామ్‌ను రద్దు చేయాలని కోరుతూ రిపబ్లికన్ సెనేటర్ రిక్ స్కాట్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు లేఖ రాయడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెను సంచలనంగా మారింది. అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాల్లో కీలక మార్పులు వచ్చే సూచనలు కనిపిస్తున్న తరుణంలో ఈ లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది.
అమెరికన్ గ్రాడ్యుయేట్ల ప్రయోజనాలే లక్ష్యంగా..
సెనేటర్ రిక్ స్కాట్ తన లేఖలో ప్రధానంగా అమెరికన్ యువత ఎదుర్కొంటున్న ఉద్యోగ సంక్షోభాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం అమెరికాలో సుమారు 5 లక్షల మంది విదేశీ విద్యార్థులు ఓపీటీ వర్క్ పర్మిట్‌తో వివిధ కంపెనీల్లో పనిచేస్తున్నారని.. ఇది స్థానిక గ్రాడ్యుయేట్ల అవకాశాలను దెబ్బతీస్తోందని ఆయన ఆరోపించారు.
ముఖ్యంగా స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ ) రంగాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆయన గణాంకాలతో సహా వివరించారు. కంప్యూటర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగిత రేటు సాధారణం కంటే రెండింతలు ఉంది. కంప్యూటర్ సైన్స్ విద్యార్థులలో ఇది 50 శాతం ఎక్కువగా ఉంది. అమెరికన్ విద్యార్థులు లక్షల డాలర్ల అప్పులు చేసి చదువు పూర్తి చేసినా విదేశీ విద్యార్థుల నుండి ఎదురవుతున్న పోటీ వల్ల వారికి సరైన ఉపాధి దొరకడం లేదని స్కాట్ ఆవేదన వ్యక్తం చేశారు.
జాతీయ భద్రత, చైనా ముప్పు
ఈ పథకం కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా దేశ జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించిందని స్కాట్ హెచ్చరించారు. ముఖ్యంగా చైనా విద్యార్థుల గురించి ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు 33,000 మంది చైనా విద్యార్థులు స్టెమ్ ఓపీటీ ద్వారా అమెరికాలోని సున్నితమైన సాంకేతిక రంగాలు, యూనివర్సిటీలు, టెక్ కంపెనీల్లో పని చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వీరు అమెరికాకు చెందిన మేధో సంపత్తి, కీలక సమాచారాన్ని దొంగిలించి, టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ లేదా గూఢచర్యానికి పాల్పడే అవకాశం ఉందని ఆయన లేఖలో హెచ్చరించారు.
చట్టబద్ధతపై ప్రశ్నలు
ఓపీటీ ప్రోగ్రామ్ అసలు చట్టవిరుద్ధమని రిక్ స్కాట్ వాదించడం ఇక్కడ గమనార్హం. ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ ప్రకారం స్టూడెంట్ వీసాలు కేవలం చదువుకోవడానికి మాత్రమేనని.. కానీ ఓపీటీ ద్వారా వారికి పని చేసే అవకాశం కల్పించడం చట్ట నిబంధనలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. హెచ్1బీ వీసాల పరిమితిని అధిగమించేందుకు ఈ మార్గాన్ని వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు.
భవిష్యత్తుపై నీలి నీడలు
మరోవైపు అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం కూడా ఓపీటీ నిబంధనల్లో పెను మార్పులు చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. "మోసపూరిత కార్యకలాపాలను అరికట్టడం.. జాతీయ భద్రతను కాపాడటం.. అమెరికన్ కార్మికుల ప్రయోజనాలకు పెద్దపీట వేయడం మా ప్రథమ ప్రాధాన్యత" అని అధికారులు భావిస్తున్నారు.
ఈ పరిణామాలు గనుక అమలులోకి వస్తే అమెరికాలో స్థిరపడాలని కలలు కనే లక్షలాది మంది విదేశీ విద్యార్థులపై.. ముఖ్యంగా భారతీయులపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. అమెరికాలో చదువుకున్న తర్వాత వర్క్ ఎక్స్‌పీరియన్స్ సంపాదించడానికి ఓపీటీ ఒక ప్రధాన మార్గంగా ఉంది. దీని రద్దు లేదా కఠినతరం చేయడం అనేది అంతర్జాతీయ విద్యా మార్కెట్‌ను, అమెరికా టెక్ రంగంలోని ప్రతిభావంతుల లభ్యతను మార్చివేసే అవకాశం ఉంది. రాజకీయంగా కూడా ఈ అంశం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీయనుంది.
